జనంలోకి దూసుకెళ్తున్న నవరత్నాలు | YS Jagan Navaratnalu Hugely attracts people | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 24 2018 9:01 AM | Last Updated on Sat, Oct 20 2018 4:52 PM

YS Jagan Navaratnalu Hugely attracts people - Sakshi

నవరత్నాలు.. ఒకవైపు రాష్ట్ర విభజన కష్టాలు.. మరోవైపు చంద్రబాబు దుర్మార్గమైన పాలన.. ఈ రెండింటి నడుమ నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌లోని సామాన్య ప్రజానికాన్ని ఆదుకునేందుకు, వారికి ఆపన్నహస్తం అందించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సంకేమపథకాల సమాహారం. తాము అధికారంలోకి వస్తే.. నిరుపేద, మధ్యతరగతి సామాన్య ప్రజలను ఆదుకునేందుకు, వారికి అడుగడుగునా అండగా ఉండేందుకు, వారి సంక్షేమం కోసం నవరత్నాలు పథకాన్ని అమలు చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. నవరత్నాలు పథకానికి ప్రజల్లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఏ నోటా విన్న ఈ పథకం గురించే చర్చ జరుగుతోంది. ప్రజాసంకల్పయాత్ర దారి పొడవునా.. నవరత్నాల గురించి వైఎస్‌ జగన్‌ ప్రజలకు వివరిస్తూ వచ్చారు. దీంతో ఈ పథకం ప్రజల్లోకి విస్తృతం వెళ్లింది. ఈ పథకం వివరాలివి..

1. వైఎస్సార్‌ రైతు భరోసా
ఈ పథకంతో రైతన్న కుటుంబానికి ఏటా రూ.12,500 నుంచి రూ.లక్ష వరకూ ప్రయోజనం ఉంటుంది. ఉచిత బోర్లు వేయించడం, ఉచిత విద్యుత్‌ అందించడం, సున్నావడ్డీకి రుణాలు, రైతులు వాడే ట్రాక్టర్లపై రోడ్‌ ట్యాక్స్‌ మాఫీ ఇందులో వర్తించే అంశాలే.  ప్రభుత్వం ఏర్పడ్డ రెండో ఏడాది నుంచి మే నెలలో పెట్టుబడి కోసం ఏడాదికి రూ.12,500 చొప్పున వరుసగా నాలుగేళ్లు అందిస్తారు. వ్యవసాయానికి పగలే 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తారు. ఆక్వా రైతులకు కరెంట్‌ చార్జీలను యూనిట్‌కు రూ.1.50కు తగ్గిస్తారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకతి వైపరీత్యాల సహాయ నిధి ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, అవసరమైతే ఆహారశుద్ధి యూనిట్లను ఏర్పాటు చేస్తారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరించి.. రెండో ఏడాది నుంచి సహకార డైరీలకు పాలుపోసే పాడి రైతులకు లీటర్‌కు రూ.4 సబ్సిడీ ఇస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.5 లక్షలు చెల్లిస్తారు. ఆ మొత్తాన్ని అప్పులవాళ్లు తీసుకోకుండా చట్టం చేస్తారు.


2. ఫీజు రీయింబర్స్‌మెంట్‌
పేదవాడి చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ మొత్తం కాకుండా విద్యార్థులకు వసతి, భోజనం కోసం ఏటా అదనంగా రూ. 20 వేలు ఇస్తారు.


3. ఆరోగ్యశ్రీ
ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ మేలు జరుగుతుందని అంచనా. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తారు. ఎన్ని లక్షలు ఖర్చయినా  ఆరోగ్యశ్రీ ద్వారానే ఉచిత వైద్యం అందిస్తారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైతో పాటు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లను దీని పరిధిలోకి తెస్తారు. ఆపరేషన్‌ చేయించుకున్న లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక చేయూతనందిస్తారు. కిడ్నీవ్యాధి, తలసేమియాతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రతినెలా రూ.10 వేలు పింఛన్‌ ఇస్తారు.


4. జలయజ్ఞం
లక్షలాది రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతుల లోగిళ్లలో సిరులు నింపుతారు.


5. మద్యపాన నిషేధం
కుటుంబాల్లో చిచ్చుపెడుతూ, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తున్న మద్యం రక్కసిని మూడు దశల్లో నిషేధిస్తారు. తద్వారా రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు వెలకట్టలేని సంతోషం కలిగించాలనేది ఉద్దేశం.


6. అమ్మఒడి
పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అమ్మఒడి పథకం ద్వారా అందిస్తారు.


7. వైఎస్సార్‌ ఆసరా
ఈ పథకం కింద వచ్చే ఎన్నికల రోజు వరకు ఉన్న పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా అక్కచెల్లెమ్మల చేతికే నేరుగా ఇస్తారు. అంతేకాకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారు. ఆ వడ్డీ డబ్బును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. దీనివల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.50 వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా వైఎస్సార్‌ చేయూత ద్వారా 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పింఛన్లు ఇస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో రూ.75 వేలు దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా అందిస్తారు.  


8. పేదలందరికీ ఇళ్లు
ఈ పథకం వల్ల ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకూ ప్రయోజనం చేకూరుతుంది. ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తారు. ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టాలన్నది లక్ష్యం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అవసరమైతే ఆ ఇంటి మీద పావలా వడ్డీకే బ్యాంకులో రుణం ఇప్పిస్తారు.


9. పింఛన్ల పెంపు
ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.24,000 నుంచి రూ.48,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం పింఛన్‌ తీసుకోవ డానికి ఉన్న వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తారు. అవ్వతాతలకు నెలకు రూ.2000, దివ్యాంగులకు రూ.3000 పింఛన్‌ అందిస్తారు.

చదవండి: రావాలి జగన్‌.. కావాలి జగన్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement