సాక్షి, హైదరాబాద్: చిత్తూరు మంచినీటి పథకం కోసం ఎక్కువమంది కాంట్రాక్టర్లు పోటీ పడకుండా చేయడానికి ప్రభుత్వ పెద్దలు కొత్త ఎత్తుగడ అమలు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఎక్కువ పోటీ లేకుండా చేయడంతో పాటు తమ వారికి కాంట్రాక్టు దక్కేలా పకడ్బందీగా వ్యవహారం నడిపించడానికి దేశంలో ఎక్కడా లేని నిబంధనను తెరపైకి తెచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పథకం మొదటిదశ కింద రూ.2,300 కోట్ల విలువైన పనుల కోసం టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి తమవారికి దక్కేలా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్పొరేట్ రుణాల పునర్వ్యవస్థీకరణ (సీడీఆర్)కు దరఖాస్తు చేసుకున్న సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనడానికి అనర్హులన్న నిబంధన విధించారు.
అయితే ఈ నిబంధన చట్టవిరుద్ధమని హైదరాబాద్‌కు చెందిన తాహేర్ అలీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చే శారు. ఈ వివాదం కోర్టులో నడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సీడీఆర్‌కు సంబంధించి హైకోర్టు తదుపరి విచారణ ఈనెల 18వ తేదీన జరగనుంది. హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడతాయో తెలియకుండానే.. టెండర్ల దాఖలు గడువును ఈనెల 20వ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు దాఖలు సమయంలో సాల్వెన్సీ సర్టిఫికెట్ (ఆర్థిక పటిష్టతపై బ్యాంకులు ఇచ్చే ధ్రువీకరణ పత్రం)ను జత చేస్తున్నప్పుడు ఈ సీడీఆర్‌ను గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ ఈ నిబంధన విధించడం అనుమానాలకు తావిస్తోందని పదవీ విరమణ చేసిన ఇంజనీర్లు అంటున్నారు. తాహేర్ అలీ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఇంప్లీడ్ కావడానికి మరో నలుగురు కాంట్రాక్టర్లు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.
చిత్తూరు నీటి టెండర్లకు కొత్త నిబంధన!
Published Fri, Nov 8 2013 2:15 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement