* 29 గ్రామాల్లో ఆహ్వానించనున్న అధికారులు
* 13 వేల మంది రైతులకు వస్త్రాల అందజేత
* శంకుస్థాపన శిలాఫలకంలో రైతుల పేర్లు
* 22 వేల కుటుంబాలకు ఆహ్వానాలు
* ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించిన సీఎం
సాక్షి, విజయవాడ: నూతన రాజధాని శంకుస్థాపనకు ఇంటింటికీ వెళ్లి అందరినీ ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన పనులు వేగం పుంజుకున్నాయి. అందరినీ ఆహ్వానించటానికి ఆహ్వాన పత్రాలు సిద్ధమయ్యాయి. శనివారం విజయవాడలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధం చేసిన ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర మంత్రులు అందరికీ ఆహ్వాన పత్రాలు అందజేశారు. శంకుస్థాపన కార్యక్రమ ఆహ్వాన పత్రాలు రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో ప్రతి ఇంటికీ అధికారులు వెళ్లి స్వయంగా అందజేసి ఆహ్వానించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
13 వేల మంది రైతులకు దుస్తుల పంపిణీ..
రాజధాని నిర్మాణానికి పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన 13 వేల మంది రైతు కుటుంబాలకు మగవారికి ధోవతి, ఆడవారికి చీర అందజేయాలని నిర్ణయించారు. రాజధాని పరిధిలో పంచాల్సిన ఆహ్వాన పత్రాలను గుంటూరు జిల్లా కలెక్టర్‌కు, సీఆర్‌డీఏ అధికారులకు అప్పగించారు. భూములు ఇచ్చిన 13 వేల మంది రైతుల పేర్లను శంకుస్థాపన సమీపంలో ఏర్పాటు చేసే శిలాఫలకంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుతో సిద్ధమైన ఆహ్వాన పత్రాల్లో ఒకటో శతాబ్దానికి చెందిన అమరావతి స్థూపం చిత్రాన్ని ప్రచురించి అమరావతి ప్రజల రాజధాని పేరుతో ఆహ్వాన పత్రాలు సిద్ధం చేశారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రముఖులు, వీఐపీలు తదితరులకు ఆహ్వాన పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. రాజధానిలోని సుమారు 22 వేల కుటుంబాలకు మరో వారం వ్యవధిలో ఆహ్వాన పత్రాల పంపిణీ పూర్తి చేయనున్నారు.
ఆహ్వానం.. ఇంటింటికీ
Published Sun, Oct 11 2015 1:58 AM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM
Advertisement