ఇంత నిర్లక్ష్యమా...?
- సర్కారీ కళాశాలల్లో భర్తీకాని అధ్యాపక పోస్టులు
- జిల్లాలో 60పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యార్థులు జీవితంలో కీలకంగా భావించే ఇంటర్మీడియట్ విద్యపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ జూనియర్ కళాశాలల్లో వందలాది అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండేళ్లుగా ఈ కళాశాలల్లో ఖాళీలను భర్తీచేయకపోవడంతో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు ఫెయిలవుతున్నారు. జిల్లాలో నాలుగేళ్ల క్రితం మంజూరైన కొయ్యాం, ఎల్.ఎన్.పేట, జి.సిగడాం, రాజాం జూనియర్ కళాశాలలతో కలిసి 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి.
ఇందులో జనరల్ కోర్సులకు సంబంధించి వివిధ సబ్జెక్టుల్లో 47, ఒకేషనల్‌లో 13 మొత్తం 60 లెక్చరర్ పోస్టులు భర్తీకావాల్సి ఉంది. ఇంటర్‌విద్యలో అత్యధికశాతం ఫెయిలయ్యే ఇంగ్లిష్ పోస్టులు అత్యధికంగా 12 ఖాళీలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. కఠినమైన సైన్స్ సబ్జెక్టులతోపాటు, లాంగ్వేజ్ సబ్జెక్టులు, ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించిన సబ్జెక్టులు సైతం భర్తీకావాల్సి ఉన్నాయి. జిల్లాలో టెక్కలి జూనియర్ కళాశాలలో అత్యధికంగా ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే అక్కడి ఫలితాలపై ఏమేరకు ప్రభావం చూపించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది విశ్రాంత లెక్చరర్స్‌తో పాఠాలు బోధించి మమ అనిపించారు. ఈ విద్యాసంవత్సరంలో సైతం అదే విధంగా విశ్రాంత లెక్చరర్లతోనే కాలక్షేపం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్న ఖాళీలను కనీసం కాంట్రాక్ట్ లెక్చరర్స్‌తో భర్తీచేసేందుకైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్‌చేస్తున్నారు.
ఇవీ ఖాళీలు..
జిల్లాలో ఇంగ్లిష్‌లో అత్యధికంగా 12 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇక మాథ్స్ ఆరు, ఎకనామిక్స్ ఆరు, బాటనీ నాలుగు, హిస్టరీ నాలుగు, జువాలజీ మూడు, కామర్స్ మూడు, తెలుగు రెండు, ఫిజిక్స్ రెండు, ఒరియా రెండు, కెమిస్ట్రీ, జాగ్రఫీ, హిందీ చెరొక పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల ప్రైవేటు కళాశాలలను ఆశ్రయిస్తున్నారు.
కమిషనర్‌కు నివేదించాం
జిల్లాలో ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలను బోర్డు కమిషనర్‌కు నివేదించాం. గత ఏడాది విశ్రాంత లెక్చరర్స్‌తో క్లాసులు చెప్పించాలని బోర్డు ఆదేశించింది. ఈ ఏడాదికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఉత్వర్వులు అందలేదు. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం. ఖాళీలు భర్తీచేయకుంటే విద్యార్థులకు నష్టమే.
- పాత్రుని పాపారావు, డీవీఈవో, ఇంటర్‌విద్య