మహిళలపై హోం మంత్రి రాజప్ప చిందులు
► మాట వినకుంటే పింఛన్లు పీకేస్తా
► ఆర్‌బీపట్నంలో మహిళలకు హోం మంత్రి వార్నింగ్
ఆర్‌బీపట్నం (పెద్దాపురం): మేం చెప్పిందే వేదం.. మేం చేసిందే అభివృద్ధి.. ఏమనుకుంటున్నారో... వేషాలు వేస్తే మహిళలని చూడం. అవసరమైతే పింఛన్లు పీకేస్తాం. ఇవి ఎవరో తెలుగు తమ్ముడు అన్నమాటలు కావు.. సాక్షాత్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఊగిపోతూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైనమిది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో మంగళవారం అభివృద్ధి కార్యక్రమాల పేరుతో రాత్రి వేళ గ్రామంలోకి వచ్చిన రాజప్పకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేవారు.
తమ ఊరు అభివృద్ధిపై దృష్టి సారించాలని మహిళలు చెప్పే లోపే ఆయన ఆగ్రహంతో ఊగిసలాడిపోయారు. మహిళలని చూడకుండానే ఏదో పార్టీల అండ చూసుకుని ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. మేం చేసే అభివృద్ధి పనులకే వత్తాసు పలకాలంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవసరమైతే మీ పింఛన్లు పీకేస్తా.. అభివృద్ధికి సహకరించాలే తప్ప వేషాలు వేస్తే ఊరుకునేది లేదంటూ ఆగ్రహానికి లోనయ్యారు. దీనిని బట్టి అర్థమౌతోంది మంత్రి రాజప్పకు అభివృద్ధిపై ఎంత ఆసక్తి ఉందో. అంతేగాకుండా ఆ గ్రామానికి అనుకున్న సమయానికి వస్తే మహిళలు ప్రశ్నలు అడుగుతారనే ఆలస్యంగా వచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.