పెదకాకాని : రాష్ట్రంలో ఉన్న దేవాలయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ వైవీ అనురాధ పేర్కొన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఆలయ అధికారులతో కమిషనర్ ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశానికి పెదకాకాని శివాలయం కల్యాణమంటపం వేదికైంది.
సమావేశంలో ముఖ్యఅతిథి అనురాధ మాట్లాడుతూ జిల్లాలవారీగా ఆలయాల ఆదాయ, వ్యయ పట్టికలు, ఆస్తులు, భూములు, హుండీల ఆదాయం, బంగారు, వెండి ఆభరణాలు వాటి సంరక్షణ వంటి అంశాలపై చర్చించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని ఆలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని కమిషనర్ పేర్కొన్నారు.
ప్రతి నెల మొదటి, రెండో సోమ, మంగళ, బుధ, శని, ఆదివారాల్లో భక్తులు, ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలన్నారు. దేవాదాయ శాఖ భూములకు సంబంధించి రికార్డుల్లో తప్పులు దొర్లాయని పలువురు రైతులు దరఖాస్తు చేసుకున్నారని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.
తొలుత కమిషనర్ అనురాధ జ్యోతి ప్రజ్వలనచేసి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశంలో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ టి.చంద్రకుమార్, ఆర్జేసీ శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ సురేష్‌బాబు, సహాయ కమిషనర్ కేబీ శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లా సహాయ కమిషనర్ రవీంద్రరెడ్డి, పెదకాకాని ఈవో దార్ల సుబ్బారావు, అధికారులు పాల్గొన్నారు.
శివాలయంలో ప్రత్యేక పూజలు..
సమీక్ష సమావేశానికి హాజరైన రాష్ట్ర కమిషనర్ అనురాధ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రదక్షిణల అనంతరం శ్రీభ్రమరాంబ అమ్మవారిని, మల్లేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు.
వినతులు.. ఫిర్యాదులు..
దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ అనురాధకు స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులను అర్జీల రూపంలో అందజేశారు. శివాలయం ఎదురుగా ఉన్న సర్వేనంబరు 167లో అమిరే చిన సుబ్బారావు సత్రాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామ సర్పంచ్ ఆళ్ళ వీరరాఘవమ్మ వినతి పత్రం అందజేశారు.
ఆలయంలో పదేళ్లుగా పనిచేస్తున్నామని, తమను పర్మినెంట్ చేయాలని పలువురు అర్చకులు, ఎన్‌ఎంఆర్‌లు వినతిపత్రం సమర్పించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఈవో ఈమని చంద్రశేఖరరెడ్డి అర్చకుల వద్ద పెద్దఎత్తున నగదు తీసుకుని రెగ్యులర్ చేశారని, వివాదం కావడంతో వారిని తాత్కాలికంగా తప్పించినప్పటికీ ప్రత్యేక అకౌంట్ ద్వారా ఇప్పటికీ పర్మినెంట్ వేతనాలు ఇస్తున్నారని తెలుగుయువత నాయకుడు మురళి ఫిర్యాదుచేశారు.