ఏజ్ బారాయే..కొలువు రాదాయే | no APPSC Recruitments, students worried | Sakshi
Sakshi News home page

ఏజ్ బారాయే..కొలువు రాదాయే

Published Mon, Dec 30 2013 1:55 AM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM

ఏజ్ బారాయే..కొలువు రాదాయే - Sakshi

ఏజ్ బారాయే..కొలువు రాదాయే

రేపటితో ముగిసిపోతున్న గడువు..లక్షలాది మంది నిరుద్యోగుల్లో నిరాశ
ఆర్భాటపు ప్రకటనలు తప్ప జాడ లేని నోటిఫికేషన్లు
ఒక్క రంగంలోనూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వని ఏపీపీఎస్సీ
డీఎస్సీల ద్వారా నియమించాల్సిన పోస్టులనూ పట్టించుకోని ప్రభుత్వం
వేలకు వేలు పోసి శిక్షణ తీసుకున్నా లాభం లేకుండా పోయిందని నిరుద్యోగుల ఆవేదన
చేసేది లేక వీఆర్వో పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్న పీజీ, బీటెక్ పట్టభద్రులు
 
సాక్షి, హైదరాబాద్:ఇదిగో గ్రూప్-1 ఉద్యోగాలు.. అదిగో టీచర్ కొలువులు.. అల్లదిగో పోలీసు జాబ్‌లు అంటూ నిరుద్యోగులను ఊరించిన రాష్ట్ర సర్కారు చివరికి వారి నోట్లో మట్టి కొట్టింది! వేల కొద్దీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ఆర్భాటపు ప్రకటనలతో లక్షలాది మందిలో ఆశలు రేపి వారి జీవితాలతో చెలగాటమాడింది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా.. ప్రకటనలు జారీ చేసిందే తప్ప వాటి భర్తీపై చేతులెత్తేసింది. ఒకటి కాదు రెండు కాదు.. 60 వేలకుపైగా పోస్టులు భర్తీ చేస్తామంటూ జీవోల సాక్షిగా చెప్పిన మాటలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. చివరికి వయోపరిమితి సడలింపు సైతం నీటి మూటే అయింది.
 
 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని నిరుద్యోగుల డిమాండ్ మేరకు 36 ఏళ్లకు పెంచినా ఈ రెండేళ్ల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ కాలేదు. ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగులు గరిష్ట వయోపరిమితిని దాటనున్నారు. రెండేళ్ల వయోపరిమితి సడలింపు 31-12-2013 వరకు జారీ అయ్యే నోటిఫికేషన్లకే వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. రేపటితో ఈ గడువు పూర్తవుతోంది. అంటే వయో పరిమితిని పెంచినా నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నమాట! ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన లు నమ్మి.. వయసు మీరుతున్న అభ్యర్థులెందరో కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు పోసి శిక్షణ తీసుకున్నారు. చివరి ప్రయత్నంలో అయినా ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కష్టపడ్డారు. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా రాకుండానే గడువు ముగిసిపోతుండడంతో వారంతా నిరాశలో మునిగిపోయారు. ఈ రెండేళ్ల వయసు సడలింపు ఇటీవల వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులకు రెవెన్యూ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌కు మాత్రమే వర్తించనుండడంతో.. పీజీలు చేసిన వారు సైతం దిక్కులేని పరిస్థితుల్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు.
 
 ఊరించి.. ఊరించి.. ఉసూరుమనిపించారు: వివిధ శాఖలతోపాటు ఏపీపీఎస్సీ ద్వారా పెద్దఎత్తున పోస్టులు భర్తీ చేస్తామని ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ మధ్యలో ప్రభుత్వం ఊరించింది. ఆర్థికశాఖ 60,841 పోస్టుల భర్తీకి అనుమతి తెలుపుతూ జీవోలు జారీ చేసింది. ఇది ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నవారిలో ఆశలు రేపింది. గరిష్ట వయోపరిమితిని సడలించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో 34 ఏళ్ల వయోపరిమితి 36 సంవత్సరాలకు పెంచుతూ 29-06-2013న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి జీవో 518 జారీ చేశారు. అందులో రెండేళ్ల వయోపరిమితి పెంపు 31-12-2013 నాటికి జారీ చేసే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టంచేశారు. కానీ ఈ రెండేళ్ల వ్యవధిలో ఎలాంటి నోటిఫికేషన్లు జారీ కాలేదు. ఈ గడువు మరొక్క రోజులో పూర్తి కానుంది. ఈ నెల 31లోగా అంటే.. మరో 24 గంటల్లో ఏపీపీఎస్సీ గానీ లేదా రిక్రూట్‌మెంట్ శాఖలు గానీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తే ఈ పెంపు వర్తిస్తుంది. లేదంటే  వయసు మీరిన లక్షలాది మంది కోసం ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. 2013లో ఖాళీ పోస్టులు నోటిఫై చే సి, వాటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ముందుగానే సంవత్సర క్యాలెండర్ విడుదల చేశారు. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ 13న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్ని మాథ్యూ జీవో 5691 జారీ చేశారు. అనంతరం ఆర్థిక శాఖ గ్రూప్-1, గ్రూప్-2, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, టెక్నికల్‌కు చెందిన 33,738 పోస్టుల భర్తీకి అనుమతి తెలుపుతూ 2013 జూన్‌లో 132 జారీ చేసింది.
 
 ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 11,250 పోస్టులు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 11,623 పోస్టులు, వివిధ శాఖల ద్వారా 10,865 పోస్టులు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ఆర్థిక శాఖ మరో 24,078 పోస్టుల భర్తీకి అనుమతి తెలుపుతూ జూలైలో జీవో 183 జారీ చేసింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 1,127 పోస్టులు, వివిధ శాఖల ద్వారా 2,443 పోస్టులు, విద్యాశాఖ ద్వారా 20,508 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు. అనంతరం సెప్టెంబర్‌లో పలు శాఖల్లో మరో 3,025 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపుతూ ఆర్థికశాఖ జీవో 262 విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తున్నట్లు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం నోటిఫికేషన్ల సంగతిని మాత్రం గాలికొదిలేసింది. దీంతో లక్షలాది మంది కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ పొందినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆఖరికి పీజీ, బీటెక్‌లు పూర్తి చేసిన యువత కూడా ఇప్పుడు వీఆర్వో పోస్టుల నోటిఫికేషన్ రావడంతో వాటికి దరఖాస్తు చేసుకుంటున్నారు.
 
 రాష్ట్ర విభజనకు సంబంధం లేకున్నా..
 
 రాష్ట్ర విభజనకు ఈ పోస్టుల భర్తీకి సంబంధం లేకపోయినప్పటికీ ఏపీపీఎస్సీ గానీ ఇతర శాఖలు గానీ నోటిఫికేషన్లు జారీ చేయడంలేదు. ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోల్లో రాష్ట్ర కేడర్ పోస్టులు వెయ్యికి మించి ఉండవని, మిగతా పోస్టులన్నీ జిల్లా, జోనల్ పోస్టులేనని, వాటి భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయకపోవడం శోచనీయమని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం ఇటీవలే ఏపీపీఎస్సీకి మాత్రం సభ్యులను నియమించడం విచిత్రంగా ఉందని ఒక అధికారి వ్యాఖ్యానించారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2011లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement