రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ :వేసవి నేపథ్యంలో ఇటీవల కాలంలో చోరీలు ఎక్కువయ్యూయని, దీనిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ ప్రకటించారు. రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామని చెప్పారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో విజయనగరం సబ్‌డివిజన్ పరిధిలో నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి సర్కిల్ పరిధిలో నేరాలను నియంత్రించేందుకు, ఇప్పటివరకు జరిగిన చోరీల్లో అపహరణకు గురైన ఆస్తిని రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా స్పెషల్ టీంలను నియమించి అనుమానిత వ్యక్తులు, పాతనేరస్తులపై నిఘా ఉంచాలని చెప్పారు. పట్టణ, గ్రామ శివారు ప్రాంతాల్లో దొంగతనాల నివారణకు మొబైల్ టీంలను నియమించాలని, రహస్య గస్తీని ఏర్పాటు చేయాలని తెలిపారు.
ప్రజలకు అవగాహన కార్యకమాలను నిర్వహించడం ద్వారా నేరాలను నియంత్రించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వాహనదారులు డ్రైవింగ్ చేసే సమయంలో రహదారి నిబంధనలు పాటించేటట్లు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాలు పరిమితమైన వేగంతో వెళ్లేటట్లు చూడాలన్నారు. ముఖ్యమైన కూడళ్లలో వాహన తనిఖీలు, నాకాబందీలు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళికల ద్వారా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గత మాసంలో నమోదైన కేసులు, దర్యాప్తు దశలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, ఒకటో పట్టణ సీఐ కె.రామారావు, రెండో పట్టణ సీఐ పి.ముత్యాలనాయుడు, ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్, సీఐలు బి.లలిత, ఎ.ఎస్.చక్రవర్తి, లక్ష్మణమూర్తి, ఇ.నర్సింహమూర్తి, వై.వి.శేషు, కుమారస్వామి, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.