నూతన భవనాలు నిర్మించాల్సిన ప్రాంతం
సాక్షి, నెల్లిమర్ల(విజయనగరం) : జూనియర్ కళాశాల నూతన భవనాల నిర్మాణానికి 2013లోనే ప్రస్తుత ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు స్థలం కేటాయించారు. అప్పట్లోనే భవనాల నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేయించారు. ఇంకా అదనంగా భవనాల నిర్మాణానికి రెండేళ్ల క్రితం సర్వ శిక్షాభియాన్ నిధులు రూ.2.6కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో టీడీపీ ప్రభుత్వం గత రెండేళ్లలో భవనాలను నిర్మించలేకపోయింది. దీంతో సమస్య యథాతధంగా మిగిలిపోయింది. నెల్లిమర్ల పట్ట ణంలో సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు బాలుర ఉన్నత పాఠశాల ఒకే ప్రాంగణంలో నడుస్తున్నాయి. ఆరు దశాబ్దాలుగా ఈ రెండు విద్యాసంస్థలు అరకొర భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఏడేళ్ల క్రితం వరకు ఉదయం పూట పాఠశాల, రెండోపూట కళాశాల నిర్వహించేవారు.
అయితే పాఠశాలతో పాటు కళాశాలను రెండుపూటలా నిర్వహించాలని సంబంధిత అధికారులు ఆదేశించడంతో అప్పటి నుంచి రెండుపూటలా నిర్వహిస్తున్నారు. ఒకే ప్రాంగణంలో రెండు విద్యాసంస్థలు నిర్వహించడం, అరకొరగా భవనాలు ఉండటంతో ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు 2013లో కళాశాలకు ప్రత్యేకంగా భవనాలు నిర్మించేందుకు మిమ్స్ సమీపంలో రెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ప్రాథమికంగా భవనాల నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేయించారు. ప్రస్తుతం అవే భవనాల్లో ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించిన తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాల అంతటికీ నూతన భవనాలు నిర్మించాలని అప్పట్లోనే ఎమ్మెల్యే బడ్డుకొండ ప్రణాళికలు రూపొందించారు. అయితే 2014లో ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
రెండేళ్ల క్రితం కళాశాల భవనాలకు సర్వ శిక్షాభియాన్ రూ.2.6కోట్లు మంజూ రు చేసింది. ఆ నిధులతో కళాశాలకు సంబంధించి 16 గదులతో పాటు ప్రహరీ, మరుగుదొడ్లు నిర్మించాలని తలంచారు. టెండరు కూడా ఖరారైంది. గత రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఆ నిధులను వినియోగించలేకపోయింది. ఇప్పటికీ నూతన భవనాలను నిర్మించలేకపోయారు. దీంతో కళాశా ల తరలింపు ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బడ్డుకొండ కల్పించుకుని నూతన భవనాలను వెంటనే నిర్మించేలా చర్యలు చేపట్టాలని పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కోరుతున్నారు. తద్వారా దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యను తీర్చాలని విన్నవిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment