త్యాగాలకు అవమానాలే బహుమానం | NCST Presents Report On Polavaram Project To President | Sakshi
Sakshi News home page

త్యాగాలకు అవమానాలే బహుమానం

Published Thu, Jul 26 2018 9:35 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

NCST Presents Report On Polavaram Project To President - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన గిరిజనులకు పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జాతీయ గిరిజన కమిషన్‌ ఇటీవల రాష్ట్రపతి కోవింద్‌కు నివేదిక అందజేసింది. గిరిజనుల నుంచి సేకరించిన భూమికి బదులుగా ప్రభుత్వం ఇస్తున్న భూమి సాగుకు యోగ్యంగా లేదని పేర్కొంది. బండరాళ్లు, చెట్లు, పుట్టలతో కూడిన బంజరు భూమిని అంటగడుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. గిరిజనులకు పునరావాసం కల్పించేందుకు నిర్మిస్తున్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవని, జీవన ప్రమాణాలు పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేస్తున్న గిరిపుత్రులను ప్రభుత్వం అవమానిస్తోందని తెలిపింది. వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు మెరుగైన పునరావాసం కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరింది.

క్షేత్రస్థాయిలో పర్యటన, సమీక్ష
సహాయ, పునరావాస ప్యాకేజీ అమల్లో డొల్లతనాన్ని జాతీయ గిరిజన కమిషన్‌ బహిర్గతం చేయడం కలకలం రేపుతోంది. పోలవరం ముంపు గ్రామాల్లో మార్చి 26, 27న గిరిజన కమిషన్‌ పర్యటించింది. భూసేకరణ, పునరావాసం కల్పనలో గిరిజనులకు అన్యాయం జరుగుతున్నట్లు గుర్తించింది. మార్చి 28న  సీఎం చంద్రబాబు, జలవనరులశాఖ అధికారులు, సహాయ పునరావాస విభాగం కమిషనర్‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైన అంశాల ఆధారంగా రూపొందించిన నివేదికను జూలై 3న రాష్ట్రపతికి అందజేసింది.

3,922 కుటుంబాలకే పునరావాసం
పోలవరం జలాశయంలో ముంపునకు గురువుతున్న భూమిలో సింహభాగం అడవి బిడ్డలదేనని జాతీయ గిరిజన కమిషన్‌ గుర్తించింది. భూమికి బదులుగా గిరిజనులకు  ఇస్తున్న విస్తీర్ణానికి పొంతన లేదని తెలియజేసింది. బంజరు భూముల్లో గిరిజనులు పంటలు పండించుకోవడం ఎలా సాధ్యమని నివేదికలో ప్రశ్నించింది. పోలవరం వల్ల 98,818 కుటుంబాల ప్రజలు నిర్వాసితులుగా మారుతారని.. ఇప్పటిదాకా కేవలం 3,922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారని స్పష్టం చేసింది.

గిరిజనుల కోసం 10 ప్రతిపాదనలు
త్యాగధనులైన గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేలా ప్యాకేజీ అమలు చేయడానికి గిరిజన కమిషన్‌ 10 ప్రతిపాదనలు చేసింది. గిరిజనుల నుంచి ఎంత భూమిని సేకరిస్తే పరిహారం కింద అంతే భూమి ఇవ్వాలని సూచించింది. ఇందులో కనీసం 2.50 ఎకరాలను పోలవరం ప్రాజెక్టు ఆయకట్టులో కేటాయించాలంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహానది బొగ్గు గనుల నిర్వాసితులకు ఇచ్చిన తరహాలోనే పోలవరం నిర్వాసితులకూ పరిహారం చెల్లించాలని పేర్కొంది. నిర్వాసితుల పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కళాశాలలు, విశ్వవిద్యాలయం, ఎయిమ్స్‌ వంటి సంస్థలను ఏర్పాటు చేయాలని వెల్లడించింది. నిర్వాసితుల కాలనీలకు అనుబంధంగా పారిశ్రమిక వాడను ఏర్పాటు చేయాలని.. పదేళ్లపాటూ వంద శాతం పన్ను రాయితీలు ఇచ్చి పరిశ్రమలను ఏర్పాటు చేసేలా పోత్సహించాలని, అందులో నిర్వాసితులైన గిరిజనులకు ఉపాధి కల్పించాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనలను అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని రాష్ట్రపతికి జాతీయ గిరిజన కమిషన్‌ విజ్ఞప్తి చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement