
సాక్షి, చెన్నై: తెలుగుదేశం పార్టీ నాయకుడు, పారిశ్రామికవేత్త, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కార్యాలయాలపై రెండు రోజులుగా సాగుతున్న ఐటీ సోదాలు ఆదివారం కూడా కొనసాగాయి. ఆయన ఎమ్మెల్సీ హోదాలో ఉన్న వ్యక్తి కావడంతో ఐటీ వర్గాలు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాయి. అన్ని రకాల సమాచారాన్ని పకడ్బందీగా సేకరించిన అనంతరమే శుక్రవారం నుంచి సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మూడో రోజు ఆదివారం 13చోట్ల సోదాలు జరగ్గా, అనేక ఆస్తుల డాక్యుమెంట్లు, కీలక రికార్డులు బయటపడినట్లు సమాచారం.
హవాలా కేసు విచారణతో ఐటీ కన్ను
అంతకుముందు.. గత నెల 30న చెన్నైలోని ఓ హోటల్‌లో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు జరపగా రూ.11 కోట్ల నగదు, ఏడు కేజీల బంగారం పట్టుబడింది. హవాలా రూపంలో ఈ నగదు, బంగారం మార్పిడి జరగడం, కొరియాకు చెందిన ఇద్దరు మహిళలు అరెస్టు కావడంతో విచారణలో మాగుంట సంస్థల వ్యవహారం వెలుగుచూసింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్సీ హోదాలో ఉన్న వ్యక్తి కావడంతో, అన్ని వివరాలు సేకరించిన అనంతరం ఐటీ శాఖ రంగంలోకి దిగింది. హవాలా కేసు విచారణ కొనసాగింపులో భాగంగా శుక్రవారం నుంచి మాగుంట సంస్థలు, కార్యాలయాలు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు కొనసాగాయి. రెండు రోజుల్లో పదిచోట్ల సోదాలు జరగగా.. ఆదివారం 13చోట్ల నిర్వహించారు. అలాగే, ఫ్యాక్టరీలో లభించిన రూ.55 కోట్ల నగదుపై ఆదివారం ఆరా తీశారు.
ఈ తనిఖీల్లో పెద్దఎత్తున అనేక ఆస్తులు, నగలు లావాదేవీల వ్యవహారాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు ఐటీ అధికారులకు లభించినట్లు సమాచారం. కాగా, పట్టుబడ్డ నగదు, రికార్డులు, ఇతర ఆస్తుల డాక్యుమెంట్లకు సంబంధించిన అన్ని వివరాలను రికార్డు చేసి, ఫైనాన్స్ అధికారి వాంగ్మూలం, సంతకం తీసుకుని, విచారణను ఐటీ వర్గాలు ముగించాయి. ఇప్పటివరకు లభించిన ఆధారాలను పరిశీలించాకే ఐటీ శాఖ తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment