ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రాభివృద్ధి
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల ప్రతిజ్ఞ
చిత్తూరులో మంత్రి బొజ్జల ఆధ్వర్యంలో..
చిత్తూరు (అగ్రికల్చర్): రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక పీసీఆర్ కూడలిలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ అధ్యక్షతన నవనిర్మాణ దీక్ష బహిరంగ సమావేశం నిర్వహించారు. మంత్రితో పాటు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతోపాటు టీడీపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తోందంటూ ప్లకార్డులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు సైతం చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు బాగుపడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ప్రత్యేక హోదా తప్పనిసరని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించి ఆదుకోవాలని కోరారు. ప్రపంచంలోనే రాజధాని లేకుండా ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు.
ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ నవ నిర్మాణంలో ముఖ్యమంత్రికి సహకారం అందించాలని, ఇందుకు ప్రజల్లో ఒక ఉద్యమస్ఫూర్తి రావాలన్నారు. అంతకుమునుపు మంత్రి అందరి చేత రాష్ట్ర నవ నిర్మాణానికి కృషి చేస్తామని సభికుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లాకు సంబంధించి వివిధ పథకాల్లో సాధించిన ప్రగతి పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు . ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, టీడీపీ నాయకులు దొరబాబు, బద్రీనారాయణ, పాచిగుంట మనోహర్, షణ్ముగం, ఉపాధ్యాయ సంఘ నాయకుడు గంటా మోహన్, ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నారాయణభరత్‌గుప్తా , ఎస్పీ శ్రీనివాస్, జేసీ-2 వెంకటసుబ్బారెడ్డి, డీఆర్‌ఓ విజయ్‌చందర్, ఆర్డీఓ కోదండరామిరెడ్డి, జెడ్పీ సీఈవో పెంచల కిషోర్, డ్వామా, డీఆర్‌డీఏ, హౌసింగ్ పీడీలు వేణుగోపాల్‌రెడ్డి, రవిప్రకాష్‌రెడ్డి, వెంకటరెడ్డి, నగరపాలక కమిషనర్ సురేష్, మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.