ఏలూరు బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు
ఆర్టీసీ ప్రయాణం శుభప్రదం.. సుఖవంతంఇదీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నినాదం. కానీఆర్టీసీ బస్టాండ్లలోకి అడుగుపెడితే మాత్రం ప్రయాణికులకు నరకం తప్పట్లేదు. వసతులు సరిగా ఉండవు. కూర్చునేందుకు బల్లలు సరిగా ఉండవు. ఫ్యాన్లు ఉన్నా.. తిరగవు. మంచినీటి సదుపాయం అసలే కానరాదు. పారిశుధ్యం అధ్వానం. పైపెచ్చు బస్టాండ్లలో దుకాణాల్లో భారీగా దోపిడీ. అయినా అధికారులు పట్టించుకోరు. ఫలితంగా అడుగుపెడితే బతుకు బస్టాండే అంటూ ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రయాణికులను ఆకర్షించలేక రోజురోజుకూ నష్టాలు పెరిగి దిగజారిపోతున్నా.. ఆర్టీసీని బాగు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదు. దీనికితోడు బస్టాండ్లలో దోపిడీ ప్రజలను ఆర్టీసీకి దూరం చేస్తోంది. దీనివల్ల సంస్థ మనుగడే ప్రశ్నార్థంగా మారే ప్రమాదం పొంచి ఉంది.
పశ్చిమ రీజియన్ ఆర్టీసీ ముఖచిత్రం..
ఆర్టీసీ పశ్చిమ రీజియన్‌లో ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లి గూడెం, భీమవరం, కొవ్వూరు, నరసాపురం, తణుకు, నిడదవోలుల్లో డిపోలు నిర్వహిస్తోంది. ఆయా డిపోల పరిధిలో మొత్తం 31 బస్ స్టేషన్లు ఉన్నాయి. అన్ని డిపోల్లోనూ కలిపి ప్రతి నిత్యం 621 బస్సులను తిప్పుతోంది. ఈ మేరకు జిల్లాలోని 48 మండలాల్లోని 929 గ్రామాలకు 862 గ్రామాల్లో ఆర్టీసీ చక్రం నిత్యం అడుగుపెడుతోంది. ఆయా బస్సులు రోజుకు సుమారు 1.50 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ, సుమారు 1.20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఈ నేపథ్యంలో కిలో మీటరుకు రూ. 27.63 ఆదాయం తెచ్చుకుంటోంది. గణాంకాలను బట్టి చూస్తే పశ్చిమ రీజియన్‌లో ఆర్టీసీకి ప్రయాణికుల ఆదరణ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది గానీ, వాస్తవానికి అంత మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తున్నా ఆ సంస్థ మాత్రం నష్టాల్లోనే తిరుగుతోంది. ఆర్టీసీబస్టాండ్లకు వచ్చే ప్రయాణికులను దోచేయడమే అధికారులు పరమావధిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఏలూరు కొత్త బస్టాండులో పార్కింగ్ సదుపాయం లేదు. ఎవరైనా తమ బంధువులనో, మిత్రులనో బస్సు ఎక్కించడానికి ద్విచక్ర వాహనమో, కారో వేసుకొస్తే అది ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియదు. బస్టాండులో అందుకు సంబంధించిన బోర్డులు ఎక్కడా కనిపించవు. పోనీ ఎక్కడైనా ఖాళీ ప్రదేశముందని అక్కడ పెట్టి తమ వాళ్ళని బస్సు ఎక్కించేందుకు వెళ్ళి వచ్చే సరికి వాహనం దగ్గర ఒక సెక్యూరిటీ ఉద్యోగి దర్శనమిస్తాడు. మీ వాహనం రాంగ్ పార్కింగ్‌లో పెట్టారు ఫైన్ పడింది అంటాడు. తెలియక పెట్టాం బాబూ ఈసారికి ఒదిలేయమంటే కుదరదంటాడు. సరే తప్పేదేముంది ఎంత కట్టాలి అంటే మెట్రోపాలిటన్ సిటీలో కూడా లేనంతగా ఏకంగా రూ. 200 కట్టాలంటాడు. దీంతో హతాశులవడం వారి వంతవుతోంది. ఎక్కడైనా రాంగ్ పార్కింగ్‌కి మహా అయితే పదో పరకో అపరాధ రుసుము ఉంటుంది కానీ ఏకంగా రూ.200 అంటే ఎవరికైనా కష్టమే. అయితే రోజుకు రూ.5 వేలు సంపాదించడమే అక్కడి సెక్యూరిటీ ఉద్యోగుల లక్ష్యమట మరి.
మూత్ర విసర్జనకూ రసుం చెల్లించాలి..
ఏలూరు బస్టాండ్‌లో బస్సుల కోసం వేచిఉండాల్సిన సమయంలో ప్రయాణికులకు లఘుశంక కలిగితే మూత్ర విసర్జనకు ఎక్కడా చోటు కనిపించదు. ఉచిత మూత్ర శాల ఒక మూల ఉంటుంది. అందులోనూ మహిళల గదికి ఎప్పుడు చూసినా తాళం వేసే ఉంటుంది. అలాగే బస్టాండులో రెండు ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఉన్నాయి. వాటిలో ఒక మరుగుదొడ్డిలో మూత్ర విసర్జనకు రుసుం వసూలు చేయకూడదు కానీ అక్కడ ఒక వ్యక్తి కూర్చుని రూ.5 చెల్లిస్తే గానీ లోనికి పోనీయడు. అక్కడ మూత్ర విసర్జనకు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదని బోర్డు ఏర్పాటు చేయాల్సిన అధికారులు అటువంటి చర్యలు ఎప్పుడూ తీసుకోరు. ఎందుకంటే అలా సంపాదించే సొమ్ములో వాళ్ళకి వాటా ఎవరిస్తారు? ఈ సమస్య అన్ని బస్టాండ్లలోనూ దర్శనమిస్తోంది.
దుకాణాల వద్ద ధరల పట్టికలే కనిపించవు..
ఇక జిల్లావ్యాప్తంగా బస్టాండుల్లో ఏర్పాటు చేసే దుకాణాల వద్ద కచ్చితంగా ధరల పట్టికలు ఏర్పాటు చేయాలి. కానీ ఒక్క దుకాణం వద్ద కూడా బోర్డులు కనిపించవు. అక్కడి వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తుంటారు. బహిరంగ మార్కెట్లో రూ.20 ఉండే మంచినీళ్ల బాటిల్ ఇక్కడ రూ.25 ఉంటుంది. అది కూడా ప్రయాణికుడికి కావాల్సిన కంపెనీది దొరకదు. స్థానికంగా తయారయ్యే నాసిరకం బాటిళ్లే ప్రయాణికులకు దిక్కు. ఇతర తినుబండారాలు, శీతల పానీయాలదీ అదే దారి. రోజూ దుకాణదారులతో ప్రయాణికుల వాగ్యుద్ధాలు దర్శనమిస్తూనే ఉంటాయి. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే తమ దృష్టికే రాలేదంటారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటామంటారు. ఒక వేళ ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే అధికారులకు మామూళ్ళు ఇవ్వని దుకాణదారులనే లక్ష్యంగా చేసుకుని వారిపై కేసులు నమోదు చేసి రూ.1,000 నుంచి రూ.2 వేల వరకూ అపరాధ రుసుము వసూలు చేస్తారు.
అపారిశుద్ధ్యం
జిల్లాలోని అన్ని బస్టాండ్లలోనూ అపారిశుద్ధ్యం తాండవిస్తోంది. ఏలూరు కొత్త బస్టాండులోని కొన్ని ప్రాంతాలు అపరిశుభ్ర వాతావరణంలో దుర్గంధభరితంగా ఉండి ప్రయాణికులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. ఇక పాత బస్టాండులో కనీసం మంచి నీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన కుళాయిలు అపరిశుభ్ర వాతావరణంలో దర్శనమిస్తున్నాయి. అక్కడి సైకిల్ స్టాండ్ నిర్వాహకుడు వాహనాలకు నీడ కూడా కల్పించడం లేదు. దీంతో ప్రయాణికుల వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడిసిపోయే దుస్థితిలో ఉన్నాయి.
అధిక ధరలపై ఫిర్యాదులొస్తే చర్యలు
బస్టాండుల్లోని దుకాణాల్లో అధిక ధరలు వసూలు చేయకూడదు. అలాచేసిన వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. మరుగుదొడ్లలో మూత్ర విసన్జనకు రుసుం వసూలు చేయకూడదు. దీనిపై మా ఉద్యోగులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటారు. కాకపోతే అక్కడే కూర్చుని వచ్చి పోయే వారిని విచారించడం వారికి అసాధ్యం. ఏలూరు బస్టాండ్‌లో ప్రయాణికులను ఎక్కించడానికి వాహనాలపై వచ్చే వారికి ఉచిత పార్కింగ్‌కు స్థలాన్ని ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తున్నాం. – ఎ.వీరయ్య చౌదరి, రీజినల్ మేనేజర్ పశ్చిమ ఆర్టీసీ
Comments
Please login to add a commentAdd a comment