కొత్త పాలకులు.. పాత సమస్యలు | New rulers of the old problems .. | Sakshi
Sakshi News home page

కొత్త పాలకులు.. పాత సమస్యలు

Published Sun, Jul 27 2014 2:16 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

కొత్త పాలకులు.. పాత సమస్యలు - Sakshi

కొత్త పాలకులు.. పాత సమస్యలు

నవ్యాంధ్రలో కొలువుదీరిన కొత్త సర్కారు.. మన జిల్లా నుంచి కొత్తగా ఇద్దరు మంత్రులు.. మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలోనూ నూతన పాలకవర్గాలు.. పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లోనూ నవయువ పాలకులు.. అధికారులూ అంతా కొత్త వాళ్లే. సరిగ్గా ఇటీవల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు ముందు కలెక్టర్‌గా కాటమనేని భాస్కర్ బాధ్యతలు స్వీకరించగా, చంద్రబాబు జిల్లా పర్యటనలో ఉండగానే జిల్లా ఎస్పీ ఎన్.హరికృష్ణకు బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఆయన స్థానంలో నియమితులైన ప్రస్తుత కర్నూలు ఎస్పీ ఎస్.రఘురామిరెడ్డి అక్కడి పనులు పూర్తి చేసుకుని శ్రావణ మాసం రాగానే ఇక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు. మొత్తంగా జిల్లాలో పరిపాలనా వ్యవస్థ అంతా కొత్త నీరుతో నిండిపోయింది.

కానీ.. సమస్యలు మాత్రం పాతవే. జిల్లావ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపై కొత్త పాలకులు దృష్టి పెట్టి శరవేగంగా పరిష్కారానికి కృషి చేస్తారని సహజంగానే జనం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఓ ప్రజాప్రతినిధి మాత్రం పాదయాత్ర జాతర మొదలుపెట్టి ఎన్నికలకు ముందు చూసిన సమస్యలనే మళ్లీ మళ్లీ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం తిరిగినపుడు ప్రజలు అక్కడి సమస్యలను సదరు నేత దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికలు పూర్తయి ఈయన గెలిచి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఏ పనులూ చేపట్టలేదు. ప్రజాప్రతినిధిగా ఆయనకు తెలియకుండా అక్కడ కొత్తగా జరిగిందేమీ లేదు. మరి ఇంకెందుకు ఈ యాత్ర.. ఇప్పటివరకు చూసింది చాలు.. ఇక చేయండి.. పబ్లిసిటీకి పాతర వేసి పనుల జాతర మొదలుపెట్టాలని జనం గగ్గోలు పెడుతున్నారు. వింటున్నారా పాలకులూ...
 
బదిలీల వెనుక ‘బాబు’
రాష్ర్టంలో ఇప్పుడు ఏ అధికారి బదిలీ అయినా సీఎం చంద్రబాబు నాయుడుకు తెలియకుండా జరగదు. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా. ఇక్కడ ప్రస్తావించేది ఆ బాబు గురించి కాదు. మన జిల్లా బాబు. అదేనండీ.. ఎంపీ మాగంటి బాబు గురించి. జిల్లాలో ముఖ్య అధికారుల బదిలీల వెనుక, కొత్త అధికారుల ఆగమనం వెనుక ఆయన హస్తం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయూంలో పనిచేసిన అధికారులు ఇక్కడ ఉండకూడదంటూ ఆయన గట్టిగా పట్టుబట్టడం వల్లే ఏ జిల్లాలోనూ లేని విధంగా ఇక్కడి అధికారుల బది లీలు వేగంగా జరిగాయని అంటున్నారు. ఏమో.. ఆ బాబు హస్తమో.. ఈ బాబు జోక్యమో తెలియదు కానీ జిల్లాకు అనువైన అధికారులే వచ్చారంటూ ఇద్దరి బాబులనూ అభినందిస్తున్నారట అధికార పార్టీ నేతలు.
 
‘అమ్మా.. పుల్లారావూ’
మర్యాద, మన్ననల్లో గోదావరి బిడ్డలదే అగ్రస్థానం. ఎదుటి వారిని ‘అండీ..’ అని సంబోధించడం పరిపాటి. ప్రాణం కంటే పిలుపులో గౌరవం, మర్యాదలే  మిన్నగా ఇక్కడి వారంతా భావిస్తుం టారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. గుంటూరుకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పశ్చిమగోదావరి జిల్లాకు ఇటీవల పలు సందర్భాల్లో విచ్చేశారు. వ్యవసాయం కీలకశాఖ కాబట్టి అధికారులతో సమీక్షలూ చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన అధికారులనుద్దేశించి.. ‘అది కాదమ్మా.. ఇటు చూడమ్మా.. లేదమ్మా... చేయండమ్మా’ అంటూ మాటకు ముందు, మాటకు వెనుక అమ్మా అని సంబోధిస్తున్నారట. బహుశా అమ్మా అని పిల వడం ఆయనకు ఊతపదం కావొచ్చేమో గానీ.. 50ఏళ్లకు పైబడిన వయసు వారిని.. రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న అధికారులను సైతం సదరు మంత్రి అమ్మా అని పిలవడంతో వాళ్లు కాస్త నొచ్చుకుంటున్నారట. బయటకు చెబితే బాగోదని నోరు నొక్కుకుంటున్నారట.
 - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement