పల్లెల నుంచి పట్టణాలుగా.. | New Nagar Panchayats In Prakasam | Sakshi
Sakshi News home page

పల్లెల నుంచి పట్టణాలుగా..

Published Fri, Jul 26 2019 9:36 AM | Last Updated on Fri, Jul 26 2019 9:36 AM

New Nagar Panchayats In Prakasam - Sakshi

సాక్షి, ఒంగోలు: జిల్లాలో పలు పంచాయతీలు నగర పంచాయతీలుగా మారనున్నాయి. ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీలుగా ఉన్న పల్లెలు నగర పంచాయతీలుగా రూపాంతరం చెంది పట్టణాలు కానున్నాయి. జిల్లాలో ఆరు మేజర్‌ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు పురపాలకశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక పంపాలంటూ జిల్లా కలెక్టర్‌కు లేఖ పంపినట్లు తెలిసింది. దీన్ని చాలా అత్యవసరంగా భావించి ఈ నెల 31వ తేదీలోపు ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని కలెక్టర్‌కు సూచించారు. అంతేకాకుండా నగర పంచాయతీలుగా మార్చాలనుకునే మేజర్‌ పంచాయతీల పూర్తి వివరాలను వెంటనే పంపాలంటూ జిల్లా పంచాయతీ అధికారిని పురపాలకశాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. అభివృద్ధి మరింతగా జరుగుతుందనే ఆలోచనతోనే కొత్త నగర పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పడే వాటితో కలిపి జిల్లాలో మొత్తం నగర పంచాయతీల సంఖ్య పదికి చేరనుంది. 

జిల్లాలో ప్రస్తుతం ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు, మూడు మున్సిపాల్టీలు, నాలుగు నగర పంచాయతీలు ఉన్నాయి. కందుకూరు, చీరాల, మార్కాపురం మున్సిపాల్టీలు, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి నగర పంచాయతీలు ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజాగా జిల్లాలో మరో ఆరు నగర పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడంపై జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 2015లో నగర పంచాయతీల ఏర్పాటుకు పురపాలకశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి. అయితే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకముందే నగర పంచాయతీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది.

ఒక్కో నగర పంచాయతీకి జనాభా 20 వేల నుంచి 40 వేల మధ్య ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా 20 వేలకు పైగా జనాభా ఉన్న మేజర్‌ పంచాయతీలను నేరుగా నగర పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించారు. అంతకంటే తక్కువ జనాభా ఉన్న మేజర్‌ పంచాయతీలకు చుట్టుపక్కల ఉండే కొన్ని గ్రామాలను కలిపి నగర పంచాయతీగా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి డైరెక్టర్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నఆరు ప్రాంతాలకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలపై తదుపరి ఉత్తర్వులు వెలువడనున్నాయి.

స్థానిక ఎన్నికల నగరా మోగే లోగా..
జిల్లాలోని దర్శి, సింగరాయకొండ, టంగుటూరు, పొదిలి, మార్టూరు, వేటపాలెం మేజర్‌ పంచాయితీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌కు లెటర్‌ పంపినట్లు సమాచారం. అంతేకాకుండా ఆయా మేజర్‌ పంచాయతీలకు సంబంధించిన జనాభా, ఆదాయం, విస్తీర్ణం, సిబ్బంది సంఖ్య, పాఠశాలల సంఖ్య, తాగునీటి సమాచారం, రోడ్ల వివరాలు వంటి పూర్తి సమాచారాన్ని పంపాలంటూ జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అత్యవసరంగా భావించి నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను నెలాఖరులోగా పంపాలంటూ జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపు కొత్త నగర పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రతిపాదనలు ఇవీ...
కొత్తగా ఏర్పాటు కానున్న ఆరు నగర పంచాయతీలకు అధికారులు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలో దర్శి, పొదిలి, మార్టూరు, టంగుటూరు, సింగరాయకొండ, వేటపాలెం మేజర్‌ పంచాయితీలను నగర పంచాయతీలుగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. పొదిలి మేజర్‌ పంచాయితీ పరిధిలో 35 వేలు, దర్శి మేజర్‌ పంచాయతీ పరిధిలో 33 వేలు, సింగరాయకొండ పరిధిలో 23 వేలు జనాభా ఉండటంతో వీటిని నేరుగా నగర పంచా యతీలుగా మార్చాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.

టంగుటూరు మేజర్‌ పంచాయతీ పరిధిలో 19 వేల మంది జనాభా మాత్రమే ఉండటంతో పక్కనే ఉన్న జమ్ములపాలెం, ఆలకూరుపాడు, అనంతవరం గ్రామాలను కలిపి టంగుటూరు నగర పంచాయతీ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మార్టూరు మేజర్‌ పంచాయతీ పరిధిలో 24 వేల మంది జనాభా ఉన్నప్పటికీ పక్కనే ఉన్న డేగరమూడి, రాజుగారిపాలెం, నాగరాజుపల్లె గ్రామాలను కలిపి మార్టూరు నగర పంచాయతీగా చేయనున్నారు. వేటపాలెం మేజర్‌ పంచాయతీ పరిధిలో 15 వేల మంది జనాభా మాత్రమే ఉండటంతో పక్కనే ఉన్న దేశాయిపేట, రామన్నపేట గ్రామాలను కలిపి నగర పంచాయతీగా ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులు మున్సిపల్‌ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement