nagar panchayat
-
పల్లెల నుంచి పట్టణాలుగా..
సాక్షి, ఒంగోలు: జిల్లాలో పలు పంచాయతీలు నగర పంచాయతీలుగా మారనున్నాయి. ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీలుగా ఉన్న పల్లెలు నగర పంచాయతీలుగా రూపాంతరం చెంది పట్టణాలు కానున్నాయి. జిల్లాలో ఆరు మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు పురపాలకశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక పంపాలంటూ జిల్లా కలెక్టర్‌కు లేఖ పంపినట్లు తెలిసింది. దీన్ని చాలా అత్యవసరంగా భావించి ఈ నెల 31వ తేదీలోపు ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని కలెక్టర్‌కు సూచించారు. అంతేకాకుండా నగర పంచాయతీలుగా మార్చాలనుకునే మేజర్ పంచాయతీల పూర్తి వివరాలను వెంటనే పంపాలంటూ జిల్లా పంచాయతీ అధికారిని పురపాలకశాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. అభివృద్ధి మరింతగా జరుగుతుందనే ఆలోచనతోనే కొత్త నగర పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పడే వాటితో కలిపి జిల్లాలో మొత్తం నగర పంచాయతీల సంఖ్య పదికి చేరనుంది. జిల్లాలో ప్రస్తుతం ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు, మూడు మున్సిపాల్టీలు, నాలుగు నగర పంచాయతీలు ఉన్నాయి. కందుకూరు, చీరాల, మార్కాపురం మున్సిపాల్టీలు, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి నగర పంచాయతీలు ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజాగా జిల్లాలో మరో ఆరు నగర పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడంపై జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 2015లో నగర పంచాయతీల ఏర్పాటుకు పురపాలకశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకముందే నగర పంచాయతీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. ఒక్కో నగర పంచాయతీకి జనాభా 20 వేల నుంచి 40 వేల మధ్య ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా 20 వేలకు పైగా జనాభా ఉన్న మేజర్ పంచాయతీలను నేరుగా నగర పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించారు. అంతకంటే తక్కువ జనాభా ఉన్న మేజర్ పంచాయతీలకు చుట్టుపక్కల ఉండే కొన్ని గ్రామాలను కలిపి నగర పంచాయతీగా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నఆరు ప్రాంతాలకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలపై తదుపరి ఉత్తర్వులు వెలువడనున్నాయి. స్థానిక ఎన్నికల నగరా మోగే లోగా.. జిల్లాలోని దర్శి, సింగరాయకొండ, టంగుటూరు, పొదిలి, మార్టూరు, వేటపాలెం మేజర్ పంచాయితీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్‌కు లెటర్ పంపినట్లు సమాచారం. అంతేకాకుండా ఆయా మేజర్ పంచాయతీలకు సంబంధించిన జనాభా, ఆదాయం, విస్తీర్ణం, సిబ్బంది సంఖ్య, పాఠశాలల సంఖ్య, తాగునీటి సమాచారం, రోడ్ల వివరాలు వంటి పూర్తి సమాచారాన్ని పంపాలంటూ జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అత్యవసరంగా భావించి నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను నెలాఖరులోగా పంపాలంటూ జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు కొత్త నగర పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రతిపాదనలు ఇవీ... కొత్తగా ఏర్పాటు కానున్న ఆరు నగర పంచాయతీలకు అధికారులు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలో దర్శి, పొదిలి, మార్టూరు, టంగుటూరు, సింగరాయకొండ, వేటపాలెం మేజర్ పంచాయితీలను నగర పంచాయతీలుగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. పొదిలి మేజర్ పంచాయితీ పరిధిలో 35 వేలు, దర్శి మేజర్ పంచాయతీ పరిధిలో 33 వేలు, సింగరాయకొండ పరిధిలో 23 వేలు జనాభా ఉండటంతో వీటిని నేరుగా నగర పంచా యతీలుగా మార్చాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. టంగుటూరు మేజర్ పంచాయతీ పరిధిలో 19 వేల మంది జనాభా మాత్రమే ఉండటంతో పక్కనే ఉన్న జమ్ములపాలెం, ఆలకూరుపాడు, అనంతవరం గ్రామాలను కలిపి టంగుటూరు నగర పంచాయతీ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మార్టూరు మేజర్ పంచాయతీ పరిధిలో 24 వేల మంది జనాభా ఉన్నప్పటికీ పక్కనే ఉన్న డేగరమూడి, రాజుగారిపాలెం, నాగరాజుపల్లె గ్రామాలను కలిపి మార్టూరు నగర పంచాయతీగా చేయనున్నారు. వేటపాలెం మేజర్ పంచాయతీ పరిధిలో 15 వేల మంది జనాభా మాత్రమే ఉండటంతో పక్కనే ఉన్న దేశాయిపేట, రామన్నపేట గ్రామాలను కలిపి నగర పంచాయతీగా ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులు మున్సిపల్ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. -
దయనీయం వీరి పరిస్థితి..!!
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ (నామినల్ మస్టర్ రోల్)లు వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పాతికేళ్లుగా పనిచేస్తున్నా.. వారికి ఇంతవరకు ఉద్యోగ భద్రత లేదు. మరోవైపు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించే ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా వీరికి వర్తించడం లేదు. గతంలో గ్రామపంచాయతీలలో పనిచేసిన వారు నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందడంతో మున్సిపల్ శాఖకు మారారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో వీరి పాత్ర కీలకం కాగా.. కనీస వేతనాలు కూడా అందడం లేదు. కారుణ్య నియామకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేని వీరు తమ సర్వీసును ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. రెగ్యులరైజ్ చేయకపోయినా టైమ్‌స్కేల్ అందించినా కనీస వేతనాలు లభిస్తాయని.. ఆ దిశగా మున్సిపల్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించాలని వారు కోరుతున్నారు. – కోదాడ నుంచి ఆవుల మల్లికార్జునరావు సరిపడా లేని సిబ్బంది.. వాస్తవానికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో సరిపడా సిబ్బంది లేరు. మేజర్ గ్రామపంచాయతీలు నగర పంచాయతీ, మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందే సమయంలో అక్కడ పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్‌లను మున్సిపల్ శాఖ పరిధిలోకి తీసుకుంటున్నారు. అయినా.. వారి సర్వీసును మాత్రం రెగ్యులరైజ్ చేయలేదు. 2013లో విడుదల చేసిన జీవో నెంబర్ 125 ప్రకారం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో 1,520 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించి వాటిని రెండు దశలలో నింపేందుకు నిర్ణయించారు. అయితే.. ఈ పోస్టులలో ఎన్‌ఆర్‌ఎంలను రెగ్యులరైజ్ చేసేందుకు ఉద్దేశించిన పబ్లిక్ హెల్త్ విభాగంలో తక్కువ పోస్టులు ఉండగా, మిగిలిన విభాగాలో పోస్టులను సూచించలేదు. దీంతో ఆ జీవో వచ్చినా ఎన్ఆర్ఎంలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. వాస్తవానికి ప్రతీ మున్సిపాలిటీ, నగర పంచాయతీలలో మాత్రం స్వీపర్లు, పబ్లిక్ హెల్త్, విద్యుత్, నీటి సరఫరాల విభాగాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఈ పోస్టుల్లో కొన్నింటిని ఎన్ఆర్ఎంలతో, మరి కొన్నింటిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో తాత్కాలికంగా భర్తీ చేస్తున్నారు. అమలు కాని 212 జీవో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విభాగాలలో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్‌లను రెగ్యులరైజ్ చేసే విషయంలో నవంబర్ 28, 1993న అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 212ను విడుదల చేసింది. దీని ప్రకారం 1993 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఎన్‌ఆర్‌ఎంలను ఆ జీవో కింద రెగ్యులరైజ్ చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలిచ్చింది. వారిని ఆయా శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలలో నియమించాలని, తద్వారా ఖాళీలను భర్తీ చేయాలని సూచించింది. అయితే.. ఈ జీవో మాత్రం పంచాయతీరాజ్ శాఖలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. గ్రామపంచాయతీలలో ప్రభుత్వం కేటాయించిన పోస్టులు తక్కువగా ఉండడం.. ఎన్ఆర్ఎంల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అది సాధ్యపడలేదు. దీంతో ఖాళీలు ఏర్పడినప్పుడు దశల వారీగా ఉద్యోగులను వారి సీనియారిటీని బట్టి నియమిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఎంలలో చాలా మంది అనార్యోగం బారిన పడి మృతి చెందారు. అయితే.. వీరి కుటుంబ సభ్యుల్లో మరొకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం లేకపోవడంతో.. కుటుంబాలకు ఎలాంటి భద్రత కల్పించకుండానే లోకం వదులుతున్నారు. 350 మంది ఎదురుచూపు.. రాష్ట్రవ్యాప్తంగా 2009 తరువాత ఏర్పడిన కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో 350 మంది ఎన్‌ఎంఆర్‌లు రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం తమను రెగ్యులరైజ్ చేసి కనీసం టైమ్ స్కేల్ అందించాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై గతంలోనే పలుమార్లు మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వారు తెలిపారు. మున్సిపాలిటీలలో అదే పరిస్థితి.. ఉమ్మడి రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఖాళీలను భర్తీ చేసేందుకు 2009లో అప్పటి ప్రభుత్వం మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న ఎన్ఆర్ఎంలతో ఖాళీలు భర్తీ చేయవచ్చని జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఎన్‌ఆర్‌ఎంలను పబ్లిక్ హెల్త్ వర్కర్లు, స్వీపర్లు, విద్యుత్, నీటి సరఫరా విభాగాలలో నియమించి వారిని రెగ్యులరైజ్ చేశారు. ఆ తరువాత ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో మాత్రం అమలు కాలేదు. ఇతడి పేరు కుక్కల దేవయ్య. ఈయన కోదాడ మున్సిపాలిటీలో పారిశుధ్య విభాగంలో ఎన్‌ఎంఆర్‌గా పనిచేస్తున్నాడు. కోదాడ గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు అనగా 30 ఏళ్లుగా పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్నాడు. ఇతడికి ఆరోగ్య భద్రత లేకపోగా ఉద్యోగ భద్రత కూడా లేదు. -
ముచ్చటగా మూడు..
సాక్షి, మెదక్ : జిల్లాలో మూడు నగర పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట నూతనంగా నగర పంచాయతీలుగా మారనున్నాయి. దీంతో ఈ మూడు పంచాయతీల దశ మారనుంది. ఇక్కడ అభివృద్ధి ఊపందుకోనుంది. అయితే అదే సమయంలో ప్రజలపై పన్నుల భారం పడే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా కొత్త నగర పంచాయతీలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇటీవలే జనాభా నిబంధనలను సైతం సవరించింది. జిల్లాలో ప్రభుత్వ నిబంధలను అనుసరించి నగర పంచాయతీల ఏర్పాటుకోసం ప్రతిపాదనలను అధికారులు డిసెంబర్లోనే పంపించారు. జిల్లాలో కొత్తగా తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేటలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. ఎంతోకాలంగా నగర పంచాయతీలుగా ఏర్పడాలనుకున్న ప్రజాప్రతినిధులు, ప్రజల కోరిక నెరవేరింది. ఆరు గ్రామాల విలీనంతో తూప్రాన్.. ఆరు గ్రామాల విలీనంతో తూప్రాన్ నగర పంచాయతీగా ఏర్పాటు కానుంది. 2011 జనాభా లెక్కలను అనుసరించి తూప్రాన్‌లో 14,401 జనాభా ఉంది. నగర పంచాయతీ ఏర్పాటు చేయాలంటే 15వేల జనాభా అవసరం. దీంతో సమీపంలోని అల్లాపూర్, హుస్సెన్పూర్, రావెల్ల, వెంకటాపూర్, బ్రాహ్మణపల్లి, పడాలపల్లి గ్రామాలను తూప్రాన్‌లో విలీనం చేయనున్నారు. నగర పంచాయతీ ఏర్పాటుతో తూప్రాన్ జనాభా 21,148 లకు చేరనుంది. తూప్రాన్ సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఉండటంతో అభివృద్ధి పనులు జోరుగానే సాగుతున్నాయి. నగర పంచాయతీ ఏర్పాటుతో ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్‌లో రెండు గ్రామాలు.. నర్సాపూర్ ప్రస్తుత జనాభా 17వేలు ఉంది. సమీపంలోని చిన్నచింతకుంట, పెద్ద చింతకుంటలు విలీనం చేయనున్నారు. దీంతో జనాభా 20వేలు దాటుతుంది. నగర పంచాయతీకి అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామాయంపేటలో విలీనం లేకుండానే.. రామాయంపేట మేజర్ పంచాయతీ కూడా నగర పంచాయతీగా అవతరించనుంది. 2011 జనాభా లెక్కలనను అనుసరించి రామాయంపేట 17వేల జనాభా ఉంది. దీంతో రామాయంపేటను నగర పంచాయతీగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమీపంలోని గ్రామాలను విలీనం చేయకుండానే రామాయంపేట నగర పంచాయతీగా ఏర్పతుంది. నగర పంచాయతీల ఏర్పాటుతో తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్‌ల అభివృద్ధికి అదనంగా నిధులు వస్తాయని ఆశిస్తున్నారు. అలాగే ఆదాయం కూడా రెట్టింపు కానుంది. దీంతో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడంతోపాటు అభివృద్ధి పనులు మరింత ఎక్కువగా చేసేందుకు వీలవుతుంది. అయితే నగర పంచాయతీల ఏర్పాటుతో పన్నులభారం పెరుగుతుందన్న ఆందోళన ప్రజలలో వ్యక్తమవుతోంది. -
ఆస్తిపన్ను సొమ్ము దుర్వినియోగం
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో ఆస్తిపన్ను సొమ్ము దుర్వినియోగమయ్యింది. ప్రా థమికంగా సుమారు రూ.75 వేలు స్వాహా అయినట్టు తేలింది. అయితే ఇది మరింత పెరగవచ్చని అంచనా. దీనిపై నగర పంచాయతీ అధికారులు విచారణ ప్రారంభించారు. వివరాలిలా ఉన్నా యి.. నగర పంచాయతీలో ఆస్తిపన్ను (ఇంటి పన్ను) వసూళ్లకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి సిబ్బంది సౌలభ్యాన్ని బట్టి ఒకరిని నియమిస్తుంటారు. ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగి ఈ కౌంటర్లో పనిచేస్తుండగా రూ.75 వేలు దుర్వి నియోగం చేసినట్టు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. బయటపడిందిలా.. ఈ నెల 10న రెండో శనివారం సెలవు కావడంతో ఆస్తిపన్ను వసూలుకు అధికారులు కౌంటర్ ఏర్పాటు చేయలేదు. 12న సోమవారం ఆర్ఐ సీహెచ్ వెంకటేశ్వరరావు శుక్రవారం వరకు వసూలైన వివరాలు, రికార్డులు కంప్యూటర్లో పరిశీలించగా, శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో 8 ఇంటి పన్నులకు సంబంధించి రూ.75 వేల రశీదులు ఇచ్చినట్టు గుర్తించారు. అయితే దీనిపై ఆరా తీయగా స్థానిక చింతల బజారులోని ఓ ఈ–సేవ కేంద్రం నుంచి నగర పంచాయతీ వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి రశీదులు ఇచ్చినట్టుగా గుర్తించారు. దీనిపై ఆయన కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావుకు రిపోర్ట్ చేశారు. విచారించగా ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగి ఈ సేవ కేంద్రం ద్వారా రశీదులు జారీ చేసినట్టు తేలింది. క్యాన్సిలేషన్‌ను క్యాష్ చేసుకున్న వైనం నగర పంచాయతీ వెబ్సైట్లో ఆస్తిపన్నుల క్యాన్సిలేషన్‌కు ఆప్షన్ ఉంది. దీనిని ఆమె సొమ్ము చేసుకుంది. గతంలో కొందరు యజమానులు ఆస్తి పన్ను చెల్లించగా వారికి రశీదులు ఇచ్చి వెంటనే క్యాన్సిలేషన్ చేసి సొమ్మును స్వాహా చేసింది. అయితే ఇటీవల ఒకరిద్దరికి తాము ఆస్తిపన్ను చెల్లించినా డిమాండ్ నోటీసులు రావడంతో నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చి ప్రశ్నిం చారు. దీంతో కంగారు పడిన ఆమె హడావుడిగా ఈ–సేవ కేంద్రం ద్వారా గత శనివారం రశీదులు జారీ చేసింది. అధికారులు ఆమెను నిలదీయడంతో భిన్నకథనాలు చెప్పుకొచ్చింది. అయితే చివరకు ఆమెకు కావాలి్సన ఒక కౌన్సిలర్‌తో మాట్లాడించడంతో సొమ్ము స్వాహా చేసినట్టు మంగళవారం ఒప్పుకున్నట్టు సమాచారం. ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన ఆమె నగర పంచాయతీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆత్మహత్యాయత్నం అవకతవకలకు పాల్పడిన ఆమె రాజమండ్రి గోదావరి రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జిపైకి చేరుకుని ఆత్మహత్యకు యత్నించగా ఓ కానిస్టేబుల్ చూసి పో లీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాలు అడిగి తెలుసుకుని జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె తండ్రి , నగర పంచాయతీ సిబ్బంది అక్కడకు వెళ్లి ఆమెను జంగారెడ్డిగూడెం తీసుకువచ్చారు. సంఘటనపై నగర పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తున్నాం నగర పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై విచారణ చేస్తున్నామని కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రాథమికంగా 8 ఇంటి పన్నుల రశీదులకు సంబంధించి రూ.75 వేలు దుర్వినియోగమయ్యాయని, ఇంకా నిధులు ఏవైనా దుర్వినియోగమయ్యాయా అనే అంశంపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నట్టు చెప్పారు. -
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
హుజూర్నగర్ : నగరపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు చైర్మన్ జక్కుల వెంకయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని 3వ వార్డులో రూ.3 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్, నగరపంచాయతీ వైస్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 20 వార్డుల పరిధిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తన్నీరు మల్లికార్జున్‌రావు, దొంతిరెడ్డి సంజీవరెడ్డి, కంకణాల పుల్లయ్య, శాఖ గ్రంథాలయ చైర్మన్ కె.సైదులు, నాయకులు కామిశెట్టి రవికుమార్, వల్లపుదాసు కృష్ణ, చింతకాయల రాము, నందిగామ శంభయ్య, యల్లావుల రాములు, కాలవపల్లి బ్రహ్మారెడ్డి, యతిపతిరావు, నర్సింహారావు పాల్గొన్నారు.