‘ఆధారు’ణాన్ని ఆపండి
- సుప్రీం ఆదేశాలతో ఇప్పుడైనా లబ్ధిదారులుగా గుర్తిస్తారా?
- రుణమాఫీకి ఆధార్ లేదన్న సాకుతో అనర్హులైన 4 వేల మంది రైతులు
అమలాపురం టౌన్ : ఆధార్ కార్డు లేదని.. రుణమాఫీ విషయంలో జిల్లాలో ఎందరో రైతులు ఆ లబ్ధికి అర్హులైనప్పటికీ అనర్హులుగానే మిగిలిపోయారు. ప్రభుత్వం అందరికీ ఆధార్ కార్డులు జారీ చేసినా కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి కార్డులు రాలేదు. ఆధార్ పుట్టించుకునేందుకు తహశీల్దారు, ఆర్డీఓ కార్యాలయాలు చుట్టూ తిరిగి కొందరు సంపాదించుకున్నా జిల్లాలో ఇంకా అనేకమందికి ఆధార్ కార్డు అందని పరిస్థితి ఉంది. అప్పట్లో తనకు ఆధార్ కార్డు లేకపోవటం వల్ల రుణమాఫీ ఫలం అందడం లేదని ఎందరో రైతులు నిరాశ చెందారు. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలపై దయ చూపలేదు.
భూమి ఉంది.. పంటలు కనిపిస్తున్నాయి.. ఆ రైతు పేర అప్పు అధికారికంగా ఉంది. ఆధార్ కార్డు లేదన్న సాకుతో మాఫీ వర్తించకుండా చేయటం భావ్యం కాదన్న సానుకూల కోణంలో ప్రభుత్వం ఆలోచించలేకపోయింది. ఫలితంగా జిల్లాలో దాదాపు నాలుగు వేల మంది రైతులు ఆధార్ కార్డు ఆధారం చూపించలేక రుణమాఫీకి అనర్హులయ్యారు. జిల్లాలోని 300 వ్యవసాయ సహకార సంఘాల్లో ఒక్కో సంఘంలో కనీసం 10 మంది రైతులు ఆధార్ కార్డు లేదన్న సాకుతో రుణమాఫీకి దూరమయ్యారు.
ఆధార్ కార్డుల బాధిత రైతులు కాళ్లు అరిగేలా ఏదోలా రుణమాఫీ వర్తిస్తుందోమోనని సహకార సంఘాల చుట్టూ తిరిగారు. వాణిజ్య బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతుల్లో ఆధార్ లేని వారు కూడా దాదాపు వెయ్యిమంది నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఆధార్ లేకపోతే తామేమీ చేయలేమని సహకార సంఘాలు, బ్యాంకులు చేతులెత్తేయటంతో వారి ఆశల అడియాశలయ్యాయి. ప్రభుత్వ నిబంధన అలా ఉంది... ఇందులో మేమేమీ చేయలేమని వారు తమ నిస్సహాయతను వ్యక్తం చేసేవారు.
సుప్రీం ఆదేశాలు అప్పుడే వచ్చి ఉంటే
ఆధార్ అన్నింటికి తప్పని సరికాదని, ప్రభుత్వ సంక్షేమ పధకాలు తదితర విషయాలకు అధార్‌ను లింకు పెట్టవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల సమాచారం తెలిశాక జిల్లాలో రుణమాఫీ పరంగా ఆధార్‌కార్డు రాక, లేక అప్పట్లో అర్హత ఉండి కూడా ఆధార్ ఆధారం లేదన్న కారణంతో అనర్హులైన రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అప్పుడు ఆధార్ నిబంధన అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అవసరం లేదంటున్న క్రమంలో తాము ఇప్పుడైనా అర్హులవుతామా అని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు అప్పుడే ఇచ్చి ఉంటే రుణమాఫీతో కొంత లబ్ధి పొంది కొంత అప్పుల భారం తగ్గేదని అప్పటి అనర్హత రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టు ఆదేశాల నేపధ్యంలో తమను ఇప్పుడైనా అర్హులుగా గుర్తించాలని అభ్యర్ధిస్తున్నారు.
జిల్లా ప్రజల్లో ఊరట
ఆధార్ కార్డు తప్పనిసరి అంటూ ప్రతి ప్రభుత్వ లబ్ధికి దానిని లింకు పెట్టిన వైనంపై జిల్లాలోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు ఏదో సందర్భంలో ఇబ్బంది పడ్డవారే. చివరకు ఇటీవల రైతు బజార్లలో రాయితీపై సరఫరా చేస్తున్న ఉల్లిపాయలకు కూడా ఆధార్ కార్డు తప్పని చేయటాన్ని ప్రజలు ఇదేం ఆధార్ గోలరా బాబూ అంటూ అసహనం వ్యక్తం చేశారు. అన్నింటికీ ఆధార్ ముడిపెట్టవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేయటంతో జిల్లా ప్రజకు ఊరట కలిగింది.