హైదరాబాద్‌ స్టార్‌ హోటల్‌లో గూడుపుఠాణి! | Nimmagadda Ramesh Meeting Sujana Choudhary And Kamineni Srinivas in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ స్టార్‌ హోటల్‌లో గూడుపుఠాణి!

Published Wed, Jun 24 2020 2:34 AM | Last Updated on Wed, Jun 24 2020 2:40 PM

Nimmagadda Ramesh Meeting Sujana Choudhary And Kamineni Srinivas in Hyderabad - Sakshi

అది హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌.. ఉదయం 10.47 గంటలు.. 
టక్‌ చేసుకుని ఫోన్‌లో మాట్లాడుతూ వేగంగా నడుస్తున్న ఓ వ్యక్తి అక్కడకు చేరుకోగానే స్వాగతం పలికి థర్మల్‌ స్క్రీనింగ్‌తో టెంపరేచర్‌ పరిశీలించారు. అనంతరం ఆయన లిప్ట్‌ ఎక్కి 8వ అంతస్తులోని గదిలోకి వెళ్లారు. 
ఆ వెంటనే తెల్ల దుస్తులు ధరించిన మరొకరు నింపాదిగా చేతులను శానిటైజ్‌ చేసుకుని అదే విధంగా గదిలోకి చేరుకున్నారు. 
చివరిగా వచ్చిన మూడో వ్యక్తి మాత్రం 6వ అంతస్తు దాకా లిఫ్ట్‌ వాడినా అక్కడ్నుంచి నడుచుకుంటూ 8వ అంతస్తులోని గదిలోకి ప్రవేశించారు.
ఆ గదిలో.. ముగ్గురు మిత్రుల మధ్య గంటన్నర పాటు రహస్య మంతనాలు సాగాయి. అనంతరం ఒక్కొక్కరే అక్కడి నుంచి నిష్క్రమించారు...

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వ్యవహారానికి సంబంధించి కోర్టులో వివాదాలు కొనసాగుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు బీజేపీ నేతలు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రహస్యంగా కలిసిన దృశ్యాలు వెలుగులోకి రావడం పెను సంచలనం కలిగిస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈనెల 13వ తేదీన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు గుట్టుగా నిమ్మగడ్డతో సమావేశమయ్యారు. ఈ ముగ్గురు నేతల రహస్య సమావేశం దాదాపు గంటన్నరకుపైగా కొనసాగింది. ఈ దృశ్యాలు మంగళవారం పలు చానళ్లలో ప్రసారమయ్యాయి. టీడీపీ అగ్రనేత కూడా ‘ఫేస్‌టైమ్‌’ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. 

మిత్రుడనా... ఫిర్యాదుకా?
ఈ రహస్య భేటీపై మీడియాలో దుమారం రేగడంతో నిమ్మగడ్డ తమ కుటుంబానికి చిరకాల మిత్రుడని, ఇటీవల పరిణామాలు, విధి నిర్వహణకు సంబంధించిన విషయాలపై ఆయనతో చర్చించలేదని, కామినేనితో పార్టీ వ్యవహారాలపై మాట్లాడానని సుజనా పేర్కొనగా.. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకే నిమ్మగడ్డ సుజనాను కలసినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ప్రకటించడం గమనార్హం. ఎస్‌ఈసీ వివాదానికి సంబంధించి నిమ్మగడ్డ దాఖలు చేసిన కేసులో కామినేని శ్రీనివాస్‌ ఆయనకు అనుకూలంగా పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూ నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాసినట్లు వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ లేఖ టీడీపీ కార్యాలయంలోనే తయారైందనే ఆరోపణలున్నాయి. 

ఒకరి తరువాత ఒకరుగా గదిలోకి...
హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో ఈనెల 13వతేదీన ఉదయం 10.45 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య ముగ్గురు నేతలు ఒక్కొక్కరిగా చేరుకొని సుమారు గంటన్నర సేపు రహస్య మంతనాలు సాగించినట్టు ఆ వీడియో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. తొలుత రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హోటల్‌కు చేరుకోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే కామినేని శ్రీనివాసరావు, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌లు వేర్వేరుగా సుజనా గదిలోకి వెళ్లారు. సమావేశానికి ముందు ఈ ముగ్గురు నేతలకు ఓ వ్యక్తి హోటల్‌ ప్రవేశద్వారం వద్ద స్వాగతం పలికి గది వద్దకు తోడ్కొని వెళ్లారు. రహస్య మంతనాల అనంతరం వారంతా విడివిడిగా హోటల్‌ నుంచి వెళ్లిపోయారు. 

ఆన్‌లైన్‌లో పాల్గొన్న టీడీపీ అగ్రనేత?
రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగి వివాదంలో ఇరుక్కుపోయిన వ్యక్తితో బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాల ఎగవేత కేసును ఎదుర్కొంటూ టీడీపీ నుంచి ఫిరాయించి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన కామినేని గంటన్నరసేపు రహస్యంగా మంతనాలు సాగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీజేపీలో కొనసాగుతున్నా వీరిద్దరూ అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. మరోవైపు వైఎస్సార్‌ సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లుగా టీడీపీకి చెందిన అగ్రనేత కూడా ‘ఫేస్‌ టైమ్‌’ ద్వారా ఈ సమావేశంలో ఆన్‌లైన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. వీరంతా కలసి రహస్య మంతనాలు సాగించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర దాగి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

అడ్డుకుంటూ దురుద్దేశపూరితంగా...
రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేయడం, పలు సంక్షేమ పథకాలను అడ్డుకోవడంతో పాటు తనకు రక్షణ లేదంటూ శాంతి భద్రతలపై సందేహాలు రేకెత్తించేలా నిమ్మగడ్డ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానిక ఎన్నికలను వాయిదా వేసి టీడీపీకి అనుకూలంగా దురుద్దేశపూరితంగా వ్యవహరించినట్లు వైఎస్సార్‌ సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ప్రజాదరణను ఓర్వలేక కుతంత్రాలు..
రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది వ్యవధిలోనే 90 శాతం హామీలను అమలు చేసింది. కేవలం ఒకే ఒక్క ఏడాదిలో ప్రజలకు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూ.42 వేల కోట్లకుపైగా లబ్ధి చేకూర్చింది. ప్రభుత్వం అమలు చేయనున్న వివిధ పథకాలు, కార్యక్రమాల షెడ్యూల్‌ వివరాలను క్యాలెండర్‌తో సహా ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఇవన్నీ చూసి తట్టుకోలేని విపక్ష నేతలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు తెరవెనుక కుట్రలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజా సమావేశం జరిగినట్లు విశ్లేషిస్తున్నారు. 

భేటీతో పార్టీకి సంబంధం లేదన్న బీజేపీ
నిమ్మగడ్డతో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు భేటీ కావడంపై తమ పార్టీకి ఏ సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. అదంతా వారు వ్యక్తిగతంగా నిర్వహించుకున్న సమావేశమని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య నేత వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డతో సంప్రదింపులు జరపాలని పార్టీ ఎలాంటి సూచనలు చేయలేదని స్పష్టం చేశారు. 

లిఫ్ట్‌లో ఇద్దరు... నడుచుకుంటూ నిమ్మగడ్డ!

  • సుజనా చౌదరి 13వతేదీ ఉదయం 10.47 గంటలకు హోటల్‌లోని ఎంఎల్‌ అపార్ట్‌మెంట్‌ వైపు నుంచి ఒంటరిగా ప్రవేశించారు. అక్కడికి సమీపంలోని లిప్టు ద్వారా హోటల్‌ 8వ ఫ్లోర్‌కు చేరుకొని కారిడార్‌లో నడుచుకుంటూ 10.48 గంటలకు మంతనాల కోసం ముందుగా బుక్‌ చేసుకున్న గదిలోకి వెళ్లారు.
  • కామినేని శ్రీనివాసరావు ఉదయం 11.23 గంటలకు హోటల్‌లోకి సుజనా ప్రవేశించిన దారి నుంచే వెళ్లారు. 
  • మంతనాలకు ముందు ముగ్గురు నేతలకు హోటల్‌ వద్ద స్వాగతం పలికిన వ్యక్తితో కలిసి కామినేని లిప్టు ద్వారా 8వ అంతస్తుకు చేరుకుని కారిడార్‌లో నడుచుకుంటూ 11.26 గంటలకు సుజనా గది వద్దకు చేరుకున్నారు.
  • నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాత్రం ఆ దారిలో కాకుండా హోటల్‌ మెయిన్‌ ఎంట్రన్స్‌ ద్వారా ప్రవేశించి గ్రౌండ్‌ ఫ్లోరు నుంచి లిప్టులో 11.45 గంటలకు హోటల్‌ 6వ అంతస్తుకు చేరుకుని ఎల్‌ షేప్‌ కారిడార్లలో నడుచుకుంటూ 8వ అంతస్తుకు వెళ్లారు.
  • స్వాగతం పలికిన వ్యక్తి వెంట రాగా 11.48 గంటలకు సుజనా రూంకు చేరుకున్నారు. 
  • సుమారు గంటన్నర పాటు సమావేశం తరువాత ముగ్గురు నేతలు భేటీ ముగించుకొని తొలుత మధ్యాహ్నం 1.03 గంటలకు కామినేని గది నుంచి బయటకు వచ్చారు.
  • 1.13 నిమిషాలకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆ గది నుంచి వెలుపలకు రాగా ఆఖరున 1.32 గంటలకు సుజనా చౌదరి ఆ గది నుంచి బయటకు వచ్చారు.  

రాజ్యాంగ పదవి స్థాయిని దిగజార్చారు
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి హుందాగా ఉండాలి. ఇతరులకు ఆదర్శప్రాయంగా మెలగాలి. ఎన్నికల కమిషనర్‌ వ్యవహారం న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు, రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి రాజకీయ నాయకులను కలవడం ఏంటి?! ఆ పోస్టు స్థాయిని దిగజార్చినట్లయింది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు, న్యాయమూర్తులతో సహా ఎవరూ కూడా వారి పరిధి, నియమావళిని అతిక్రమించకూడదు. వీడియోను చూస్తే నిమ్మగడ్డ రమేష్‌ రాజకీయ నేతలతో సమావేశం అయినట్లు కనిపిస్తోంది. ఏం మాట్లాడలేదన్నా ఎవరు నమ్ముతారు? కోవిడ్‌ వల్ల హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి పనిచేస్తానని నిమ్మగడ్డ అప్పట్లో ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉండి ఆయన చేస్తున్న పనులు ఇవేనా!? – సర్వా సత్యనారాయణ ప్రసాద్, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది

ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి
రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు మచ్చలేకుండా ఉండాలి. పక్షపాత ధోరణితో ఉండకూడదు.. ఉన్నట్లు అనిపించకూడదు. రాజకీయంగా ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కానీ, నిమ్మగడ్డ రమేష్‌ కలిసింది ఎవరిని? వాళ్లేమీ బీజేపీలో పుట్టి పెరిగిన నేతలు కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలున్న వాళ్లూ కాదు. టీడీపీ నుంచి వెళ్లి బీజేపీలో చేరిన వ్యక్తి ఒకరు.. టీడీపీ సర్కారులో మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరొకరు. కలిసిన వ్యక్తేమో టీడీపీ హయాంలో నియమితులైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో కలుసుకున్నారంటే ఏం అనుకోవాలి? దీనిపై వాళ్లు ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా ప్రయోజనంలేదు. ఈ ముగ్గురి కలయికపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. – చిత్తర్వు నాగేశ్వరరావు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది 

ఈయన నిమ్మగడ్డ రమేశ్‌

నిమ్మగడ్డ రమేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. ‘రాజ్యాంగ బద్ధమైన’ పదవిలో ఉంటూ ముఖ్యమంత్రిపై నిందలు మోపుతూ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలతో పదవిని కోల్పోయి కోర్టుకెక్కారు. దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లను ఈయన తరఫున వాదించడానికి నియమించారు. ఎవరు నియమించారన్నది జగమెరిగిన సత్యం.

ఇతను సుజనా చౌదరి 

చంద్రబాబు నమ్మిన బంటుగా సుజనా చౌదరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గత ఏడాది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన మరుక్షణమే చంద్రబాబు సలహా మేరకు బీజేపీలో చేరారు. చంద్రబాబు తరఫున పనులు చక్కబెడుతూ లాబీయింగ్‌ చేస్తున్నారు. ఈయన గారు 7 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు తరఫున ‘లెక్కలు’ చూసే వాళ్లలో ఈయన ముఖ్యుడని చెబుతుంటారు. 

ఇదిగో కామినేని శ్రీనివాస్‌ 

టీడీపీ అధినేత చంద్రబాబుకు కామినేని శ్రీనివాస్‌ బాగా సన్నిహితుడు. చంద్రబాబు సూచన మేరకే 2014 ఎన్నికలప్పుడు బీజేపీలో చేరి టికెట్‌ తెచ్చుకుని పోటీ చేశారు. చంద్రబాబు ఇతన్ని మంత్రిగా కూడా తీసుకున్నారు. పేరుకు బీజేపీ అయినప్పటికీ చంద్రబాబు తరఫునే పని చేస్తుంటారు. ఇటీవల ఆయన సూచన మేరకే నిమ్మగడ్డ రమేశ్‌ తరఫున కోర్టులో పిటిషన్‌ వేశారు. 

నిమ్మగడ్డపై దాఖలైన ఈ వ్యాజ్యాన్ని విచారిస్తాం 
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నియామకం రాష్ట్ర మంత్రి మండలి సిఫారసు మేరకు జరగడానికి వీల్లేదని, ఎస్‌ఈసీ నియామకం పూర్తిగా రాష్ట్ర గవర్నర్‌ విచక్షణ మేరకే జరగాలంటూ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో అసలు ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ నియామకమే చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ పిటిషన్‌ దాఖలుపై రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలతో ధర్మాసనం విభేదించింది. ఈ పిటిషన్‌పై తాము విచారణ జరుపుతామంటూ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత కుమారిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. నిమ్మగడ్డ రమేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ 2016లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 11ను కొట్టేయాలని గుంటూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన సంగం శ్రీకాంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంత్రిమండలి సిఫారసు మేరకు ఎన్నికల కమిషనర్‌ నియామకం కావడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పినందున, ఏ అధికారంతో ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్నారో నిమ్మగడ్డ రమేశ్‌ను వివరణ కోరాలంటూ కో వారెంట్‌ రూపంలో శ్రీకాంత్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ నెల మొదటి వారంలోనే ఈ పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ హైకోర్టు రిజిస్ట్రీ ఈ వ్యాజ్యం దాఖలుపై పలు అభ్యంతరాలు లేవనెత్తి నంబర్‌ కేటాయించలేదు. పిటిషన్‌ విచారణార్హతపై అభ్యంతరం లేవనెత్తే అధికారం రిజిస్ట్రీకి లేదంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది శశిభూషణ్‌రావు రిజిస్ట్రీ వర్గాలకు ఘాటు లేఖ పంపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement