సాక్షి, నెల్లూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా వాసులు 44వ రోజూ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించారు. కావలిలో గురువారం ‘కావలి కేక’ పేరుతో లక్షగళ ఘోష కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతలతో పాటు విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అందరూ వెలుగెత్తి చాటారు. సమైక్య రాష్ట్రం కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రతిజ్ఞబూనారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు మూతపడ్డాయి. సమైక్యవాదులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిరసన దీక్షలు కొనసాగించారు. ఆర్‌టీసీ బంద్ కొనసాగుతోంది. విద్యుత్ ఉద్యోగులు 72 గంటలు సమ్మెకు దిగారు.
నగరంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండు నుంచి వీఆర్‌సీ వరకు నిరసన ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. ఏపీఎన్‌జీఓ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. వీఎస్‌యూ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన, గాంధీబొమ్మ కూడలిలో రోడ్డుపైనే యోగా ప్రదర్శన చేశారు.
ఉదయగిరిలో బస్టాండ్ ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు గురువారం కొనసాగాయి. పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయ సిబ్బంది దీక్షలు చేశారు. మండలంలోని గండిపాళెం పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు దీక్షలు చేపట్టారు. వరికుంటపాడులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. దుత్తలూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. సీతారామపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. వెంకటగిరి పట్టణంలో గురువారం ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్‌వీఎం ఉన్నత పాఠశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరులో వ్యాయామ ఉపాధ్యాయులు రోడ్డుపైనే డ్రిల్ చేశారు.
సమైక్యాంధ్ర కోరుతూ పొట్టి శ్రీరాముల విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రవీంద్రభారతి పాఠశాల విద్యార్థులు టవర్‌క్లాక్ కూడలి ప్రాంతంలో రాస్తారోకో నిర్వహిం చారు. కోట మండలంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు, చిట్టమూరు మండలంలోని ఉపాధ్యాయులు గురువారం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రిలేదీక్షలు చేపట్టారు. కోవూరులోని ఎన్జీఓ హోంలో గుమ్మళ్లదిబ్బ వాసుల ధర్నా చేశారు. ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం గ్రామస్తులు సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై రాస్తారోకో చేశారు. అనంతరం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. పొదలకూరులో గురువారం ఉపాధ్యాయులు, వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. ఈనెల 17న జరిగే పొలికేకను విజయవంతం చేసేందుకు ఎంపీడీఓ, ఎంఆర్‌ఓ, ఎంఈఓ, ఉపాధ్యాయ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. సూళ్లూరుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. ఉగ్గుమూడి సర్పంచ్, వార్డు సభ్యులు దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని వీధులు చిమ్మూతూ నిరసన తెలిపారు. తడలో సమైక్యపోరులో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కాదలూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయుడుపేటలోని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. సమైక్యపోరులో అసువులు బాసిన శంకరయ్య యాదవ్‌కు నివాళులర్పించి దీక్షను కొనసాగిస్తున్నారు. స్వర్ణముఖి గర్జనకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అదే జోరు
Published Fri, Sep 13 2013 4:47 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement