
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి ,ఏలూరు: నాపై అవినీతి ఆరోపణలు చేస్తారా? సాక్షి పత్రిక, సాక్షి చానల్ నాకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే వాటిపై చర్యలు తీసుకుంటానంటూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బెదిరింపులకు దిగారు. తాను ఎక్కడా కాంట్రాక్టర్‌ను డబ్బులు ఇవ్వమని బెదిరించలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఏలూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ అనుకూల మీడియాను మాత్రమే పిలిచారు. మొదట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి విలేకరుల సమావేశం ఉందంటూ సాక్షి పత్రిక, చానల్‌కు ఫోన్లు చేశారు. అయితే కొద్దిసేపటికే పార్టీ కార్యాలయ కార్యదర్శి ‘సాక్షి’కి మాత్రమే ఫోన్ చేసి విలేకరుల సమావేశం రద్దు అయ్యిందని చెప్పారు. కానీ యథాతథంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. సాక్షి విలేకరులు వస్తే వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ‘సాక్షి’కి తప్పుడు సమాచారం ఇచ్చారు.
పొంతన లేని మాటలు : ఈ సమావేశంలో కూడాఎమ్మెల్యే చెప్పిన విషయాలకు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి. దమ్మయ్యపత్తి డ్రెయిన్ పనులు ఆగిపోవడం వల్ల గోతులు పడి ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు పిలిస్తే కాంట్రాక్టర్, డీఈ వెళ్లారని ఎమ్మెల్యే చెబుతున్నారు. అసలు అభివృద్ధి పనులపై పోలీసులు పంచాయితీ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఫిర్యాదు వస్తే అసలు కాంట్రాక్టర్‌ను కాకుండా సబ్‌కాంట్రాక్టర్‌ను ఎందుకు పిలవాల్సి వచ్చింది? పనులు పూర్తి చేయాలని నోటీసులు ఇచ్చామని, పనులు పూర్తి కాకపోతే వేరే కాంట్రాక్టర్‌తో పనులు చేయిస్తామని ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరావు వివరణ ఇచ్చాక కూడా సబ్‌కాంట్రాక్టర్‌ను కనీసం బాత్‌రూమ్‌కు కూడా వెళ్లనీయకుండా స్టేషన్‌లో నిర్బంధించాల్సిన అవసరం పాలకొల్లు సీఐకి ఎందుకు వచ్చింది? ఎమ్మెల్యే నుంచి ఆదేశాలు వచ్చే వరకూ నిన్ను పంపడం కుదరదని సీఐ చెప్పడం వెనుక ఎవరున్నారు? మాట్లాడటానికి పిలిచిన వ్యక్తిని రాత్రి 12 గంటల వరకూ ఎందుకు ఉంచాల్సి వచ్చింది? విషయం తెలుసుకుని వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు గట్టిగా నిలదీసిన తర్వాతే ఎందుకు పంపారు? ఫిర్యాదు నిజమైతే ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? అసలు కాంట్రాక్టు గడువు పూర్తి కాకుండా ఎలా చర్యలు తీసుకుంటారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఈ విషయాలపై ప్రశ్నించినందుకే కాంట్రాక్టర్ వైఎస్సార్ సీపీ రిమోట్ కంట్రోల్‌లో ఉన్నారంటూ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయంపై కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై ‘సాక్షి’ స్పందించడం తప్పెలా అవుతుందో ఎమ్మెల్యేనే చెప్పాలి.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
ఈ–టెండర్ వేసిన పనులకు కమీషన్లు ఎలా అడుగుతామని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ కాంట్రాక్టు నిబంధనల్లో చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు పెట్టి డబ్బులు తీసుకోవచ్చన్న నిబంధనను ఎందుకు ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు? పనులు ఆలస్యంగా చేస్తున్నారన్న కారణంతో చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా ఆపాల్సిన అవసరం ఏమిటీ? ఎమ్మెల్యేని కలిస్తేగాని బిల్లులు రావని ఇరిగేషన్ అధికారులు ఎందుకు చెప్పారు? డిసెంబర్‌లో పెట్టిన బిల్లులు ఇప్పటి వరకూ రాకపోతే కాంట్రాక్టర్ పనులు ఎలా చేస్తాడు? చేసిన పనులకే డబ్బులు ఇవ్వకపోతే మొత్తం పనులు చేశాక డబ్బులు వస్తాయన్న నమ్మకం కాంట్రాక్టర్‌కు ఎలా ఉంటుంది? తనకు వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో ఇంకో రూ.86 లక్షల పెట్టుబడి పెట్టేందుకు కాంట్రాక్టర్ ఎలా సాహసిస్తాడు? తాను అప్పుల పాలు అయ్యానని బిల్లులు చెల్లిస్తే మిగిలిన పనులు చేస్తానని సబ్‌కాంట్రాక్టర్ పృథ్వీ ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ, మీ కార్యాలయం చుట్టూ తిరిగినది వాస్తవం కాదా? అర్ధరాత్రి మీరు పృథ్వీ తండ్రికి ఫోన్ చేసి బెదిరించింది నిజం కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సాక్షిపై చర్యలు తీసుకుంటానని బెదిరిస్తే ఎలా?
రంగంలోకి టీడీపీ నేతలు
ఈ వివాదంతో పార్టీ పరువు పోతుం దన్న ఉద్దేశంతో తెలుగుదేశం నాయకులు రంగంలోకి దిగారు. ఫిర్యాదు చేసిన సబ్ కాంట్రాక్టర్‌ను బుజ్జగించే పనిలో పడ్డారు. మరోవైపు ఈ దమ్మయ్యపత్తికోడు పనుల కాంట్రాక్టర్ మాధవరావును తెలుగుదేశం నాయకులు ఇరిగేషన్ కార్యాలయానికి పిలిపించి మీడియాతో మాట్లాడించారు. అయితే అతను కూడా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, పనులు 50 శాతం వరకూ పూర్తి అయ్యాయని చెప్పారు. మిగిలిన పనులు కూడా సకాలంలో చేయిస్తానని ఆయన చెప్పారు. అయితే ఎమ్మెల్యే తనను డబ్బులు ఇమ్మని డిమాండ్ చేయలేదంటూ కాంట్రాక్టర్‌తో చెప్పించే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment