సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను చంపాలన్న ఉద్దేశంతోనే ఆయనపై శ్రీనివాసరావు అలియాస్ చంటి కత్తితో దాడికి పాల్పడ్డారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తేల్చింది. జగన్‌ను అంతమొందించాలనే మెడపై పొడిచేందుకు శ్రీనివాసరావు ప్రయత్నించాడని, ఈ ప్రక్రియలో జగన్‌కు తన ఎడమ చేయి పై భాగంలో గాయమైందని స్పష్టం చేసింది. విశాఖపట్నం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి వెళ్లేందుకు సాధారణ ప్రజానీకానికి అనుమతి ఉండదని, అందువల్ల నిందితుడు సెల్ఫీ పేరుతో లోనికి ప్రవేశించాడని తెలిపింది. జగన్‌పై దాడి చేసేందుకు శ్రీనివాసరావు సరైన సమయం కోసం ఎదురు చూశాడని వివరించింది. ముందస్తు పథకంలో భాగంగానే 2018 జనవరిలో కోడి పందేల సందర్భంగా తన ఊరికి సమీపంలో కత్తిని సంపాదించాడని పేర్కొంది. ఈ విషయాలన్నింటినీ జనవరి 12 నుంచి 18 వరకు తాము చేపట్టిన విచారణలో శ్రీనివాసరావు స్వయంగా వెల్లడించాడని ప్రత్యేక కోర్టుకు ఎన్‌ఐఏ తెలిపింది. శ్రీనివాసరావు చర్యలు పౌర విమానయాన చట్టంలోని సెక్షన్ 3ఏ(1)(ఏ) కింద చట్ట వ్యతిరేక కార్యకలాపాల పరిధిలోకి వస్తాయంది. అంతేకాక జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడం ద్వారా ఐపీసీ సెక్షన్ 307 కింద కూడా నేరానికి పాల్పడ్డారంది. ఈ నేరాలను విచారణ నిమిత్తం స్వీకరించాలని కోర్టును కోరింది. పౌర విమానయాన చట్టం కింద శ్రీనివాసరావును ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేశామని తెలిపింది. అనుమతి రాగానే ఆ విషయాన్ని కోర్టుకు నివేదిస్తామంది. జగన్‌ను చంపాలన్న కుట్ర ఎవరిది? ఎవరి ప్రేరణతో శ్రీనివాసరావు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు? తదితర అంశాలపై సీఆర్‌పీసీ సెక్షన్ 173(8) కింద దర్యాప్తును కొనసాగిస్తామని కోర్టుకు నివేదించింది. ఇలా అన్ని అంశాలను క్రోడీకరిస్తూ జనవరి 23న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ కేసు ప్రధాన దర్యాప్తు అధికారి మహ్మద్ సాజిద్ ఖాన్ చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షుల వివరాలు, సేకరించిన డాక్యుమెంట్లను జత చేశారు. ఈ చార్జిషీట్‌కు ప్రత్యేక కోర్టు ప్రొవిజినల్ క్రిమినల్ నెంబర్(పీఆర్‌సీ) కేటాయించాల్సి ఉంది. అనుబంధాలను మినహాయిస్తే, ఈ చార్జిషీట్ 9 పేజీలుంది.
జగన్ రాకపోకలపై కన్ను...
శ్రీనివాసరావు విమానాశ్రయంలో తిరిగేందుకు ఫ్యూజన్ ఫుడ్స్ యాజమాన్యం ఎయిర్‌పోర్ట్ అధికారులకు దరఖాస్తు చేసింది. ఎంట్రీ పాస్‌ను అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. ఈ పాస్ కోసం దరఖాస్తు చేసినప్పుడు శ్రీనివాసరావు అనేక కీలక విషయాలను దాచి పెట్టాడు. తనపై కేసు విషయాన్నీ మరుగునపెట్టాడు. దీని గురించి అధికారులూ విచారణ చేయలేదు. మరోవైపు ఉత్తరాంధ్రలో జగన్ చేసిన పాదయాత్రను శ్రీనివాసరావు చాలా జాగ్రత్తగా గమనిస్తూ వచ్చాడు. అలాగే విశాఖ విమానాశ్రయం నుంచి ఆయన రాకపోకలను కూడా పరిశీలించాడు. ప్రతివారం హైదరాబాద్ వెళ్లేందుకు జగన్ విశాఖ విమానాశ్రయానికి వచ్చేవారు. ఈ సమయంలోనే జగన్‌పై దాడి చేయాలని శ్రీనివాసరావు ప్రణాళికలు రచించారు. కోడి పందేలకు ఉపయోగించే కత్తిని ఇందుకోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. తన ఈ ప్రణాళికను అమలు చేసేందుకు వైఎస్సార్ సీపీ వారితో మాట్లాడి జగన్‌తో తనకు సెల్ఫీ తీసుకునే అవకాశం ఇప్పించేలా చేయాలని ఫ్యూజన్ ఫుడ్స్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న యువతిని అడిగాడు. అక్టోబర్ 25న జగన్ విశాఖ విమానాశ్రయం వస్తున్నారని, ఆ రోజున సెల్ఫీ తీసుకోవచ్చునని ఆ యువతి శ్రీనివాసరావుకు చెప్పింది. ఆరోజున విమానాశ్రయం చేరుకున్న జగన్ నేరుగా వీఐపీ లాంజ్‌లోకి వెళ్లారు. ఆయన వెంట పీఏతో పాటు పార్టీ నేతలు కూడా ఉన్నారు. కొద్దిసేపటి తరువాత ఫ్యూజన్ ఫుడ్స్ సిబ్బంది జగన్, ఇతర నేతలకు కాఫీ, టీ అందించారు.
అవకాశం రాగానే దాడి చేశాడు...
శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్ యూనిఫాం ధరించి, వీఐపీ లాంజ్‌లోకి అడుగుపెట్టే సమయంలో కత్తిని గుర్తించకుండా ఉండేందుకు చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్లాడు. జగన్‌కు ఎడమ వైపు నిల్చున్నాడు. సమయం రాగానే చంపేందుకు ఆయన మెడపై కత్తితో దాడికి ప్రయత్నించారు. ఈ ప్రక్రియలో జగన్ ఎడమ చేయికి గాయమైంది. ఆ వెంటనే ప్రొటోకాల్ అధికారులు, స్థానిక పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ అధికారులు లాంజ్‌లోకి వచ్చి శ్రీనివాసరావును పట్టుకుని విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ సెక్యూరిటీ హోల్డ్ ఏరియా(ఎస్‌హెచ్‌ఏ) వైపు తీసుకెళ్లారు. ఈ విషయాలన్నింటినీ శ్రీనివాసరావు మా
ఇంటరాగేషన్‌లో వెల్లడించారు.
3.5 సెంటీమీటర్ల లోతుగా గాయం...
దాడి తరువాత జగన్ విమానాశ్రయంలో ఉన్న అపోలో హెల్త్ డెస్క్ డాక్టర్ వద్ద చికిత్స తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడికి చేరుకోగానే జగన్ నేరుగా సిటీ న్యూరో సెంటర్‌కు వెళ్లారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్సను అందించారు. 3.5 సెంటీమీటర్ల లోతుగా గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఆ మేర చికిత్స అందించి, 26వ తేదీ మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు. శ్రీనివాసరావు తన చర్యల ద్వారా పౌర విమానయాన చట్టం కింద నిర్ధేశించిన నేరాలకు పాల్పడ్డారని చార్జీషీట్‌లో ఎన్‌ఐఏ పేర్కొంది
జగన్‌పై హత్యాయత్నం కేసు 8కి వాయిదా
విజయవాడ లీగల్: జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణను ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం పూర్తి అదనపు ఇన్‌చార్జి జడ్జి అచ్యుత పార్థసారథి ఈ నెల 8కి వాయిదా వేశారు. నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెమోలపై కౌంటర్ అండ్ వాదనల నిమిత్తం న్యాయమూర్తి వాయిదా వేశారు.
జగన్‌ను చంపడమే శ్రీనివాసరావు లక్ష్యం
Published Fri, Feb 1 2019 1:53 AM | Last Updated on Fri, Feb 1 2019 9:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment