నేతన్నకు చేయూత | Netannaku Support | Sakshi
Sakshi News home page

నేతన్నకు చేయూత

Published Sun, Jan 11 2015 1:56 AM | Last Updated on Mon, May 28 2018 3:33 PM

నేతన్నకు చేయూత - Sakshi

నేతన్నకు చేయూత

కృష్ణమ్మ చెంతన మంగళాద్రిపై కొలువైన ఉగ్ర నరసింహుడు.. అగ్గిపెట్టెలో చీరను ఇమడ్చగల నేతన్నలు.. భూమికి పచ్చని రంగేసినట్టు ఉండే పంట పొలాలు.. ఆసియాలోనే అతి పెద్దదైన దుగ్గిరాల పసుపు మార్కెట్.. మంగళగిరి నియోజకవర్గానికే తలమానికాలు. అయినా ఈ ప్రాంతంలోనూ సామాన్యులు సమస్యలతో  సతమతమవుతున్నారు.

రోజంతా శ్రమించినా కడుపు నిండని చేనేత కార్మికులు.. ఆరుగాలం కష్టపడినా పంటకు గిట్టుబాటు ధర లేక అవస్థ పడుతున్న పసుపు రైతులు. బంగారం పండే భూములను ఎక్కడ లాగేసుకుంటారోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్న రాజధాని ప్రాంతవాసులు.. ఇన్ని సమస్యల నేపథ్యంలో వారికి అండగా ఉన్నానంటూ భరోసా ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే). సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా నియోజకవర్గంలో పర్యటించిన ఆర్కే సామాన్యుడి సమస్యల్ని తనవిగా భావించి పరిష్కారానికి కృషి చేస్తాన న్నారు.
 
 ఆర్కే : నమస్కారం. మనమిప్పుడు ఆసియాలోనే అతి పెద్దదైన దుగ్గిరాల పసుపు మార్కెట్‌లో ఉన్నాం. ఇక్కడి సమస్యలేమిటో పసుపు రైతులను అడిగి తెలుసుకుందాం.
 ఆర్కే : నమస్తే... రైతన్నా..!  ఏ ఊరన్నా?
 కోటేశ్వరరావు: అత్తోట యాదవపాలెం.
 ఆర్కే : పసుపు రైతుగా నీకేమైనా సమస్యలుంటే చెప్పన్నా?
 కోటేశ్వరరావు :  ఏం చెప్పమంటారు సార్. ఏడాది పొడవునా కష్టపడి పండించి యార్డుకు పసుపు కొమ్ములు తెస్తే పెట్టుబడి తప్ప మరింకేమీ మిగలడం లేదు. గతంలో దర్జాగా బతికాం.కనీసం పది వేలన్నా ఉంటే కానీ గిట్టుబాటు కాదు సార్. ఆరువేలు, ఏడు వేలకు మించి ధర రానే రావడం లేదు.
 దాసరి సుజాత : మాది తెనాలి సార్. మూడెకరాలలో గతేడాది పసుపు సాగు చేశాను. వ్యవసాయ ఖర్చులు పెరగడంతో పసుపుకు పదివేలు కనీస మద్ధతు ధర ఉంటే కానీ గిట్టుబాటు కాదు.
 
 ఆర్కే: నీ పేరేంటి తల్లీ?
 మహిళ: కంచర్ల వెంకటసుబ్బమ్మండీ..
 ఆర్కే: ఇక్కడ  ఎంత మంది మహిళలు పని చేస్తున్నారు? రోజుకు ఎంత సంపాదిస్తున్నారు?
 మహిళ: 40 మందిమి ఇక్కడ పని చేస్తున్నామయ్యా. ఇక్కడ జరిగే కొనుగోళ్లను బట్టి వందో...నూటాయాభయ్యో సంపాదిస్తాం. ఆర్కే: ఇక్కడ బాగా దుమ్మూ, ధూళి పేరుకుపోయి ఉంది కదా.. మీకు దీని ఫలితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏమిటి?
 మహిళ: మా తిప్పలు మేము పడాల్సిందే. మాలో ఓపికుంటే పని చేయించుకుంటారు. లేకపోతే పక్కకు నెట్టేస్తారు కానీ మా ఆరోగ్యం గురించి ఆలోచించేదెవరయ్యా?  
 ఆర్కే: ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను.
 
 (తుమ్మపూడి-మోరంపూడి ప్రాంతం బకింగ్‌హామ్ కెనాల్ ఉరవడిగా పారుతూ ఉంటుంది. రోడ్డుకూ దీనికీ మధ్య రక్షణ గోడ లేకపోవడంతో ఇక్కడ ప్రమాదాలు నిత్య కృత్యమైపోయాయి. తాజాగా ఒక పత్తిలారీ ఇక్కడ ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కకు జారి కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ఈ రూట్‌లో భార్యాబిడ్డలతో కలసి
 ట్రాక్టర్‌పై వస్తున్న కొలకలూరు
 వాసి సుధాకర్‌ను ఆపి..)
 ఆర్కే - అన్నా ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతాయన్న సంగతి తెలిసి కూడా ఇలా ఏ మాత్రం రక్షణ లేకుండా భార్యాబిడ్డలతో ఎలా ప్రయాణిస్తున్నావ్?
 సుధాకర్ - ఈ ట్రాక్టర్‌తో సిమెంట్ రాయిని సరఫరా చేస్తాను సార్. ప్రమాదం కదాని ప్రయాణం మానుకుంటే మా నోట్లోకి ముద్దపోయేదెట్టా సార్?
 జడ్పీటీసీ యాల్ల జయలక్ష్మి - రేవేంద్రపాడు వంతెన కూడా శిథిలావస్థకు చేరుకుంది సార్. అయినా ఇది తప్ప ఇక్కడి వారికి మరో మార్గం లేదు.  దీని స్థానంలో కొత్త వంతెన నిర్మించాలి.
 
 తాడేపల్లి క్రిస్టియన్ పేటలో మగ్గం నేసే కార్మికులతో
 ఆర్కే: నేతన్నా నీ పేరేంటి?
 నేతన్న: తాటిపాముల సాంబశివరావు అయ్యా.
 ఆర్కే: చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉంది. మీరు నేస్తున్న చీరలకు గిరాకీ ఉంటుందా?
 సాంబశివరావు : అయ్యా తమరికి తెలియనిది కాదు. ఇప్పుడు మేము నేసే వస్త్రాలకు గిరాకీ ఎక్కడుంది? ఫ్యాషన్ల మోజులో పడి మమ్మల్నీ, మా దుస్తుల్నీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ఒకప్పుడు 16వేల మగ్గాలుండే ఈ ప్రాంతంలో ఇప్పుడు 1100మగ్గాలే ఆడుతున్నాయి. మాకు ఇంకో పని చేతగాక వీటినే ఆడించుకుని రోజుకు అరవయ్యో, డెబ్బయ్యో సంపాదించుకుంటున్నాం. ఒక మనిషి నిండుగా టిఫిన్ చేస్తే 50 రూపాయలు ఖర్చయ్యే నేటి రోజుల్లో మా సంపాదన ఏ మూల కబురయ్యా.
 ఆర్కే : తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో మీ సంక్షేమానికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతానని చంద్రబాబు చెప్పారు కదా?  
 సాంబశివరావు : పేరుకే సార్ ఏ పథకమైనా. మా బోటి పేదోళ్లకు కాదు.
 ఆర్కే : మరి రుణమాఫీ మాటేంటి?
 సాంబశివరావు : ఘనంగా చెప్పుకున్న రైతులకే ఆయన చేసింది శూన్యం. ఇక మాకు చేస్తాడన్న నమ్మకం లేదు. మరోవైపు బ్యాంకులవాళ్లేమో మాపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇక మేం కూడా ఈ మగ్గాలను మూలనేసి ఈ గొయ్యిలోనే తలదూర్చాల్సిందే.
 ఆర్కే : ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. చేనేతకు నేను చేయూతనందిస్తా. గత వైభవం సాధించే దిశగా అండగా నిలుస్తాను.
 
 పెనుమాకలో మహిళా రైతుల సమక్షంలో...
 ఆర్కే: రాజధాని నిర్మాణం గురించి మీరేమంటారు..
 కౌలురైతు ఆదిలక్ష్మి :  మాకు రాజధానీ వద్దు గీజధానీ వద్దు. పార్టీలు గీర్టీలు అసలే వద్దు. మా మానాన మమ్మల్ని బతకనిస్తే చాలు. బంగారం లాంటి భూములు ఈ ప్రాంతంలోవి. వాటిని రాజధాని పేరుతో లాక్కుంటే నేనూరుకోను.
 శివకుమారి : నాకు ఎకరం పొలం ఉంది. మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని మరీ సేద్యం చేస్తున్నాను. దర్జాగా బతుకుతున్నాం. బంగారం లాంటి మా బతుకులను రాజధాని పేరుతో ఛిద్రం చేయాలని చూస్తారా? ఉన్న ఎకరం కూడా ఊడబెరుక్కుని వీధుల్లోకి నెడతారా?
 తాడేపల్లి ఎంపీపీ రాజ్యలక్ష్మి : ఉండవల్లి, పెనుమాక పొలాలు మూడు పంటలు పండే జరీబు భూములు. రాజధానికి భూములు ఇవ్వకూడదని రెండు గ్రామాల రైతులు ఇప్పటికే తీర్మానించారు. బలవంతంగా తీసుకోవాలని చూస్తే సహించేది లేదు.
 (పెనుమాక పొలాల్లోకి వెళ్లి ఉల్లి పంట కోస్తున్న మహిళా కూలీలను పరామర్శించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు.)
 ఆర్కే: పెనుమాక మొత్తం జనాభా 14వేల మందిలో 7580మంది కూలీలేనని తెలిసింది. అందులోనూ నాలుగువేల మంది అచ్చంగా పొలం పనులు చేసుకుని జీవించే వారే. రైతులకు, కౌలు రైతులు, కూలీలకు ఇష్టం లేకుండా ఈ భూములపై చెయ్యేస్తే సహించేది లేదు. కూలీలకు అండగా ఉంటా. వారి జీవనోపాధికి ఊతంగా నిలిచిన పంటల జోలికొస్తే అడ్డుకుంటాం.

ఆళ్ల రామకృష్ణారెడ్డి, సాక్షి వీఐపీ రిపోర్టర్‌, చేనేత కార్మికులు,
Alla Ramakrishna, the witness viaipi Reporter, handloom weavers
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement