నెల్లూరు(అర్బన్): పౌర సరఫరాలకు సంబంధించి ప్రభుత్వం గత నెల 11న పాత చట్టం స్థానంలో కంట్రోలర్ ఆర్డర్– 2018 అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని జేసీ వెట్రి సెల్వి తెలిపారు. కొత్తచట్టం ప్రకారం రేషన్ డీలర్లు ఏ మాత్రం మోసాలకు పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో రేషన్ డీలర్లకు కంట్రోలర్ ఆర్డర్–2018పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ డీలర్లు తూకాల్లో మోసాలకు పాల్పడినా..సకాలంలో డీడీలు చెల్లించకపోయినా..రేషన్ దుకాణాన్ని సమయం ప్రకారం తీయకపోయినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
గతంలో 6(ఏ) కేసులు నమోదు చేసేవారని, కొత్త చట్టం ప్రకారం 420 కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉందన్నారు. అందువల్ల డీలర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. ఈపాస్ యంత్రంలో వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ఐరిష్ ద్వారా సరకులు ఇవ్వాలని సూచించారు. ఐరిష్ పని చేయని చోట 15వ తేదీ తరువాత మూడ్రోజుల పాటు వీఆర్వో ద్వారా సరుకులు ఇవ్వాలన్నా రు. వరికుంటపాడు, దుత్తలూరు, ఉదయగిరి, సీతారామపురం, తడ, కొండాపురం, గూడూరు, అనంతసాగరం, రాపూరు, తదితర మండలాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగా లేదన్నారు.
రేషన్ సరకులు ఇచ్చిన తరువాత పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలోని లక్షమందికి ఫోన్ చేసి సరుకులు సక్రమంగా ఇస్తున్నారా.. తూకాల్లో మోసాలు చేస్తున్నారా.. ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయానే వివరాలు సేకరిస్తున్నారన్నారు. అందువల్ల డీలర్లు జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారిని నూతన ఓటర్లుగా చేర్పించేందుకు సహకారించాలని కోరారు. అనంతరం ప్రజాపంపిణీలో 100 శాతం మించి సరుకులు అందించిన ఐదుగురు డీలర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల రేషన్ డీలర్లు, డీఎస్‌ఓ, ఏఎస్‌ఓ, డిప్యూటీ తహసీల్దార్లు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment