
బీరు.. జోరు!
రూ.2కోట్ల మద్యం తాగేశారు!
కర్నూలు: నూతన సంవత్సర వేడుకల వేళ మద్యం వ్యాపారం మూడు బీర్లు, ఆరు క్వాటర్లుగా సాగింది. గత రెండు రోజులుగా మందు బాబులు ఏమి తాగారనే కోణంలో పరిశీలిస్తే.. ఎక్కువగా బీర్లు వినియోగించినట్లు తెలుస్తోంది. వాస్తవంగా వేసవిలోనే బీర్ల వినియోగం అధికంగా ఉంటుంది. కానీ జిల్లాలో మాత్రం సీజన్‌తో ఎలాంటి సంబంధం లేకుండా కొత్త సంవత్సర వేడుకల పేరుతో ఎంచక్కా బీరు సీసాలతో పండుగ చేసుకున్నారు.
నవంబర్ మాసంలో రూ.6 కోట్ల విలువ చేసే బీర్ల విక్రయాలు జరగ్గా.. డిసెంబర్‌లో 8 కోట్లు బీర్లు అమ్ముడుపోయాయి. చివరి రెండు రోజుల్లోనే రూ.2 కోట్ల బీరు విక్రయాలు జరిగినట్లు సమాచారం. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు వేడుకలు చేసుకున్న మద్యం బాబులు రెండవ రోజు కూడా(జనవరి 1) దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే మద్యాన్ని తాగేశారు.