ఆక్షన్.. నో యాక్షన్! | No auction for Srikalahasti pilgrims shops | Sakshi
Sakshi News home page

ఆక్షన్.. నో యాక్షన్!

Published Mon, Feb 9 2015 9:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

ఆక్షన్.. నో యాక్షన్!

ఆక్షన్.. నో యాక్షన్!

* శ్రీశైలం, శ్రీకాళహస్తిల్లో షాపులకు వేలం
* దుర్గగుడిలో తాత్సారం చేస్తున్న అధికారులు
* ఒక్కో షాపు ద్వారా నెలకు రూ. 58 వేల రాబడి
* రూ. 2 లక్షలు వచ్చే వీలున్నా ఆక్షన్ పెట్టని వైనం

 
సాక్షి, విజయవాడ : వ్యాపారుల రాజకీయ పలుకుబడి, అధికారుల నిర్లక్ష్యం.. వెరసి దుర్గమ్మ ఆదాయానికి గండిపడుతోంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న 13 షాపులకు గడువు ముగిసి ఐదు నెలలు దాటినా వేలం నిర్వహించకుండా దేవస్థానం లీజెస్ విభాగం అధికారులు తాత్సారం చేస్తున్నారు. అధికార టీడీపీ, బీజేపీ నేతల చేతుల్లో ఈ దుకాణాలు ఉండడం వల్లనే  అధికారులు ఆక్షన్ నిర్వహించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా కొండపై  ఉన్న 13 దుకాణాల్లో ఒక్కదానికి మినహా మిగిలిన షాపుల కాలపరిమితి ముగిసింది.
 
దీంతో ఇక్కడ షాపులు అవసరం లేదంటూ దేవాదాయ శాఖ కమిషనర్ వై.వి.అనూరాధ నిర్ణయించారు. షాపుల అద్దె పెంచి తమనే కొనసాగించాలంటూ నిర్వాహకులు హైకోర్టుకు వెళ్లడంతో వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. దేవస్థానం షాపులకు తిరిగి వేలం నిర్వహించాలని అప్పటివరకు ప్రస్తుతం ఉన్న షాపులకు 33 శాతం అద్దె పెంచాలని హైకోర్టు గత అక్టోబర్‌లో ఉత్తర్వులిచ్చింది. అప్పట్లో దసరా ఉత్సవాలు రావడంతో వేలం వేయకుండా అద్దెలు పెంచి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తిరిగి వ్యాపారులకు మేలు జరిగేలా ఈ షాపులకు  వేలం నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దేవాదాయ కమిషనర్‌కు ఆలయ అధికారులు లేఖ రాయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 శ్రీశైలం, శ్రీకాళహస్తిల్లో షాపులకు వేలం..
 శ్రీశైలం, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్లో ఉన్న షాపుల గడువు 2014లో ముగియడంతో అక్కడి వ్యాపారులు కోర్టుకు వెళ్లారు. వారికి చుక్కెదురు కావడంతో అక్కడ అధికారులు చొరవ తీసుకుని షాపులకు ఆక్షన్ నిర్వహించి తిరిగి రెండేళ్లకు షాపులను లీజుకిచ్చారు. ఇక్కడ మాత్రం కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ, కమిషనర్ షాపులు తొలగించాలని గతంలో ఆదేశించినప్పటికీ  అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ ఇంకా లేఖలతో సంప్రదింపులకే పరిమితం కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
 
 పార్కు రోడ్డులో షాపునకు 60 శాతం పెరిగిన ఆదాయం
 పార్కు రోడ్డులో దుర్గగుడి, దాని దత్తత దేవాలయాలకు మూడు షాపులున్నాయి. వీటికి వేలం నిర్వహించవచ్చంటూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పార్కు రోడ్డులోని ఒక షాపునకు ఆక్షన్ నిర్వహించగా 60 శాతం మేర ఆదాయం పెరిగింది. మిగిలిన షాపులకు అంతే ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంద్రకీలాద్రిపై ఉన్న షాపులకు ప్రస్తుతం నెలకు రూ.58 వేలు అద్దె చెల్లిస్తున్నారు.  లీజుదారులు వీటిని ఒక్కొక్క షాపు రూ.2 లక్షలకు సబ్‌లీజులకు ఇచ్చారని సమాచారం. ఇప్పుడు దేవస్థానం ఆక్షన్ నిర్వహిస్తే ఒక్కో దుకాణానికి రూ.2 లక్షల చొప్పున ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు చొరవ చూపడం లేదు.  
 
 మంత్రులు దృష్టిసారించేనా?
 జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దేవస్థానానికి వచ్చి కొండపై లోపాలను సరిదిద్దుతామని, అమ్మవారి ఆదాయాన్ని పెంచుతామంటూ హడావుడి చేశారు. దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు కూడా దేవస్థానం ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇద్దరు మంత్రులు కూడా దుకాణాలను తొలగించడమో.. లేక తిరిగి వేలం పెట్టేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడమో చేయడం లేదని భక్తులు భావిస్తున్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు షాపుల వేలంపై దృష్టిసారించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement