టీటీడీ విద్యా సంస్థల అభివృద్ధికి రూ.100 కోట్లు | New TTD Board Members Sworn In Tirumala | Sakshi
Sakshi News home page

టీటీడీ విద్యా సంస్థల అభివృద్ధికి రూ.100 కోట్లు

Published Tue, Sep 24 2019 3:32 AM | Last Updated on Tue, Sep 24 2019 8:54 AM

New TTD Board Members Sworn In Tirumala - Sakshi

సోమవారం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను తిరుపతిలోని పరిపాలన భవనంలో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సోమవారం వెల్లడించారు. సుమారు 8 వేల మంది కాంట్రాక్టు సిబ్బందికి టైమ్‌స్కేల్‌ ఇచ్చే అంశంపై చర్చ జరిగిందన్నారు. దీనిపై ఫైనాన్స్‌ కమిటీ పరిశీలించి సూచనలు చేయాల్సిందిగా పాలకమండలి కోరిందన్నారు. బర్డ్‌ ఆస్పత్రి డైరెక్టర్‌గా జగదీష్‌ను కొనసాగించాలన్న ప్రతిపాదనను తిరస్కరించిందన్నారు. తిరుపతిలో నిర్మించే గరుడ వారధిపై ప్రభుత్వంతో సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీటీడీకి బిల్డింగ్‌ అప్రూవల్‌ వంటివాటిపై బకాయిలు చెల్లించాల్సిందిగా తుడా ఇచ్చిన నోటీసుపై చర్చించామన్నారు. సుమారు రూ.23 కోట్ల మేరకు రావాల్సిందిగా తుడా తన నోటీసులో పేర్కొందన్నారు. 

ప్రమాణస్వీకారం చేసిన నూతన సభ్యులు 
నూతనంగా నియమితులైన టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా ఎక్స్‌అఫీషియో సభ్యులైన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్, టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, దేవదాయ శాఖ కమిషనర్‌ పద్మజ, తర్వాత సభ్యులుగా మేడా మల్లికార్జునరెడ్డి, బి.పార్థసారథిరెడ్డి, పి.ప్రతాప్‌రెడ్డి, డాక్టర్‌ నిచితా, కె.పార్థసారథి, మురళీకృష్ణ, ఎన్‌.శ్రీనివాసన్, జె.రామేశ్వరరావు, ఎన్‌.సుబ్బారావు, జి.వెంకటభాస్కర్‌రావు, డి.దామోదర్‌రావు, ఎంఎస్‌ శివశంకర్, కుమారగురు, సి.ప్రసాద్‌కుమార్, ఎం.రాములు, కె.శివకుమార్, యువి.రమణమూర్తి రాజులు ప్రమాణస్వీకారం చేశారు. సభ్యులతో ఈవో సింఘాల్‌ ప్రమాణస్వీకారం చేయించారు. సభ్యులందరూ శ్రీవారిని దర్శించుకున్నాక రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి సభ్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అదేవిధంగా ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, రాకేష్‌ సిన్హా, ఏజే శేఖర్, కుపేందర్‌ రెడ్డి, దుష్మంత కుమార్‌ దాస్, అమోల్‌ కాలేలతో తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్‌ జెట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.  


టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన దేవదాయ కమిషనర్‌ పద్మ దంపతులకు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌కు శ్రీవారి చిత్రపటాన్ని అందజేస్తున్న తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి  

తాగునీటి కోసం బాలాజీ రిజర్వాయర్‌
తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టామని, దీని అంచనా రూపొందించి వచ్చే ధర్మకర్తల మండలి సమావేశంలో ఆమోదిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ 50వ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఆయన నేతృత్వంలో జరిగింది. వివిధ అంశాలను చర్చించిన పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. తిరుమలలో పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రానిక్‌ బస్సులు, కార్లు ప్రవేశపెడతామన్నారు. టీటీడీలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి సబ్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. తిరుపతిలో గరుడ వారధి నిర్మాణానికి ప్రభుత్వంతో సంప్రదించి నిధులు కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుపతి వాసులకు ఉపయోగపడేలా అవిలాల చెరువు, పార్కును నిర్మిస్తామన్నారు.   

ధర్మకర్తల మండలి నిర్ణయాల్లో ముఖ్యమైనవి

  • ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు కింద దేవాలయాల నిర్మాణాలకు రూ.10 లక్షలు తక్కువ కాకుండా ఇచ్చేవారికి ఏడాదిలో ఒకసారి వీఐపీ దర్శనం
  • టీటీడీ విద్యా సంస్థల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు
  • వచ్చే ఏడాది నుంచి టీటీడీ విద్యా సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోటా రద్దు
  • బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.150 కోట్లు అవసరమవుతాయని అంచనా. తదుపరి సమావేశం లోపు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా ఆదేశాలు
  • టీటీడీ అధికారుల కోసం అందుబాటులోకి 40 బ్యాటరీ వాహనాలు. వీటి నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలకు.. ఇందుకోసం ఏటా రూ.2.45 కోట్లు 
  • టీటీడీ ఉద్యోగులకు సంబంధించి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయింపు
  • కొత్తగా మూడు కల్యాణ మండపాల నిర్మాణానికి నిధుల మంజూరు
  • ఎస్టేట్‌ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
  • సన్నిధి గొల్లగా పనిచేస్తున్న ఎస్‌.పద్మనాభంను పర్మినెంట్‌ చేయాల్సిందిగా ప్రభుత్వ అనుమతిని కోరుతూ నిర్ణయం
  • గతంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసి ఆ తర్వాత టీటీడీ ఏడీ బిల్డింగ్‌లో భద్రపరచిన బంగారు ఆభరణాలను తాత్కాలికంగా ఒక ఏడాది కాలపరిమితితో డిపాజిట్‌ చేయాలని నిర్ణయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement