సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో శాఖలు, విభాగాల కుదింపులు, విలీనాలు కుదరవని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. ఇటువంటి నిర్ణయాలను తెలంగాణ, సీమాంధ్రల్లో కొత్త ప్రభుత్వాలే తీసుకుంటాయని పేర్కొన్నారు. విభజనకు సంబంధించిన అంశాలపైనే తాను నిర్ణయాలు తీసుకుంటానని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సంస్కరణలతో పాటు అవసరం లేని విభాగాల కుదింపు, కొన్ని శాఖలను విలీనం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి వినోద్ అగర్వాల్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎక్కడా కూడా శాఖల కుదింపు, విభాగాల విలీనం గురించి పేర్కొనలేదు. పూర్తిగా విభజన గురించి మాత్రమే పేర్కొన్నారు.
కాగా, సంక్షేమ శాఖలన్నింటినీ ఒకే శాఖ కింద పరిగణించాలని, వ్యవసాయ-పశుసంవర్థక శాఖలను, గ్రామీణ మంచినీటి-పంచాయతీరాజ్ శాఖలను, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖలను విలీనం చేయాలని అధికారులు అభిప్రాయపడ్డారు. దీనికి గవర్నర్ నర్సింహన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్నికైన ప్రభుత్వాలే ఇలాంటి నిర్ణయాలను తీసుకోవాలి తప్ప గవర్నర్‌గా తాను తీసుకోలేనని ఆయన స్పష్టం చేశారు.