
సాక్షి, మెదక్ : జిల్లాలో మూడు నగర పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట నూతనంగా నగర పంచాయతీలుగా మారనున్నాయి. దీంతో ఈ మూడు పంచాయతీల దశ మారనుంది. ఇక్కడ అభివృద్ధి ఊపందుకోనుంది. అయితే అదే సమయంలో ప్రజలపై పన్నుల భారం పడే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా కొత్త నగర పంచాయతీలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇటీవలే జనాభా నిబంధనలను సైతం సవరించింది. జిల్లాలో ప్రభుత్వ నిబంధలను అనుసరించి నగర పంచాయతీల ఏర్పాటుకోసం ప్రతిపాదనలను అధికారులు డిసెంబర్‌లోనే పంపించారు. జిల్లాలో కొత్తగా తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేటలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. ఎంతోకాలంగా నగర పంచాయతీలుగా ఏర్పడాలనుకున్న ప్రజాప్రతినిధులు, ప్రజల కోరిక నెరవేరింది.
ఆరు గ్రామాల విలీనంతో తూప్రాన్..
ఆరు గ్రామాల విలీనంతో తూప్రాన్ నగర పంచాయతీగా ఏర్పాటు కానుంది. 2011 జనాభా లెక్కలను అనుసరించి తూప్రాన్‌లో 14,401 జనాభా ఉంది. నగర పంచాయతీ ఏర్పాటు చేయాలంటే 15వేల జనాభా అవసరం. దీంతో సమీపంలోని అల్లాపూర్, హుస్సెన్‌పూర్, రావెల్ల, వెంకటాపూర్, బ్రాహ్మణపల్లి, పడాలపల్లి గ్రామాలను తూప్రాన్‌లో విలీనం చేయనున్నారు. నగర పంచాయతీ ఏర్పాటుతో తూప్రాన్ జనాభా 21,148 లకు చేరనుంది. తూప్రాన్ సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఉండటంతో అభివృద్ధి పనులు జోరుగానే సాగుతున్నాయి. నగర పంచాయతీ ఏర్పాటుతో ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నర్సాపూర్‌లో రెండు గ్రామాలు..
నర్సాపూర్ ప్రస్తుత జనాభా 17వేలు ఉంది. సమీపంలోని చిన్నచింతకుంట, పెద్ద చింతకుంటలు విలీనం చేయనున్నారు. దీంతో జనాభా 20వేలు దాటుతుంది. నగర పంచాయతీకి అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రామాయంపేటలో విలీనం లేకుండానే..
రామాయంపేట మేజర్ పంచాయతీ కూడా నగర పంచాయతీగా అవతరించనుంది. 2011 జనాభా లెక్కలనను అనుసరించి రామాయంపేట 17వేల జనాభా ఉంది. దీంతో రామాయంపేటను నగర పంచాయతీగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమీపంలోని గ్రామాలను విలీనం చేయకుండానే రామాయంపేట నగర పంచాయతీగా ఏర్పతుంది. నగర పంచాయతీల ఏర్పాటుతో తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్‌ల అభివృద్ధికి అదనంగా నిధులు వస్తాయని ఆశిస్తున్నారు. అలాగే ఆదాయం కూడా రెట్టింపు కానుంది. దీంతో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడంతోపాటు అభివృద్ధి పనులు మరింత ఎక్కువగా చేసేందుకు వీలవుతుంది. అయితే నగర పంచాయతీల ఏర్పాటుతో పన్నులభారం పెరుగుతుందన్న ఆందోళన ప్రజలలో వ్యక్తమవుతోంది.