బద్వేలు అర్బన్: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఉంది నియోజకవర్గంలోని చౌకదుకాణాల డీలర్ల పరిస్థితి. అధికారంలోకి వచ్చిరాగానే తెలుగుతమ్ముళ్లు డీలర్‌షిప్‌లపై కన్నేశారు. ముందుగా ఇన్‌చార్జిల కింద కొనసాగుతున్న చౌకదుకాణాలపై దృష్టి పెట్టారు. ఈ మేరకు ఆయా మండలాల తహశీల్లార్లకు ఫోన్లు చేసి చౌకదుకాణాల వివరాలను తెలుసుకుంటున్నారు. జరుగుతున్న విషయాలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు సమాయత్తమవుతున్నారు.
నియోజకవర్గంలో మొత్తం155 చౌకదుకాణాలు ఉన్నాయి. ఇందులో 116 దుకాణాలకు రెగ్యులర్ డీలర్లు ఉండగా 39 ఇన్‌చార్జిల కింద నడుస్తున్నాయి. వీటిలో 39 చౌకదుకాణాలను కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నిర్వహిస్తున్నారు
అధికారులపై ఒత్తిళ్లు
నియోజకవర్గంలో ఇన్‌చార్జి డీలర్లతో కొనసాగుతున్న చౌకదుకాణాలను తెలుగుతమ్ముళ్లకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. బద్వేలు మండలంలో 10, గోపవరంలో 8, పోరుమామిళ్లలో 3, కలసపాడులో 2, కాశినాయనలో 5, అట్లూరులో 8, బి.కోడూరులో 3 చౌకదుకాణాలు ఇన్‌చార్జి డీలర్ల నిర్వహణలో ఉన్నాయి. వీరిని తొలగించేందుకు ముఖ్య నేతల ద్వారా అధికారులపై తెలుగుతమ్ముళ్లు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన కొందరు ఇన్‌చార్జి డీలర్లు రాజీనామాకు సిద్ధమవుతున్నారు.
రెగ్యులర్ డీలర్లపైనా కన్ను
ప్రస్తుతం ఇన్‌చార్జి డీలర్లపై దృష్టి పెట్టిన తెలుగుతమ్ముళ్లు రెగ్యులర్ డీలర్లకు కూడా ముహూర్తం పెడుతున్నట్లు సమాచారం. ఏదో ఒక సాకు చూపి డీలర్‌షిప్‌ను తొలగించేందుకు వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. డీలర్‌షిప్‌ల వ్యవహారంలో తెలుగుతమ్ముళ్లు వ్యవహరిస్తున్న తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేం దుకు వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధమవుతున్నారు.
మాకే కావాలి..!
Published Sat, Jun 28 2014 2:03 AM | Last Updated on Tue, May 29 2018 2:26 PM
Advertisement