ఆర్మూర్, న్యూస్‌లైన్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో విడివిడిగా జరుగుతాయని పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందన్నారు.
రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని, సోనియాగాంధీ ధృడ సంకల్పంతో తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. సీమాంధ్రులు ఆటంకాలు సృష్టించినా, ఆటలాడినా కాంగ్రెస్ అధినేత్రి నిర్ణయం మారదన్నారు. పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, న్యాయవాదులు, ప్రజలు, మేధావులు ముక్తకంఠంతో సోనియాకు మద్దతుగా నిలవాలని సూచించారు. డీఎస్ తెలం గాణ విషయంలో ఏమీ మాట్లాడడం లేదని అందరూ అంటుంటారు... మీడియాతో మాట్లాడితే తెలంగాణ రాదు. తెలంగాణ కావాలంటే ఉద్యమాలు, మీడియా అన్నీ కావాలని అన్నారు. ఏ స్థాయిలో ఏం చేయాలో అదే తాను చేశానని చెప్పుకొచ్చారు.