సెకండ్ 'హ్యాండ్' పార్టీ | New party coming soon on Congress direction | Sakshi
Sakshi News home page

సెకండ్ 'హ్యాండ్' పార్టీ

Published Mon, Jan 20 2014 2:16 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సెకండ్ 'హ్యాండ్' పార్టీ - Sakshi

సెకండ్ 'హ్యాండ్' పార్టీ

సమైక్యం ముసుగేసుకొస్తోంది..
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కాంగ్రెస్ అధిష్టానం
తారాగణం: తిరుగుబాటు మేకప్‌తో కాంగ్రెస్ నేతలు

 
 సాక్షి, హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీ చర్చ ముగిసి ఢిల్లీకి తిరిగిపంపే గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. కాంగ్రెస్ ముసుగు మెల్లగా తొలగిపోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మునిగిపోయిన పడవలా మారడంతో కనీసం కాగితం పడవనైనా తయారు చేయాలన్న ఆలోచనను క్రమంగా అమలులో పెడుతోంది. ఏం చేసినా కాంగ్రెస్ కోలుకునే అవకాశాలు లేవని తేలిపోవడంతో.. సొంత పార్టీ నేతలతోనే కొత్తగా వేరే పార్టీ పెట్టించే ప్రణాళికను కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే రచించిందని.. రాష్ట్ర విభజన నిర్ణయంతో పాటే బయటకు పొక్కిన విషయం తెలిసిందే. ఆమేరకు పక్కాగా నడిపిస్తున్న ఈ హైడ్రామాలో.. తనపై తిరుగుబాటు స్వరం వినిపిస్తూ సమైక్య నటన చేస్తున్న వారితోనే చివరి అంకం రక్తికట్టిస్తోంది.

ఒకవైపు కాంగ్రెస్ నుంచి పుట్టబోయే పార్టీ స్వరూప స్వభావాలు పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌ల రూపంలో తెరకెక్కుతుంటే.. మరోవైపు ఆయా నేతలకు అందిస్తున్న భారీ ఆర్థిక ప్రయోజనాలు, ప్రచార ఒప్పందాల వివరాలు బయటపడుతున్నాయి. కళ్లు మూసుకుని పాలుతాగే పిల్లి చందంగా కాంగ్రెస్ వ్యవస్థ పై నుంచి కింది వరకు నడుపుతున్న ఈ నాటకం వాళ్లనుకుంటున్నట్టు గోప్యంగా ఏమీ లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న తెలుగుదేశం పార్టీ.. శత్రువుకి శత్రువు తన మిత్రుడన్న తీరులో కాంగ్రెస్ నాటకంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. కాంగ్రెస్ - టీడీపీలు పరస్పర సహకారంతో ఉభయులూ లబ్ధిపొందవచ్చన్న ఆశతో ప్రణాళికను అమలు చేస్తున్నాయి. ఆ కారణంగానే తాజాగా చానెళ్లలో హోరెత్తుతున్న సమైక్య ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నోరు మెదపడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం రూపొందించిన పథకంలో భాగంగానే అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన నేతలే ఇప్పుడు కొత్త పార్టీ రూపంలో సరికొత్త అవతారం ఎత్తనున్నారు. విభజన బిల్లుపై ఉభయ సభల్లో చర్చను పూర్తి చేసి కేంద్రానికి తిప్పిపంపిన వెంటనే కార్యాచరణతో రంగంలోకి దిగడానికి ఆ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.
 
 భూస్థాపితం చేస్తామన్నా.. క్రమశిక్షణ ఊసు లేదు!
 
 రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అధిష్టానాన్ని ధిక్కరిస్తూవచ్చారు. కొందరైతే ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసలు కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతల నుంచి ఆమె తప్పుకోవాలని డిమాండ్ చేసేవరకూ వెళ్లారు. సొంత పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. కానీ.. వారెవరిపైనా క్రమశిక్షణా చర్యల ఊసే కాంగ్రెస్ అధిష్టానం నుంచి వినిపించలేదు. కనీసం వారిని పిలిచి ఇదేమిటని మాట్లాడనూ లేదు. కారణమేమంటే.. వారి ద్వారానే కొత్త పార్టీ పెట్టించాలన్న ఆలోచన అప్పటికే జరిగిపోవడమే కాకుండా, ఆ వ్యూహంలో భాగంగానే ఆ నేతలంతా అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నట్టు మాట్లాడుతుండటమేనని పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. తన ప్రణాళిక ప్రకారం నడుస్తున్న ఆ నేతలను హైకమాండ్ చూసీచూడనట్టు వదిలేస్తోందని చెప్తున్నారు. ఇప్పుడు విభజన బిల్లును కేంద్రానికి తిప్పిపంపే గడువు సమీపించడంతో కొత్త పార్టీ నడిపించడానికి కావలసిన ‘సరుకు, సరంజామాల’ను కూడా సమకూర్చుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. ప్రభుత్వపరంగా ఆయా నేతల పనులను చకచకా చేసిపెడుతున్నారని విశ్వసనీయ సమాచారం. తాజాగా తెలుగు చానళ్లలో మారుమోగుతున్న సమైక్య ప్రచారం ఆ కోవలోనే తెరపైకి వచ్చినట్టు కాంగ్రెస్‌లో గుప్పుమంది.
 
 ప్రణాళిక అమలు బాధ్యత కిరణ్‌దే...
 
 రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న దశలోనే కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కార్యాచరణ రూపొందించి అమలు చేసే బాధ్యతను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించారు. అయితే విభజన బిల్లుపై రాజ్యాంగపరంగా పూర్తి కావలసిన ప్రక్రియను సాఫీగా ముగించేంతవరకు ఏ దశలోనూ బయటపడొద్దని ఆయనకు చెప్పడంతో ఇంతకాలంగా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. పార్టీ పెడుతున్న విషయం ఎప్పుడడిగినా ఆయన ఏ రోజూ సూటిగా సమాధానమివ్వకుండా.. ‘చూద్దాం.. ఏం జరుగుతుందో!’ అంటూ దాటవేశారు. దాంతో పార్టీలోని కొందరు నేతలు సీఎం కొత్త పార్టీ పెట్టబోరని సంశయం వ్యక్తంచేస్తూ వచ్చినప్పటికీ.. తాజాగా జరుగుతున్న పరిణామాలతో పార్టీ పెట్టనున్నారనే నిర్ధారణకు వచ్చినట్టు మాజీ మంత్రి ఒకరు చెప్పారు.
 
 కొత్త పార్టీ కోసం ఇప్పటికే కోట్లలో ఖర్చు...
 

 కొత్త పార్టీ వ్యవహారాల్లో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తలమునకలై ఉండగా.. ఎవరి ఊరూ పేరూ లేకుండా సమైక్య నినాదంతో తొలి హోర్డింగ్ విజయవాడలోనే వెలిసింది. ఇలా ఊరూపేరూ లేకుండా హోర్డింగ్‌లు వెలుగుచూసిన కొద్ది రోజుల్లోనే వివిధ చానళ్లలో సమైక్య ప్రచారం ఉధృతంగా మొదలైంది. ఈ కొత్త పార్టీ నిర్వహణకయ్యే నిధులను సమకూర్చడం కూడా ఒక పథకం ప్రకారమే జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా వెలిసిన హోర్డింగ్‌లు, చానళ్లలో ప్రచారానికి ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇవన్నీ పరోక్ష పద్ధతిలో ప్రభుత్వ నిధులే మళ్లాయన్న విషయం కాంగ్రెస్‌లో ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారింది. కొత్త పార్టీ లో చేరబోయే నేతలకు చెందిన సంస్థలకు భారీ ఆర్థిక ప్రయోజనాలు కల్పించే నిర్ణయాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పలు సంస్థలకు రాయితీలు కల్పించడం, భారీ నష్టాల్లో ఉన్న పలు సంస్థల బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేయడం వంటివన్నీ ఇందులో భాగమేనని అంటున్నారు.
 
 కిరణ్ పదవికి ఢోకా లేదని హామీ...
 
 కాంగ్రెస్ హైకమాండ్ స్క్రిప్ట్‌ను భుజాన వేసుకుని అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పదవికి ఢోకా లేదని కాంగ్రెస్ పెద్దల నుంచి స్పష్టమైన హామీ ఉందని పార్టీ వర్గాలు మొదటి నుంచీ చెప్తున్నాయి. పదవిపై భరోసా, హైకమాండ్ ఇచ్చిన సంకేతాల మేరకే సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తూ.. తానొక సమైక్య చాంపియన్ అన్న ప్రచారాన్ని తీసుకొచ్చేందుకు సీఎం ప్రయత్నించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవైపు అంతర్గతంగా హైకమాండ్ నిర్దేశించిన పనిని పూర్తి చేస్తూ.. బయటకు సమైక్య చాంపియన్‌గా ముద్రపడే విధంగా వ్యవహారాలను నడిపిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్న మరుక్షణం ఆ విషయాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పినప్పుడే ప్రత్యామ్నాయ పథకంపైన కూడా హైకమాండ్ పెద్దలు చర్చించినట్టు ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి.
 
 టీడీపీ నేతలకూ ప్రయోజనాలు..!
 
 రాష్ట్రంలో సమైక్య నినాదంతో ముందుకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడమెలాగో అర్థంకాక రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న టీడీపీ కూడా కాంగ్రెస్ ప్రణాళికకు అన్ని రకాలుగా సహకరిస్తోంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ ద్వారా కేసులు నమోదు చేయించిన క్రమంలో.. ఎమ్మార్, ఐఎంజీ కుంభకోణాల్లో తనపై ఎక్కడ కేసులు వస్తాయోనని భయపడిన చంద్రబాబు నాయుడు ఆ దశలో కాంగ్రెస్‌కు అన్ని రకాలుగా సహకరిస్తూ వచ్చారన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి.
  ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో బిల్లు వీగిపోరాదని భావించి టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలను గైర్హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు.
  రాష్ట్రంలో మైనారిటీలో పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ వంటి పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఆ ప్రభుత్వం పడిపోకుండా అవిశ్వాసానికి మద్దతునివ్వకుండా తటస్థ వైఖరితో గట్టెక్కించారు.
  త్వరలో లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళనతో ఉన్న టీడీపీ నాయకత్వం కాంగ్రెస్ అధిష్టానానికి తాజా పథకంలోనూ సహకరిస్తోందని తెలుస్తోంది.
  ఈ క్రమంలో జగన్‌పై దుష్ర్పచారం చేయడంలో తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని కాంగ్రెస్‌కు టీడీపీ నాయకత్వం హామీ ఇచ్చింది.
  టీడీపీ అందిస్తున్న సహకారానికి ప్రతిఫలాల్లో భాగంగా.. ఆ పార్టీకి చెందిన ఎంపీ సి.ఎం.రమేష్‌కు చెందిన ఒక సంస్థ కూడా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోగా దానికి 400 కోట్ల రూపాయల రుణాలను రీషెడ్యూలు చేసినట్టు తెలుస్తోంది.
 
 లగడపాటి ల్యాంకోకు రూ. 8 వేల కోట్ల రుణాలు..!
 
 కొత్త పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుటుంబానికి చెందిన సంస్థలకు ఇటీవలి కాలంలో భారీ ఆర్థిక ప్రయోజనమే కలిగింది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ల్యాంకో ఇన్‌ఫ్రా సంస్థకు.. ఆయా జాతీయ బ్యాంకుల నుంచి కొత్తగా 8 వేల కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం కల్పించారు.

  దాదాపు 36 వేల కోట్ల రూపాయల రుణాలపై కనీసం వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్న సంస్థ రుణాలను రీషెడ్యూలు చేయడమే కాకుండా కొత్తగా మరో 8 వేల కోట్ల మేరకు రుణాలను ఇప్పించే కార్యక్రమం చురుకుగా సాగుతోందని తెలుస్తోంది.
  సీమాంధ్రకు చెందిన ఎంపీలందరం రాజీనామా చేస్తామని ప్రకటన చేసి లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తామని వెళ్లడానికి ఒక్క రోజు ముందు.. సెప్టెంబర్ 23న ల్యాంకోకు చెందిన 660 మెగావాట్ల బాబంద్ (ఒడిశా)విద్యుత్ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా నిమిత్తం కోల్ ఇండియాతో లింకేజీ ఒప్పందం చేసుకోవడానికి మంత్రుల బృందం ల్యాంకోకు అనుమతిచ్చింది. 
  గడిచిన ఆరేళ్లుగా పెండింగ్‌లో పెట్టిన ఫైలు దుమ్ము దులిపి తాజా పరిణామాల్లో ఆగమేఘాలపై క్లియర్ చేయడం విశేషం. ఇందులో 18 ఎకరాలకు సంబంధించి అటవీ అనుమతులేవీ రానప్పటికీ కోల్ లింకేజీకి అనుమతిచ్చేశారు.
 
 చాంపియన్లుగా కొత్త పార్టీలో చేరండి...
 
 రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వమే.. ‘దాన్ని అడ్డుకుంటామని ప్రచారం చేసుకుంటూ ఈ క్రీడలో మీరే చాంపియన్లుగా ప్రచారం చేసుకోవాల’ని కూడా పార్టీ సీమాంధ్ర నేతలు పలువురికి నిర్దేశించినట్లు కాంగ్రెస్ వర్గాలు కొన్నాళ్ల కిందటే వెల్లడించాయి.
  ఈ ప్రత్నామ్యాయ పథకంలో భాగంగానే ధిక్కారస్వరం వినిపించిన నేతలు ఒక్కొక్కరుగా కొత్త పార్టీలో చేరడంపైన కూడా అధిష్టానం ఒక క్యాలెండర్ రూపొందించిందని తెలుస్తోంది.
  ఈ క్రమంలోనే తమ పదవులకు రాజీనామాలు చేస్తామని ప్రకటించడం దగ్గరి నుంచి రెండు రోజుల కింద జరిగిన ఏఐసీసీ సమావేశం వరకు కొందరు ఎంపీలు హైడ్రామా నడిపించారని సమాచారం.
  ఏఐసీసీ సమావేశానికి రావొద్దని అధిష్టానం ఆదేశించిందని వీరే ప్రచారం చేసుకున్నారు. అయినప్పటికీ ఆ సమావేశానికి వెళ్లారు.
  రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న బలమైన కాంక్ష ఉండిఉంటే ఏఐసీసీ సదస్సు వేదికనెక్కి నానా రభస చేసేవారేననీ.. అలాంటిదేమీ చేయలేదని పార్టీ వర్గాలు ప్రస్తావించాయి. పైగా వారు హైడ్రామా నడిపారన్న విషయం ఆంగ్ల పత్రికల్లో స్పష్టమైన కథనాలు వచ్చాయి.
  పిలవనప్పటికీ ఏఐసీసీ సమావేశానికి వెళతామని, తమ నిరసనను తెలియజేస్తామని వీరావేశంతో ప్రకటనలు చేసిన నేతలు తీరా అక్కడికి వెళ్లి దూరంగా (మీడియాకు కేటాయించిన చోటికి దగ్గరగా) నిలబడి కొద్దిసేపు ప్లకార్డులు ప్రదర్శించి వెనుదిరిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement