
విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లిలో స్థానికులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
నవ విశాఖ పునర్నిర్మాణానికి కొత్త ప్రణాళిక
నగరంలో దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వ సహకారంతో మరమ్మతులు
గురువారం నుంచే నిర్వాసితులకు రేషన్ బియ్యం, ప్రతి ఇంటికీ తాగునీరు
మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు వెల్లడి
తుపాను వల్ల దెబ్బతిన్న విశాఖపట్నం మహానగరాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆధునిక టెక్నాలజీ సాయంతో కొత్త ప్రణాళికను సిద్ధం చేశామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ‘న్యూసిటీ.. న్యూవిజన్’ లక్ష్యంతో సరి కొత్త అందమైన నగరాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో గురువారం సీఎం మీడియా తో మాట్లాడారు.
‘‘గడచిన నాలుగు రోజుల నుంచి చేయాల్సిందల్లా చే శాను. బాధితులకు సాయం అందించే విషయంలో మంత్రులు, మీడియా అందరూ సహకరించాలి. కష్టకాలంలో నాకు ఎవరైనా ఒక్కటే. అందరి వెంటా పడతా. ప్రజలకు మేలు జరిగే వరకూ వదలను’’ అని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి తుపా న్లు వచ్చినా ఎటువంటి నష్టం జరగకుండా అన్ని విధాలా ఎదుర్కొనే సత్తా ఉన్న భవనాల నిర్మా ణం ఎంతో అవసరమన్నారు. ఎల్ అండ్ టీ, ఐవీఆర్‌సీఎల్, టాటాగ్రూప్ వంటి ఉత్తమ నిర్మా ణ సంస్థల సాయంతో... మంచి కన్సల్టెంట్స్, ఆర్కిటెక్చర్‌ల సలహాలను స్వీకరించి అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో అందమైన భవనాల డిజైన్లతో విశాఖ స్మార్ట్‌సిటీ రూపకల్పన చేస్తామని చెప్పారు. ఇంకా ఆయనేం చెప్పారంటే...
► విశాఖ లో తుపానుకు దెబ్బతిన్న ఇళ్లన్నింటికీ ప్రభుత్వమే మరమ్మతులు జరిపిస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సాయంతో పేరున్న నిర్మాణ సంస్థల నుంచి నిపుణులైన సూపర్‌వైజర్ల బృందం రానుంది. బాధితుల జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపర్చి దశలవారీ ఇళ్లకు మరమ్మతులు జరిపిస్తాం. మెటీరియల్‌ను యజమానులు తెచ్చుకుంటే అందుకయ్యే కూలీల ఖర్చును మాత్రం ప్రభుత్వం భరిస్తుంది.
►దెబ్బతిన్న పచ్చదనాన్ని త్వరగా అభివృద్ధి పరిచేందుకు కడియం నర్సరీని సంప్రదించనున్నాం. సెల్ టవర్లను వేగంగా నిర్మించేందుకు వీలుగా టాటా, పాటూరి రామారావు, ఎల్ అండ్ టీ కంపెనీలతో చర్చిస్తున్నాం. విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరణకు టాటా పవర్‌గ్రిడ్ చైర్మన్‌తో మాట్లాడాం. శనివారం సాయంత్రానికి 80 శాతంసరఫరాను పునరుద్ధరిస్తాం.
►నగరంలో తెల్లకార్డుదారులకు రేషన్‌బియ్యం అందించనున్నాం. రాష్ట్రం లోని 72 అగ్నిమాపక శకటాలను రప్పించి వాటి ద్వారా విశాఖ అపార్ట్‌మెంట్లకు నీటి సరఫరా చేయనున్నాం.పశ్చిమ బెంగాల్ నుంచి 2,500 మెట్రిక్ టన్నుల బంగాళాదుంపలు, 200 లారీల ఉల్లిపాయలు తెప్పించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశాం.
►ఉత్తరాంధ్రలో కూలీలు, లారీ డ్రైవర్లు పనుల్లోకి వచ్చే పరిస్థితి లేనందున ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి రేషన్ బియ్యం తెప్పిస్తున్నాం. ఈ రోజు నుంచి స్టీల్‌ప్లాంట్‌కు సమీపంలోని కేవీఆర్‌కు పవర్ సరఫరా అందుతుంది. తీవ్రంగా దెబ్బతిన్న స్టీల్‌ప్లాంట్, నేవల్ బేస్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను పునర్ నిర్మించేందుకు కృషి చేస్తాం.
►నగరంలోని 72 వార్డులకూ గురువారం నుంచి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో ప్రజల కు పంపిణీ చేసేందుకు వీలుగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద పెద్ద కొవ్వొత్తులు, మస్కిటోకాయిల్స్ తెప్పించాలని అధికారులను ఆదేశించాం. ఎన్టీపీసీలో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి మొదలైంది. భవిష్యత్తులో కూలిపోకుండా ఉం డేందుకు గుండ్రని కరెంటు పోల్స్‌కు ప్రాథాన్యం ఇస్తున్నాం. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి జరుగుతున్న సహాయక పనులను పరిశీలిస్తాం.
రూ.10 ధర తగ్గించి పాలు విక్రయించాలి..
విశాఖ, హెరిటేజ్ డెయిరీల మేనేజర్లను పిలిపిం చిన సీఎం లీటరుకు రూ.10 ధర తగ్గించి రెండు రోజులపాటు పాలు విక్రయించాలని సూచిం చారు.
పెట్టుబడిదారులు రారన్న ప్రచారం వద్దు: పవన్‌కల్యాణ్
తుపాను ధాటికి దెబ్బతిన్న విశాఖపట్నం ప్రాంతానికి పెట్టుబడిదారులు రారన్న ప్రచారం వద్దనీ, దీనివ ల్ల లేనిపోని భయాందోళనలు పెరుగుతాయని సినీహీరో పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌తో సమానంగా విశాఖ ప్రాంతం చిత్రపరిశ్రమగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు.
కాల్ చార్జీలు తగ్గించండి: సీఎం సూచన
తుపాను ప్రభావిత జిల్లాల్లో ఫోన్ కాల్స్ చార్జీలను తగ్గించాలని సీఎం చంద్రబాబు సెల్‌ఫోన్ కంపెనీలను కోరారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో బాబు ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. తుపాను బారిన పడ్డ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో వినియోగదారులు ఇబ్బందుల్లో ఉన్నందున తక్కువ రేట్లతో టెలికాం సేవలు అందుబాటులోకి తేవాలని సీఎం కోరారు.
పునరావాస చర్యలు వేగంగా చేపట్టేందుకు అధికారులందరికీ 3జీ సేవలను అందించాలని సీఎం సూచించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 50 శాతం సేవలను పునరుద్ధరించామని టాటా కంపెనీ ప్రతినిధులు తెలియజేయగా, 48 శాతం పునరుద్ధరించినట్లు యూనినార్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫోన్ చార్జింగ్‌ను సైతం కొందరు వ్యాపారంగా చేయటంపై సీఎం స్పందిస్తూ అన్ని కంపెనీలు మొబైల్ చార్జింగ్ పాయింట్లను వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. దీనికి ఐడియా సెల్యులర్ స్పందించింది.
హాజరు కాని కంపెనీలపై అసహనం...
తుపాను కారణంగా దెబ్బతిన్న విశాఖలో ఫోన్ సేవలను పునరుద్ధరించటంపై నిర్వహించిన కీలక సమావేశానికి పలు కంపెనీల అధిపతులు గైర్హాజరయ్యారు.భారతి ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్ మాత్రమే హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో కూడా ప్రజలకు సేవలందించేందుకు కంపెనీల అధిపతులు ముందుకు రాకపోవడం విచారకరమని సీఎం అసహనం వ్యక్తం చేశారు.