- తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, జౌళి శాఖ మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వచ్చే నూతన పారిశ్రామికవేత్తలకు విమానాశ్రయం నుంచి రెడ్ కార్పెట్ వేస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), నేషనల్ అకాడమీ ఆఫ్ డెవలప్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సు శనివారం ముగిసింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీ పరిశ్రమల ఏర్పాటుకు 15 రోజుల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులన్నీ లభించేలా సింగిల్ విండో విధానాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. టీఎస్ ఐ-పాస్‌లో నూతన పరిశ్రమలకు 100 శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపును ఐదు నుంచి ఏడేళ్లు పన్ను మినహాయింపు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వి.రామకృష్ణయ్య, సెస్ డెరైక్టర్ గాలబ్, డాక్టర్ కె.ఎల్.కృష్ణ, సురేందర్, కృష్ణారావు, మహేందర్‌రెడ్డి మాట్లాడారు.