అంకెల గారడీతో అందలమెక్కుతారు కొందరు. ప్రజాభ్యున్నతి కోసం పునరంకితమవుతారు మరికొందరు. రెండో కోవకు చెందిన వ్యక్తి జగన్. ప్రజా సంక్షేమం అంటే.. నోటికొచ్చినన్ని పథకాలను వల్లె వేయడం.. అమలు చేయలేక చేతులెత్తేయడం కాదని విశ్వసించారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తొమ్మిది పథకాలను రూపొందించారు. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటా నవోత్సాహం నింపుతానని హామీ ఇస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అవుతారని.. ఆ ‘నవ’లోకాన్ని త్వరలోనే దర్శిస్తామని జిల్లా ప్రజలు మనసారా విశ్వసిస్తున్నారు.
– సాక్షి ప్రతినిధి, విజయనగరం
అమ్మ ఒడి
పిల్లల చదువుకు ‘అమ్మ ఒడి’ పథకం కింద అయిదో తరగతి వరకు రూ.500, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు రూ.750, ఇంటర్ విద్యార్థులకు రూ.1000 చొప్పున ఆ పిల్లల తల్లికే నేరుగా పంపిణీ చేస్తారు.
చక్కగా చదివిస్తాం..
వైఎస్ జగన్ రూపకల్పన చేసిన అమ్మ ఒడి కార్యక్రమం మాలాంటి నిరుపేద కుటుంబాలకు వరం. మాకు ఇద్దరు పాపలు, బాబు ఉన్నారు. ముగ్గురిని చదివించడం కష్టంగా ఉంది. సెంటు భూమి కూడా లేదు. కూలాడితే తప్ప కుండాడని బతుకులు మావి. పిల్లలను చదివించలేకపోతున్నాం. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి నెల వచ్చే డబ్బులతో మాలాంటి మా పిల్లలను చక్కగా చదివిస్తాం.
– పిల్లల మంగమ్మ, జామి
ఆరోగ్యానికి హామీ
ఆరోగ్య శ్రీకి బడ్జెట్‌లో ఎన్ని నిధులైనా కేటాయిస్తారు. కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్ ఇవ్వనున్నారు. దీంతో జిల్లాలోని 20 లక్షల మంది ఆరోగ్య శ్రీ లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఎందరో పేదలకు వరంగా ఉండేది. ఏ అనారోగ్యం వచ్చినా పేదలు నిశ్చింతగా ఉండి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. నేటి టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయ్యింది. జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడే ఆ పథకానికి పూర్వ వైభవం వస్తుంది.
– గూణాపు రమణ, పి.కోనవలస, సాలూరు మండలం
విద్యాసుగంధాలు
జిల్లాలో 63వేల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ పక్కాగా అమలు కానుంది. ప్రతి పేద విద్యార్థికి ఏటా రూ.20 వేలు చదువు ఖర్చుల కింద అందనుంది.
సాఫీగా చదువు
అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో ఫీజు రీయంబర్స్‌మెంట్ చేస్తానన్న జగన్ హామీ ఉన్నత చదువులు చదివే పేదలకు ఎంతో మేలు చేస్తుంది. మాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. పేదల చదువుకయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందన్న హామీతో ఎంతో ఆనందంగా ఉంది.
– బోను లిఖిత, 10వ తరగతి,
కరువుపై యుద్ధం
నలభై శాతమే పూర్తయిన తారకరామ తీర్థ ప్రాజెక్టు, మూడేళ్ళగా మిగిలిన పది శాతాన్ని పూరించుకోలేకపోతున్న తోటపల్లి ప్రాజెక్టు, అదనపు ఆయకట్టు లేని వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు, ఆంధ్ర–ఒడిశా అంతర్ రాష్ట్ర వివాదంలో చిక్కుకున్న జంఝావతి ప్రాజెక్టు సహా జిల్లాలోని సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జగన్ అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన పూర్తి కానుంది. జలయజ్ఞంతో జిల్లాలో కరువు అంతరిస్తుంది. బతుకు తెరువుకు వలస వెళ్ళాల్సిన దుస్థితి తప్పుతుంది.
తండ్రీకొడుకులదే ఘనత
జలయజ్ఙంలో భాగంగా తోటపల్లికి అత్యధిక నిధులు కేటాయించిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిది. ఆయన తరువాత వచ్చిన పాలకులు పిల్ల కాలువలు కూడా తవ్వకుండా ప్రారంభించేశారు. సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు నవరత్నాల పథకంలో భాగంగా జలయజ్ఙం కింద చేపట్టిన ప్రాజెక్టులకు పూర్తి స్థాయి సౌకర్యాలు, నిర్మాణాలు చేపడతామని దివంగత సీఎం తనయుడే హామీ ఇవ్వడంతో మాకెంతో ఆనందంగా ఉంది. అత్యధిక నిధులు వెచ్చించి, పొలాలకు సాగునీరందించే ఘనత తండ్రీ కొడుకులకే దక్కుతుంది. మా పొలాలు సస్యశ్యామలమవుతాయి.
– నగిరెడ్డి సీతం నాయుడు రైతు, తెర్లాం
జనంలోకి ‘నవరత్నాలు’
తమ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్సార్ సీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఒకవైపు అతి త్వరలో జిల్లాలో అడుగుపెట్టనున్న ‘ప్రజాసంకల్పయాత్ర’కు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు ఈ నెల 17 నుంచి జనం వద్దకు వెళ్లి నవరత్నాల గురించి వారికి వివరించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఆడపడుచులకు ఆసరా
‘వైఎస్సార్ ఆసరా’ పథకం కింద నాలుగు దశల్లో డ్వాక్రా రుణమాఫీ చేసి సున్నా వడ్డీకే రుణాలు ఇస్తారు. ఏటా రూ.50 వేలు అందజేస్తారు. దీంతో జిల్లాలో 55 వేల డ్వాక్రా సంఘాల మహిళలకు సాంత్వన కలుగుతుంది. ‘వైఎస్సార్ చేయూత’ పథకం కింద 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేల చొప్పున దశలవారీగా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా అందిస్తారు.
డ్వాక్రాలకు ఆసరా
వైఎస్సార్ సీపీ అధినేత జగన్ డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు రూపకల్పన చేసిన ఆసరా పథకం చాలా ఉపయోగపడుతుంది. డ్వాక్రా మహిళల రుణాలను నాలుగు ధపాలుగా నగదును నేరుగా వారికే అందజేయాలన్నది మంచి నిర్ణయం. తీసుకున్న రుణాలకు వడ్డీ ఉండదన్న హామీ మహిళలకు ఎంతో ఉపయోగకరం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న నమ్మ కం నాకుంది. – వల్లూరి గౌరి,
డ్వాక్రా సంఘం సభ్యురాలు, పాలవలస, గుర్ల మండలం
బడుగులకు గూడు
గూడు లేని బడుగులకు నీడ కల్పిస్తారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ఇళ్ళు నిర్మిస్తారు. దాదాపు 30 వేల మందికి పైగా పేదలకు ఆశ్రయమిస్తారు.
అందరికీ మేలు
టీడీపీ హయాంలో ఎన్నోసార్లు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాం. జన్మభూమి కమిటీల పెత్తనం వల్ల మాకు ఇళ్లు మంజూరు కాలేదు. టీడీపీ నేతలు, వారి అనుచరులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణంగా ఉంది. నవరత్నాలతో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది.
– గురాన అప్పారావు, విజయనగరం
మద్య నిషేధం గొప్ప హామీ
మద్యపానాన్ని నిషేధిస్తానని జగన్ నవరత్న పథకాల్లో హామీ ఇవ్వడం గొప్ప విషయం. ప్రతి గ్రామంలో, కుటుం బంలో మద్యం చిచ్చు పెడుతోంది. మద్యానికి బానిసలై సర్వం కోల్పోయి కుటుంబాన్ని రోడ్డున పడేసిన బతుకులు ఎన్నో ఉన్నాయి. మూడు దశల్లో నిషేధిస్తానని జగన్ హామీ ఇవ్వడం లక్షల కుటుంబాల్లో ఆశాజ్యోతుల్ని వెలిగించినట్టయింది.
– రెడ్డి శ్రీదేవి, పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment