వచ్చే ఏడాదీ ఉమ్మడి సెట్స్! | Next year Common entrance exams for two states | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాదీ ఉమ్మడి సెట్స్!

Published Sun, Mar 23 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

Next year Common entrance exams for two states

 రెండు రాష్ట్రాలకు ప్రస్తుత ఉన్నత విద్యామండలి సేవలే

 

 సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది కూడా రెండు రాష్ట్రాల్లో ఒకే ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఎంసెట్ వంటి వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్) జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనలో భాగంగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్న అధికారులు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఆలోచనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అపాయింటెడ్ డే అయిన వచ్చే జూన్ 2 నుంచి 2015 జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రస్థాయి విద్యా, శిక్షణ సంస్థలు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలు అందించాలి. అందులో ఉన్నత విద్యా మండలి కూడా ఒకటి. ఈ విద్యా, శిక్షణ సంస్థల సేవల కొనసాగింపుపై 2015 జూన్ 2వ తేదీలోగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓ అవగాహనకు రావాల్సి ఉంటుంది. అంటే 2015 జూన్ 2 వరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రెండు రాష్ట్రాలకు కచ్చితంగా సేవలు అందించాల్సిందే. ఈ లెక్కన ఇపుడే కాదు వచ్చే ఏడాది కూడా వివిధ సెట్స్ నిర్వహణకు ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. నిర్ణీత వ్యవధిలోగానే (2015 జూన్ 2లోగా) ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్ తదితర ప్రవేశపరీక్షల నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి పూర్తవుతుందని చెబుతున్నారు. వివిధ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షలు అన్నీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోనే జరుగున్నాయి. సాధారణంగా వాటి షెడ్యూలును డిసెంబర్ నెలలోనే మండలి ఖరారు చేస్తోంది. ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో పరీక్ష నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తోంది. ఆయా వర్సిటీలు జనవరిలో నోటిఫికేషన్లను జారీ చేసి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలను నిర్వహించి, మే నెలాఖరుకల్లా ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది కోసం కూడా 2014 డిసెంబర్‌లోనే షెడ్యూలు ఖరారు కానుంది.

 

 కౌన్సిల్ నేతృత్వంలో నిర్వహణ: ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి

 మండలి(కౌన్సిల్) సేవలు వినియోగించుకునే అవకాశం అపాయింటెడ్ డే నుంచి ఏడాది పాటు ఉంటుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే జూన్ 2న ఏర్పడిన వెంటనే కౌన్సిల్‌ను విభజించే అవకాశాలు తక్కువ. ఒకవేళ కౌన్సిల్ విభజన జరిగినా పరీక్ష నిర్వహణ వేర్వేరు రాష్ట్రాల్లో కష్టం అవుతుంది. కాబట్టి ప్రస్తుత కౌన్సిల్ నేతృత్వంలోనే వచ్చే ఏడాది ప్రవేశాల కోసం సెట్స్ నిర్వహించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement