చిరంజీవి గ్రామంలోనూ అదే పరిస్థితి
నరసాపురం :మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నరసాపురం నియోజకవర్గంలో మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. నరసాపురం మండలంలోని తూర్పుతాళ్లు, పెదమైవానిలంక గ్రామాలను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్నారు. పెదమైవాని లంకలో రూ.4.50 కోట్ల నాబార్డు నిధులతో 70 తూముల వంతెన స్థానే మూడు వంతెనలు నిర్మిస్తున్నారు. ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
అప్రోచ్ రోడ్ల నిర్మాణాలకు ఇంకా అనుమతులు రాలేదు. ఇదే గ్రామంలో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న డిజిటల్ కమ్యూనిటీ హాల్ పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. 10 సీసీ రోడ్లు, 22 బయోడైజిస్టడ్ మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 1,100 సోలార్ దీపాలను అందించారు. తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక గ్రామాల్లో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తామని సీతారామన్ హామీ ఇచ్చారు. ఆ ప్రతిపాదన కొలిక్కి రాలేదు. ఉప్పు పంటకు గుర్తింపు తీసుకొస్తామని, పండించిన ఉప్పును నిల్వ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని ఇచ్చిన హామీలు ఇంకా గడప దాటలేదు. ప్రధానంగా సముద్రం అలల తీవ్రతకు గ్రామంలోని తీరం కోతకు గురవుతోంది. నివారణకు కనీస చర్యలు కూడా తీసుకోలేదు.
తూర్పుతాళ్లు గ్రామానికి ఇప్పటివరకు 10 సీసీ రోడ్లు మంజూరు కాగా, మూడు మాత్రమే పూర్తయ్యాయి. పదెకరాల విస్తీర్ణంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించే పనులు ముందుకు సాగడంలేదు. ఈ గ్రామంలో 26 బయోడైజిస్టర్ లెట్రిన్లు నిర్మించి, 1,600 సోలార్ దీపాలు అందించారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వాటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. పంచాయతీ భవనం నిర్మాణానికి ఎవరూ పూనుకోవడం లేదు. డంపింగ్ యార్డు కూడా ఇక్కడ ఓ ప్రధాన సమస్యగా తయారైంది.
పనులు కొనసాగుతాయా!
ఇదిలావుండగా, నిర్మలా సీతారామన్ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఇటీవల ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో దత్తత గ్రామాల్లో పెండింగ్ పనులు పూర్తవుతాయో లేదోననే సందేహం అక్కడి ప్రజలను వెన్నాడుతోంది.
‘చిరు’ గ్రామంలోనూ అదే పరిస్థితి
మెగాస్టార్ చిరంజీవి మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ 5.50 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు కేవలం రూ.1.10 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గ్రామంలో రూ.3 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్ శాఖలకు సంబంధించిన పనులు ప్రారంభం కావాల్సి ఉంది.