పరీక్ష కేంద్రానికి వెళుతున్న విద్యార్థులు
ఎస్వీయూ దూర విద్య పరీక్షలు ప్రారంభం
Published Fri, Sep 9 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో పరీక్షల కోసం ఎంతో కాలం ఎదురు చూసిన విద్యార్థుల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు గురువారం నుంచి పరీక్షలు మొదలయ్యాయి. తొలిరోజు 36 వేల మంది పరీక్షలు రాశారు. రెండేళ్ల తర్వాత దూర విద్య విభాగం పీజీ, యూజీ పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్థులు ఆనందంగా పరీక్షలకు హాజరయ్యారు. ఎస్వీయూ దూరవిద్యవిభాగంలో చివరి సారిగా 2014 సంవత్సరం చివర్లో పరీక్షలు జరిగాయి. 2015లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. గురువారం నుంచి పరీక్షలు మొదలు కావడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరీక్షలు అక్టోబర్ 4 వరకు కొనసాగుతాయి.
59 కేంద్రాల్లో నిర్వహణ:
గురువారం నుంచి మొదలైన ఈ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 59 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 50 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేశారు. అయితే తొలిరోజు పరీక్షలకు కేవలం 36 వేల మంది మాత్రమే హాజరయ్యారు. మదనపల్లెలోని ఒక ప్రైవేట్ కశాశాలలో కాపీయింగ్ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులను పరీశీలకులు గుర్తించారు.
తొలి రోజు ప్రశాంతం
దూరవిద్య పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. మాస్ కాపీయింగ్ నిరోధానికి ఐదు ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. ఈ బృందం నిరంతర తనిఖీల వల్ల ఎక్కడ కాపీయింగ్ జరగలేదు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. – బి. చంద్రయ్య, ఎస్వీయూ పరీక్షల నియంత్రణాధికారి
Advertisement