
సాక్షి, విజయవాడ: విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ముగిసాయి. శనివారం అమ్మవారికి పూర్ణాహుతితో అర్చకులు శరన్నవరాత్రి వేడుకలను ముగింపు పలికారు. అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం జరగనుంది. దసరా పండుగ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ దర్శనానికి రెండు కిలోమీటర్లు భక్తులు బారులు తీరారు.
మరోపక్క, విజయవాడ దుర్గ గుడికి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పీఎన్‌బీఎస్ బస్టాండ్, కుమ్మరిపాలెం వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. కాలినడక ఎక్కువ కావడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్సవాల చివరి రోజు కావడంతో వీఐపీలు, భవానీ భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు.