తోటి చిన్నారులతో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసు ఆ బాలుడిది. చక్కగా స్కూల్‌కి వెళ్లి చదువుకోవాల్సిన సమయంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నాడు. బాధ కలిగినప్పుడు ఏడవడం తప్ప.. తనకున్న జబ్బుఏంటో కూడా తెలియదు.
నెల్లూరు, కలిగిరి: మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ కందులవారిపాళెం గ్రామానికి చెందిన మార్తుల సుధాకర్‌రెడ్డి, అనూష దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు హసిక్ నందన్ కుమార్‌రెడ్డి (9) ఉన్నాడు. వీరు వ్యవసాయ కూలీగా చేస్తుంటారు. నందన్ పుట్టుకతోనే దివ్యాంగుడు. ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయింది. మరో కిడ్నీలో రాళ్లు ఉండి ఇన్ఫెక్షన్ చేరింది. ప్రత్యేక పైపు ఏర్పాటు చేస్తేనే మూత్రం వస్తుంది. వెన్నునొప్పి ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. నందన్‌కు 6 నెలల వయసు నుంచే హైదరాబాద్, చెన్నై, తిరుపతి, గుంటూరుల్లోని పలు వైద్యశాలల్లో చికిత్స చేయించారు. ఇప్పటివరకు సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. అయితే పరిస్థితిలో మార్పురాలేదు.
తల్లిదండ్రులతో నందన్
పింఛన్ ఇవ్వాలంటూ..
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నందన్ పరిస్థితి చూసి ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి చలించిపోయారు. స్వయంగా కలెక్టర్ వద్దకు ఆ బాలుడిని, అతని తల్లిదండ్రులను తీసుకువెళ్లి కలిశారు. పేద కుటుంబానికి చెందిన నందన్‌కు డయాలసిస్ చేయించేందుకు పింఛన్ మంజూరు చేయించాలని సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే సూచనల మేరకు కలెక్టర్ నందన్ వైద్యానికి కొంత నిధులు అందించారు. డయాలసిస్ పింఛన్ అందించడానికి సహకరిస్తామని తెలిపారు. ప్రస్తుతం నందన్‌కు దివ్యాంగుల పింఛన్ అందుతోంది.
అప్పులు చేసి..
తలకు మించిన భారమైనా సుధాకర్‌రెడ్డి, అనూష అప్పులు చేసి కొడుక్కి వైద్యం చేయిస్తున్నారు. మూత్రం పోసుకోవడానికి ఇంటి వద్దే తల్లిదండ్రులు బ్యాగ్‌లు మారుస్తున్నారు. కిడ్నీ మార్చాలంటే ముందు మూత్ర సంబంధిత సమస్యను పరిష్కరించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వెన్నుపూస సమస్య ఉండటంతో ఎక్కువసేపు కూర్చున్నా, పడుకున్నా నొప్పులతో బాధపడుతున్నాడు. నందన్ వైద్యానికి సుమారు రూ.20 నుంచి రూ.25 లక్షల వరకు అవుతుందని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. కూలి పనులు చేసుకునే నందన్ తల్లిదండ్రులు అంత ఖర్చుపెట్టి వైద్యం చేయించే స్తోమత లేక ఒక్కగానొక్క కుమారుడి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమ బిడ్డ వైద్యానికి సహకరించాలని కోరుతున్నారు.
సాయం కోరుతాం
జగనన్న పాదయాత్ర సమయంలోమా గ్రామానికి వచ్చినప్పుడు కలిసి మా పరిస్థితి వివరించాం. త్వరలో ఆయన్ని కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించి సాయం కోరుతాం. – మార్తుల అనూష,నందన్ తల్లి
నందన్ తల్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు
పేరు: మార్తుల అనూష
బ్యాంక్: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సిద్ధనకొండూరు
అకౌంట్ నంబర్: 91073257658
ఐఎఫ్‌ఎస్ కోడ్: APGB0004016
సెల్ నంబర్: 94932 06631
Comments
Please login to add a commentAdd a comment