నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: ఏబీవీపీ అండదండలు ఉం డడంతోనే తాము విద్యార్థి దశలో కనకమహల్ థియేటర్ నిర్వాహకుడు, పేరు మోసిన మల్లయోధుడు నె ల్లూరు కాంతారావును ఎదురించామని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు గత స్మృతులను నెమరు వేసుకున్నారు. ఏబీవీపీ 32వ రాష్ట్ర మహాసభలు స్థానిక కస్తూరిదేవి గార్డెన్స్‌లో రెండో రోజు శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పూర్వకార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జాతి గర్వించదగిన నాయకులు సుభాష్‌చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్, వీరసవర్కార్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. ఎయిర్‌పోర్టులకు ప్రముఖుల పేర్లను తొలగించి రాజీవ్‌గాంధీ పేరును పెట్టడం విడ్డూరమన్నారు. బీజేపీ అధికారం చేపడితే భారతదేశ చరిత్రను ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెడతామన్నారు.
ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు పి.మురళీమనోహర్ మాట్లాడుతూ ఏబీవీపీ కోసం అశువులు బాసిన జిల్లా వాసి గౌరీశంకర్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పూర్వకార్యకర్తలకు సూచించారు. జాతీయ భద్రతాసెల్ కన్వీనర్ పేరాల చంద్రశేఖర్ మాట్లాడుతూ పూర్వకార్యకర్తలు స్థానిక సంస్థలపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని పలు దేవాలయాలు, సహకార బ్యాంకు, సహకార సంఘాలు తదితర స్థానిక సంస్థలలో అధికారం చేజిక్కించుకోవడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా భారతీయ మహిళా పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
వెంకయ్యనాయుడును పూర్వకార్యకర్తలు ఘనంగా సన్మానించారు. స్వాగత సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ అనిల్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సహసంఘన కార్యదర్శి రఘునందన్, మంత్రి శ్రీనివాస్, గుంతా లక్ష్మణ్, సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, హరికుమార్‌రెడ్డి, దీపా వెంకట్, ఆమంచర్ల శంకరనారాయణ, సురేంద్రరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, భాస్కర్‌రెడ్డి, తోట శ్రీనివాసులు, ఈశ్వర్ పాల్గొన్నారు.
అబ్దుల్ కలాం ఆశయాలకు
అనుగుణంగా..
విద్యార్థులు అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా కలలను సాకారం చేసుకోవాలని ఏబీవీపీ అఖిలభారత సహసంఘటన కార్యదర్శి కేఎన్ రఘునందన్ అన్నారు. ఏబీవీపీ కార్యకర్తలు రెండో రోజు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పునర్నిర్మాణం కోసం కార్యకర్తలు నడుంబిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అంజనీ శ్రీనివాస్, కార్యదర్శి సునీల్‌రెడ్డి పాల్గొన్నారు.
నెల్లూరు కాంతారావును ఏబీవీపీ అండతోనే ఎదిరించా
Published Sun, Jan 26 2014 3:43 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement