రాష్ట్రానికి ‘మందాకిని’! | New Coal Mines Mandakini Coming In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి ‘మందాకిని’!

Published Fri, Oct 18 2019 7:09 AM | Last Updated on Fri, Oct 18 2019 7:11 AM

New Coal Mines Mandakini Coming In Andhra Pradesh - Sakshi

మందాకినిలో లభించనున్న బొగ్గు 287.88 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు

సాక్షి, అమరావతి :మరో బొగ్గు క్షేత్రాన్ని కైవసం చేసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్‌కో) అడుగులేస్తోంది. దీనివల్ల జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు కొరత తీరుతుంది. కొత్తగా ఉత్పత్తిలోకి వచ్చే 1,600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకూ మరింత ప్రయోజనం కలుగుతుంది. ఒడిశాలోని అంగుల్‌ జిల్లా బైండా, లుహ్మరా గ్రామాల్లో తాల్చేరు కోల్‌ఫీల్డ్స్‌ (మందాకిని) కు కేంద్ర బొగ్గు గనుల శాఖ అన్ని అనుమతులు తీసుకుంది. సొంత అవసరాల కోసమే ఈ క్షేత్రాన్ని కేటాయించాలని నిర్ణయించింది. ఏపీ జెన్‌కో ఈ బొగ్గు క్షేత్రాన్ని దక్కించుకునేందుకు దరఖాస్తు చేసింది. ఈ క్షేత్రంలో నాణ్యమైన బొగ్గు లభిస్తుందని సర్వేలో తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికోసం కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇక్కడ మొత్తం 653.66 హెక్టార్లలో బొగ్గు తవ్వకానికి వీలుందని తేలింది. ఇందులో 324.52 హెక్టార్ల అటవీ ప్రాంతానికి ఆ శాఖ 2013లోనే అవసరమైన అనుమతులిచ్చింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు కూడా 2011లో లభించాయి. ఈ బొగ్గు క్షేత్రం నుంచి మొత్తం 287.886 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు లభిస్తుందని వెల్లడైంది. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోని థర్మల్‌ ప్లాంట్లకు ఏటా 7.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు లభ్యమవుతుంది. ఈ నేపథ్యంలో.. మందాకిని బొగ్గు క్షేత్రం కోసం సేకరించే 274.52 హెక్టార్ల ప్రైవేటు భూమి విషయంలో పునరావాస కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. దీనికి సమీపంలోనే మహానది కోల్‌ఫీల్డ్స్‌ (ఎంసీఎల్‌) ఉంది.

దీని నుంచి రాష్ట్రంలోని థర్మల్‌ ప్లాంట్లకు ఏటా 13 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు కేటాయింపులున్నాయి. ఎంసీఎల్‌కు సమీపంలోనే ఏపీకి చెందిన వాష్డ్‌ కోల్‌ (బొగ్గు శుద్ధి) కేంద్రాలున్నాయి. అక్కడి నుంచి బొగ్గు రవాణాకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. పైగా ఈ బొగ్గు.. నాణ్యతతో పాటు, తక్కువ ధరకూ లభిస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఏపీకే ఈ బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇది దక్కితే జెన్‌కో ప్లాంట్లకు బొగ్గు కొరత చాలా వరకు తీరుతుందని భావిస్తున్నారు.

బొగ్గు కొరత తీరుతుంది
మందాకిని కోల్‌ బ్లాక్‌ను దక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇది మనకు వస్తుందనే నమ్మకం మాకు గట్టిగా ఉంది. ఇది అన్ని రాష్ట్రాల కంటే ఏపీకే ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా థర్మల్‌ ప్లాంట్లు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటే బొగ్గు కొరతను నివారించినట్లు ఉంటుంది. ఏపీ జెన్‌కో నుంచి అధికారులు కూడా ప్రత్యేకంగా అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతమంతా బొగ్గు నిక్షేపాల మయం కాబట్టి పునరావాసానికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని భావిస్తున్నాం.
– శ్రీధర్, ఏపీ జెన్‌కో ఎండీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement