
'డబ్బులు దండుకుంటున్న కృష్ణా జిల్లా మంత్రి'
విశాఖపట్నం: రాష్ట్రంలో సినిమా థియేటర్ల సర్వీస్ ట్యాక్స్ బకాయిలు రూ.500 కోట్లు రద్దు చేయిస్తామని చెబుతూ టీడీపీ ప్రభుత్వంలోని ఓ మంత్రి, ఆ పార్టీకి అండగా ఉండే ఏపీ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి అశోక్‌కుమార్‌తోపాటు పలువురు చాంబర్ ప్రతినిధులు డబ్బులు దండుకుంటున్నారని సినీ నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు.
ఒక్కో థియేటర్ యజమాని నుంచి రూ.50 వేల చొప్పున కమీషన్లు వసూలు చేస్తున్నారని, ఈ విధంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనే రూ.12కోట్లు వసూలు చేశారన్నారు. విశాఖపట్నంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... కృష్ణా జిల్లాకు చెందిన ఆ మంత్రి ప్రణాళిక ప్రకారమే థియేటర్ యజమానులు నుంచి అక్రమంగా వసూళ్లు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉంది కాబట్టి తాము చెప్పినట్లు వినాల్సిందేనని, లేక పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ గ్యాంగ్ థియేటర్ల యజమానులను బెదిరిస్తోందన్నారు. వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ప్రతినిధి వీర్రాజు, మోహినీ ఫిలిమ్స్ చిన్ని, జనార్దన, ఏపీ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ కార్యదర్శి రాజాం మాణిక్యం కలిసి థియేటర్ యజమానుల నుంచి రూ.12 కోట్లు వసూలు చేశారని చెప్పారు.