నెల్లూరులో నేరగాళ్ల జాడలు
నిఘా డొల్ల.. రక్షణ చర్యలూ శూన్యం
లాడ్జిల్లో అసాంఘికశక్తుల పాగా
నెల్లూరు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతే వేగంగా నేర సంస్కృతి సైతం విస్తరిస్తోంది. రాష్ట్రంతో పాటు దేశంలో ఎక్కడ ఏం జరిగినా దాని మూలాలు జిల్లాలోనే ఉన్నట్లు అనేక సంఘటనల్లో వెలుగుచూస్తున్నాయి. ప్రశాంతతకు మారుపేరైన జిల్లాను మకాంగా చేసుకుని నేరగాళ్లు ఇతర ప్రాంతాల్లో పంజా విసురుతున్నారు. ఇంత జరుగుతున్నా నిఘా వ్యవస్థ మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. అసాంఘిక శక్తులకు కళ్లెం వేయాల్సిన కౌంటర్ ఇంటెలిజన్స్, ఆక్టోపస్, స్పెషల్‌బ్రాంచ్ విభాగాలు నామమాత్రంగా పని చేస్తున్నాయని సంచలన సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు తరలి వస్తున్నారు. వారి ముసుగులో ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు జిల్లాకు తరలివచ్చి ఇక్కడే మకాం వేసి నేరాలకు పాల్పడుతున్నారు.
నెల్లూరు (క్రైమ్) : జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు దీటు గా రక్షణ చర్యలు చేపట్టలేదన్న విమర్శలున్నాయి. నిఘా నిస్తేజంగా మారింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం లో అధికారుల విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేని దుస్థితిలో నగరం ఉంది. ఇక షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, హోటల్స్, లాడ్జిల విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రక్షణ వ్యవస్థ ఆర్టీసీ బస్టాండ్లలో కనీసం జేబు దొంగలను కట్టడి చేసే పరిస్థితిలో కూడా లేదు. ఇక రైల్వేస్టేషన్‌లో పని చేయని మెటల్ డిటెక్టర్లను మూలనపడేశారు. రైలుమార్గాల ద్వారా బంగారు, వెండి ఆభరణాలు, గంజా యి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వీటిని నిలువరించడంలో రైల్వే భద్రతా వ్యవస్థ విఫలమైయ్యారన్న విమర్శలున్నాయి.
లాడ్జిల్లో అసాంఘిక శక్తుల మకాం
లాడ్జిలపై పోలీసు నిఘా కొరవడింది. దీంతో అసాంఘిక శక్తులు తిష్టవేసి తమ కార్యకలాపాలను నెరుపుతున్నారన్న విమర్శలున్నాయి. పేకాట, వ్యభిచారం, బెట్టింగ్‌లు లాడ్జిల్లో జోరుగా సాగుతున్నాయి. నేరం జరిగిన వెంటనే పోలీసులు శివారు ప్రాంతాల్లో, నగరంలో అప్రమత్తమై తనిఖీలు చేస్తున్నారు తప్పితే లాడ్జిలను పట్టించుకోవడం లేదు. దీంతో నేరాలకు పాల్పడి దర్జాగా లాడ్జిల్లో తలదాచుకుంటున్నారు. గతంలో నగరానికి చెందిన ఓ యువకుడు ఇతర ప్రాంతాల నుంచి నేరగాళ్లను తీసుకువచ్చి లాడ్జిలో ఉంచి నేరాలకు పాల్పడ్డారు.
నెల రోజుల పాటు వారు నేరాలు చేస్తూ నగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసినా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. అసాంఘికశక్తులు టూరిస్టులు, పరిశ్రమల్లో పనులకొచ్చామని లాడ్జిలో దిగి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి లాడ్జిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం లేదు. లాడ్జిలో అద్దెకు దిగేవారి ఆధార్‌కార్డు, పాన్‌కార్డ్, రేషన్‌కార్డు, ఓటర్‌కార్డు తదితరాల్లో ఏదో ఒక గుర్తింపు కార్డు చూపితేనే గదులు ఇవ్వాల్సి ఉంది. ఇది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో లాడ్జిల్లో ఎవరు దిగుతున్నారన్న విషయం ఎవరికి తెలియడంలేదు.
గతంలో లాడ్జిల్లో ఎవరైనా వ్యక్తులు దిగితే వారి పూర్తి బయోడేటా తదితరాలను ఆయా ప్రాంత పోలీసుస్టేషన్‌కు ప్రతి రోజు లాడ్జి సిబ్బంది అప్పగించేవారు. కాలక్రమేణా ఆ ప్రక్రియ ఆగిపోయింది. లాడ్జిల యాజమాన్యాలతో పరిచయాల వల్ల వాటిపై పోలీసులు కనీస దృష్టి సారించడంలేదన్న విమర్శలున్నాయి. దీంతో నేరగాళ్లు లాడ్జిలో మకాంవేసి దర్జాగా చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. నేరం జరిగిన సమయంలో హడావుడి చేయడం కన్నా.. ప్రతి రోజు శివారు ప్రాంతాలతో పాటు లాడ్జిలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు వాపోతున్నారు.