సాక్షి, రాజమండ్రి : ‘పుష్కరాలకు సంబంధించి ఆరేడు సమావేశాలయ్యాయి. ఇంతవరకూ ఘాట్‌లు చూడకుండా కళ్లు మూసుకున్నారా?’.. ఇరిగేషన్ అధికారులపై కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆగ్రహం ఇది. పుష్కర సన్నాహాలపై వివిధ శాఖల సవరించిన ప్రతిపాదనలను స్వీకరించేందుకు శుక్రవారం ఆమె రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రతిపాదనలు ఇచ్చేందుకు మరో వారం గడువు కావాలని ఇరిగేషన్ అధికారులు కోరడంతో కలెక్టర్ మండిపడ్డారు. ‘మీ ఎస్‌ఈ ఎక్కడ? ముఖ్యమైన సమావేశమన్నా వేరే క్యాంపులేంటి?’ అని అసహనం వ్యక్తం చేశారు. వరదల కారణంగా ఘాట్‌లు పరిశీలించలేక పోయామనడంతో ‘వరదలు ఇప్పుడొచ్చాయి. అంతకు ముందు ఏం చేస్తున్నారు?’ అని నిలదీశారు. వారి అలసత్వం వల్ల ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు సంజాయిషీ చెప్పుకోవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతోందన్నారు. రాత్రింబవళ్లు పనిచేసైనా సోమవారంలోగా నివేదికలు అందించాలని ఆదేశించారు.