
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా విమర్శించారు. తనను ఎవరూ ప్రశ్నించకూడదన్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తోందన్నారు. కాకినాడలో సమస్యలపై నిలదీసిన ఒక మహిళను ‘ఫినిష్ చేస్తానంటూ..’ గూండాలా బెదిరించడం దారుణమని మండిపడ్డారు. ఇదే రీతిలో అసెంబ్లీలో కూడా చాలాసార్లు ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తానని బెదిరించిన విషయం గుర్తు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్లలో ఎన్ని చేయాలో అన్నీ చేశారని దుయ్యబట్టారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా గౌరవించనంటున్నారంటే ఏమనాలని ప్రశ్నించారు.
కేంద్రం పరిధిలో ఉన్న ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ని అంతమొందిస్తే ఆ నేరం కేంద్రంపైకి పోతుందని చంద్రబాబు ప్లాన్ చేశారని రోజా చెప్పారు. కేంద్రం ఈ కేసును ఎన్‌ఐఏకు ఇస్తే నిందితుడు శ్రీనివాస్‌కు లేని బాధ చంద్రబాబుకు, లోకేశ్‌కు ఎందుకని నిలదీశారు. ‘ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసును మీరు ఎన్‌ఐఏకి అప్పగిస్తే అది సమాఖ్య స్పూర్తికి విరుద్ధం కాదా? కిడారి కేసును బదిలీ చేసినట్టే జగన్ హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకి ఎందుకు ఇవ్వలేదు?’ అని రోజా నిలదీశారు. సినిమాలు లేని శివాజీ అనే నటుడితో ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు చెప్పించింది నిజం కాదా? అని ఆమె ప్రశ్నించారు. జగన్‌పై హత్యాయత్నం నూటికి నూరు శాతం చంద్రబాబే చేయించారన్నట్టుగా ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయన్నారు.
హర్షవర్ధన్ మీ బినామీ కాదా?
‘ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ అధినేత హర్షవర్ధన్ చౌదరి మీకు బినామీ కాదా?, ఆ రెస్టారెంట్‌ను ప్రారంభించింది మీరు కాదా? శ్రీనివాస్ ఉపయోగించిన కత్తి హర్షవర్థన్ రెస్టారెంట్‌లో ఎంతో కాలంగా ఉన్నది నిజం కాదా? మీకు సంబంధం లేనప్పుడు కేసును ఎన్‌ఐఏకి అప్పగించాలి కదా. ఎన్‌ఐఏకి కేసు అప్పగించాలని అధికారులు కోరితే రాష్ట్ర పోలీసులు ఎందుకు సహకరించడం లేదు..’ అని రోజా నిలదీశారు. తిరిగి తాను అధికారంలోకి రాను అని భావించిన చంద్రబాబు.. జగన్‌ను భౌతికంగా లేకుండా చేసేందుకు ప్లాన్ చేసినా భగవంతుడి దయవల్ల ఆయన బయటపడ్డారన్నారు. బీజేపీతో లాలూచీ పడింది, మోదీకి ఊడిగం చేస్తోంది కూడా చంద్రబాబేనన్నారు.
ఏపీలో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. ‘కేంద్రంపై యుధ్దం అని పైకి చెబుతూ నీతి ఆయోగ్ మీటింగుకి వెళ్లి వంగి వంగి దండాలు పెట్టింది మీరు కాదా? కర్ణాటక ఎన్నికలయ్యాక తనను అరెస్ట్ చేయబోతున్నారని, తనను రక్షించుకోవాలని బహిరంగంగా ప్రజలను కోరలేదా? అయినా ఈరోజు వరకు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదంటే అర్ధం ఏమిటి?’ అని ఆమె ప్రశ్నించారు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోనివి అంటున్న చంద్రబాబు తన చుట్టూ కేంద్రం కల్పించిన జడ్ కేటగిరీ భద్రతను పంపేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment