YV anuradha
-
దేవాదాయశాఖ కమిషనర్‌పై కేసు నమోదు
సాక్షి, విజయవాడ : దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనురాధ, సహాయ కమిషనర్ పుష్పవర్ధన్‌తో సహా, మరొకరిపై విజయవాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దుర్గగుడిలో పనిచేసే వెంకటేశ్వర్లు అనే కాంట్రాక్టర్ కార్మికుడు పట్ల దురుద్దేశ పూర్వకంగా, నష్టం కలిగించే విధంగా వ్యవహరించటం మీద కోర్టు ఆదేశాల మేరకు అనురాధపై సెక్షన్ 166, 384, 425, 506, 120బీ, 34ఐపీసీ, 156(3), సీఆర్పీసీల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలో వైవీ అనురాధ దుర్గగుడి ఈవోగా పనిచేశారు. -
వచ్చేదెవరు..?
దుర్గగుడి కొత్త కార్యనిర్వహణాధికారిగా ఎవరు వస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. దుర్గమ్మ ఆలయంలో జరిగిన తాంత్రిక పూజల వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఈఓగా నియమితులైన తొలి మహిళా ఐఏఎస్ అధికారి సూర్యకుమారి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో మళ్లీ ఐఏఎస్‌ను నియమిస్తారా లేక దేవాదాయశాఖకు చెందిన రీజినల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమిస్తారా? అన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి, విజయవాడ: దుర్గగుడి కార్యనిర్వహణాధికారి(ఈఓ) గా ఎవరు వస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. మళ్లీ ఐఏఎస్ అధికారినే నియమిస్తారా? లేక దేవాదాయశాఖకు చెందిన రీజినల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమిస్తారా? అన్న అంశంపై ఇంద్రకీలాద్రిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం, అది వివాదాస్పదం కావడంతో కొన్ని రోజుల క్రితం వరకూ ఈఓగా బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్ అధికారి ఎ.సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతానికి దేవాదాయశాఖ కమిషనర్ వై.వి.అనూరాధ ఆలయ ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు చూస్తున్నారు. మరో పక్షం రోజుల్లో ప్రభుత్వం కొత్త ఈఓను నియమించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంతో తమకు అనుకూలంగా ఉండే అధికారినే ఈఓగా తీసుకొచ్చేందుకు ఇద్దరు కీలకమంత్రుల చుట్టూ దేవస్థానానికి చెందిన కొంతమంది అర్చకులు, అధికారులు ప్రదక్షిణ చేస్తున్నారు. ఐఏఎస్ వచ్చేనా? దేవస్థానం ఈఓగా తిరిగి ఐఏఎస్ అధికారిని నియమిస్తారా? లేక దేవాదాయశాఖకు చెందిన రీజినల్జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమిస్తారా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల నుంచి ఈఓగా పనిచేసేవారు వివాదాస్పదం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈఓగా రావడానికి ఐఏఎస్‌లు సుముఖంగా లేరని తెలిసింది. ముమ్మరంగా ప్రయత్నాలు దుర్గగుడిలో దీర్ఘకాలంగా పనిచేసిన ఏఈఓ, సూపరింటెండెంట్లు, గుమస్తాలను కలిపి మొత్తం 23 మందిని ఇటీవల ఇతర ఆలయాలకు బదిలీ చేశారు. అయితే అంగబలం, అర్థబలం ఉపయోగించి వారిలో కొందరు తిరిగి ఇక్కడకు చేరుకున్నారు. వారిలో అన్నదానం, ప్రసాదాలు తయారీ, స్టోర్స్ వంటి కీలకవిభా గాల్లో పనిచేసిన అధికారులు ఉన్నారు. వారే తిరిగి తమకు అనుకూలంగా ఉండే అధికారిని ఈఓగా తీసుకొచ్చేందుకు ముమ్మరంగా లాబీ నడుపుతున్నారని సమాచారం. దేవస్థానానికి చెందిన కొంతమంది అర్చకులు వారికి సహాయం చేస్తున్నారని తెలిసింది. త్రినాథరావు కాకపోతే సింహాచలం ఈఓగా ఉన్న రామచంద్రమోహన్‌ను అయినా దుర్గగుడి ఈఓగా నియమించాలనే వారు కోరుతున్నారని సమాచారం. పాలకమండలి దూరం..దూరం ఆలయంలో ఈఓగా పనిచేసిన తొలి మహిళా ఐఏఎస్ అధికారి సూర్యకుమారి దుర్గమ్మకు తాంత్రిక పూజలు చేయించారంటూ వ్యాఖ్యలు చేసి, చివరకు ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురైన పాలకమండలి సభ్యులు మాత్రం ఈఓ విషయంలో ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఈఓ గురించి మాట్లాడితే మరోసారి వివాదం అవుతుందని భావించే వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ ఆలోచనలను మంత్రుల వద్దనే పంచుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కోటేశ్వరమ్మ లేదా త్రినాథరావు ముంబాయికి చెందిన ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మ ఈఓగా వస్తారంటూ తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆమె అక్కడ రిలీవ్ కాలేదు. దీంతో ఆమె ఈఓగా రావడం సందిగ్ధంగా మారింది. ఈలోగా దేవస్థానంలో ఒకవర్గం తమకు అనుకూలంగా ఉండే అధికారిని ఈఓగా తీసుకొ చ్చేందుకు లాబీ నడుపుతోంది. ఐఏఎస్‌కు బదులు దేవాదాయశాఖకు చెందిన అధికారిని నియమిస్తేనే పరిస్థితుల్ని చక్కదిద్దుతారని ఆ వర్గం ప్రచారం చేస్తోంది. ద్వారకా తిరుమల ఆలయ ఈఓ వి.త్రినాథరావును తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన 2013 డిసెంబర్ నుంచి 2014 నవంబర్ వరకు దుర్గగుడి ఇన్చార్జి ఈఓగా ఏ విధమైన వివాదాలు లేకుండా పనిచేశారు. ద్వారకా తిరుమల ఆలయంలో ఐదేళ్ల నుంచి ఈఓ పనిచేస్తున్నారు. దీంతో ఆయన త్వరలో బదిలీ అవుతారని సమాచారం. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే ఈఓను నియమించాలంటూ దుర్గగుడికి చెందిన కొందరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన ఇద్దరు మంత్రుల వద్దకు వెళ్లినట్లు సమాచారం. -
దుర్గగుడి ఈవోగా వైవీ అనూరాధ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడి ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ ఆదివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి చేరుకున్న వైవీ అనూరాధకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం ఆమె రాజగోపురం ఎదురుగా ఉన్న వీఐపీ లాంజ్‌లో ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్‌పై సంతకాలు చేశారు. బ్రాహ్మణవీధిలోని ఇంద్రకీలాద్రి పరిపాలనా భవనానికి చేరుకున్నారు. -
ఆక్షన్.. నో యాక్షన్!
* శ్రీశైలం, శ్రీకాళహస్తిల్లో షాపులకు వేలం * దుర్గగుడిలో తాత్సారం చేస్తున్న అధికారులు * ఒక్కో షాపు ద్వారా నెలకు రూ. 58 వేల రాబడి * రూ. 2 లక్షలు వచ్చే వీలున్నా ఆక్షన్ పెట్టని వైనం సాక్షి, విజయవాడ : వ్యాపారుల రాజకీయ పలుకుబడి, అధికారుల నిర్లక్ష్యం.. వెరసి దుర్గమ్మ ఆదాయానికి గండిపడుతోంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న 13 షాపులకు గడువు ముగిసి ఐదు నెలలు దాటినా వేలం నిర్వహించకుండా దేవస్థానం లీజెస్ విభాగం అధికారులు తాత్సారం చేస్తున్నారు. అధికార టీడీపీ, బీజేపీ నేతల చేతుల్లో ఈ దుకాణాలు ఉండడం వల్లనే అధికారులు ఆక్షన్ నిర్వహించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా కొండపై ఉన్న 13 దుకాణాల్లో ఒక్కదానికి మినహా మిగిలిన షాపుల కాలపరిమితి ముగిసింది. దీంతో ఇక్కడ షాపులు అవసరం లేదంటూ దేవాదాయ శాఖ కమిషనర్ వై.వి.అనూరాధ నిర్ణయించారు. షాపుల అద్దె పెంచి తమనే కొనసాగించాలంటూ నిర్వాహకులు హైకోర్టుకు వెళ్లడంతో వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. దేవస్థానం షాపులకు తిరిగి వేలం నిర్వహించాలని అప్పటివరకు ప్రస్తుతం ఉన్న షాపులకు 33 శాతం అద్దె పెంచాలని హైకోర్టు గత అక్టోబర్‌లో ఉత్తర్వులిచ్చింది. అప్పట్లో దసరా ఉత్సవాలు రావడంతో వేలం వేయకుండా అద్దెలు పెంచి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తిరిగి వ్యాపారులకు మేలు జరిగేలా ఈ షాపులకు వేలం నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దేవాదాయ కమిషనర్‌కు ఆలయ అధికారులు లేఖ రాయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తిల్లో షాపులకు వేలం.. శ్రీశైలం, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్లో ఉన్న షాపుల గడువు 2014లో ముగియడంతో అక్కడి వ్యాపారులు కోర్టుకు వెళ్లారు. వారికి చుక్కెదురు కావడంతో అక్కడ అధికారులు చొరవ తీసుకుని షాపులకు ఆక్షన్ నిర్వహించి తిరిగి రెండేళ్లకు షాపులను లీజుకిచ్చారు. ఇక్కడ మాత్రం కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ, కమిషనర్ షాపులు తొలగించాలని గతంలో ఆదేశించినప్పటికీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ ఇంకా లేఖలతో సంప్రదింపులకే పరిమితం కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. పార్కు రోడ్డులో షాపునకు 60 శాతం పెరిగిన ఆదాయం పార్కు రోడ్డులో దుర్గగుడి, దాని దత్తత దేవాలయాలకు మూడు షాపులున్నాయి. వీటికి వేలం నిర్వహించవచ్చంటూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పార్కు రోడ్డులోని ఒక షాపునకు ఆక్షన్ నిర్వహించగా 60 శాతం మేర ఆదాయం పెరిగింది. మిగిలిన షాపులకు అంతే ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంద్రకీలాద్రిపై ఉన్న షాపులకు ప్రస్తుతం నెలకు రూ.58 వేలు అద్దె చెల్లిస్తున్నారు. లీజుదారులు వీటిని ఒక్కొక్క షాపు రూ.2 లక్షలకు సబ్‌లీజులకు ఇచ్చారని సమాచారం. ఇప్పుడు దేవస్థానం ఆక్షన్ నిర్వహిస్తే ఒక్కో దుకాణానికి రూ.2 లక్షల చొప్పున ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు చొరవ చూపడం లేదు. మంత్రులు దృష్టిసారించేనా? జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దేవస్థానానికి వచ్చి కొండపై లోపాలను సరిదిద్దుతామని, అమ్మవారి ఆదాయాన్ని పెంచుతామంటూ హడావుడి చేశారు. దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు కూడా దేవస్థానం ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇద్దరు మంత్రులు కూడా దుకాణాలను తొలగించడమో.. లేక తిరిగి వేలం పెట్టేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడమో చేయడం లేదని భక్తులు భావిస్తున్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు షాపుల వేలంపై దృష్టిసారించాల్సి ఉంది. -
ఆలయాల అభివృద్ధికి కృషి
పెదకాకాని : రాష్ట్రంలో ఉన్న దేవాలయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ వైవీ అనురాధ పేర్కొన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఆలయ అధికారులతో కమిషనర్ ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశానికి పెదకాకాని శివాలయం కల్యాణమంటపం వేదికైంది. సమావేశంలో ముఖ్యఅతిథి అనురాధ మాట్లాడుతూ జిల్లాలవారీగా ఆలయాల ఆదాయ, వ్యయ పట్టికలు, ఆస్తులు, భూములు, హుండీల ఆదాయం, బంగారు, వెండి ఆభరణాలు వాటి సంరక్షణ వంటి అంశాలపై చర్చించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని ఆలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని కమిషనర్ పేర్కొన్నారు. ప్రతి నెల మొదటి, రెండో సోమ, మంగళ, బుధ, శని, ఆదివారాల్లో భక్తులు, ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలన్నారు. దేవాదాయ శాఖ భూములకు సంబంధించి రికార్డుల్లో తప్పులు దొర్లాయని పలువురు రైతులు దరఖాస్తు చేసుకున్నారని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. తొలుత కమిషనర్ అనురాధ జ్యోతి ప్రజ్వలనచేసి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశంలో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ టి.చంద్రకుమార్, ఆర్జేసీ శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ సురేష్‌బాబు, సహాయ కమిషనర్ కేబీ శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లా సహాయ కమిషనర్ రవీంద్రరెడ్డి, పెదకాకాని ఈవో దార్ల సుబ్బారావు, అధికారులు పాల్గొన్నారు. శివాలయంలో ప్రత్యేక పూజలు.. సమీక్ష సమావేశానికి హాజరైన రాష్ట్ర కమిషనర్ అనురాధ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రదక్షిణల అనంతరం శ్రీభ్రమరాంబ అమ్మవారిని, మల్లేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. వినతులు.. ఫిర్యాదులు.. దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ అనురాధకు స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులను అర్జీల రూపంలో అందజేశారు. శివాలయం ఎదురుగా ఉన్న సర్వేనంబరు 167లో అమిరే చిన సుబ్బారావు సత్రాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామ సర్పంచ్ ఆళ్ళ వీరరాఘవమ్మ వినతి పత్రం అందజేశారు. ఆలయంలో పదేళ్లుగా పనిచేస్తున్నామని, తమను పర్మినెంట్ చేయాలని పలువురు అర్చకులు, ఎన్‌ఎంఆర్‌లు వినతిపత్రం సమర్పించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఈవో ఈమని చంద్రశేఖరరెడ్డి అర్చకుల వద్ద పెద్దఎత్తున నగదు తీసుకుని రెగ్యులర్ చేశారని, వివాదం కావడంతో వారిని తాత్కాలికంగా తప్పించినప్పటికీ ప్రత్యేక అకౌంట్ ద్వారా ఇప్పటికీ పర్మినెంట్ వేతనాలు ఇస్తున్నారని తెలుగుయువత నాయకుడు మురళి ఫిర్యాదుచేశారు. -
‘నలుగురుండి ఏం చేస్తున్నారు’
రాజానగరం : అన్నదాన సత్రానికి ఆస్తులు అధికంగా ఉన్నా, ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణ మంటపం నిర్మిస్తామంటూ గ్రామంలోని శ్రీరాజాకాండ్రేగుల జోగిజగన్నాథరావు బహుదూర్ పంతులు అన్నదాన సత్రాన్ని నేలకూల్చిన ప్రాంతాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సత్రానికి ఉన్న ఆస్తులు, వస్తున్న ఆదాయాన్ని పరిశీలించారు. అధికారులపై మండిపడ్డారు. ఏడు గ్రామాల్లో 142 ఎకరాలు ఉంటే దానిలో సాగు భూమిగా ఉన్న 80 ఎకరాలకు రూ.ఎనిమిది లక్షల 20 వేలు మాత్రమే ఆదాయం రావడంపై ఆరా తీశారు. ‘నాలుగు ఎకరాలకు కనీసం రూ. లక్ష ఆదాయం రావలసిన తరుణంలో 80 ఎకరాలకు రూ.ఎనిమిది లక్షలా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. నలుగురు ఉద్యోగులు ఉండి ఏం లాభం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణం నిబంధనల మేరకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, పన్నుల వసూలుపై దృష్టిని సారించాలని సూచించారు. కూల్చి వే సిన సత్రం స్థల ంలో కల్యాణ మంటపాన్ని నిర్మించడం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉంటుందనే విషయమై చర్చించారు. రెండు అంతస్తులతో భవనాన్ని నిర్మించి, దిగువన కల్యాణాలకు, ఎగువ భోజన వసతులకు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందన్నారు. దాతలు ఇచ్చిన భూములను కూడా కాపాడలేని స్థితిలో ఉద్యోగులు ఉండడం విచారకరమంటూ ఆక్రమణలపై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సర్వే చేయించి, గ్రామంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఉన్న ఆస్తులను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ సూరిబాబు, అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు, ఈఈ సుబ్బారావు, ఆర్జేసీ అజాద్, స్థానిక ఉద్యోగులు ఉన్నారు. -
17 మంది ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 17 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న వైవీ అనూరాధను దేవాదాయ శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. -
మెరుగైన వైద్యసేవలందించండి
కడప రూరల్, న్యూస్‌లైన్: సరైన వైద్యసేవలు అందిస్తేనే ప్ర భుత్వ ఆసుపత్రులకు రోగులు వస్తారని వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వైవీ అనురాధ అన్నారు. రాబోవు మూడేళ్లలో జిల్లాలో పునరుత్పత్తి, మాతాశిశు యువత ఆరోగ్య సంరక్షణకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గాను 30 శాతం అదనపు నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. సోమవారం స్థానిక హరిత హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో పునరుత్పత్తి, యువత ఆరోగ్య సంరక్షణ, ప్రణాళిక రూపకల్పనపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇందుకు సంబంధించి దేశంలో 184 జిల్లాలు ఎంపిక కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఆరు జిల్లాలను ఎంపిక చేశారన్నారు. అందులో వైఎస్ఆర్ జిల్లా ఒకటని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తల్లుల మరణాల శాతం 6.9 శాతం తగ్గిందన్నారు. ఆరోగ్య ప్రణాళికల రూపకల్పనలో భాగంగా మాతాశిశు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కుటుంబ నియంత్రణ పరిధిలోకి తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం, రక్షిత మంచినీటి సరఫరాలను కూడా అంశాలుగా చేర్చాలన్నారు. కార్మిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది సరైన వైద్యసేవలు అందిస్తేనే ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు వస్తారని పేర్కొన్నారు. ప్రధానంగా లేబర్ రూములో మరిన్ని వసతులు పెంచాలన్నారు. నిధులు సద్వినియోగమయ్యేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇంటింటికి వెళ్లి ఆశావర్కరు,్ల గ్రామ సమాఖ్య సంఘాలు చైతన్యపరచడం ద్వారా భ్రూణ హత్యల నిరోధానికి కృషి చేయాలన్నారు. పేదవారి ఇళ్లల్లోనే చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు- కలెక్టర్ జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ పునరుత్పత్తి, మాతా శిశు, యువత ఆరోగ్య సంరక్షణ క్రింద జిల్లా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. పల్లె పిలుపు కార్యక్రమంలో మొదటి రెండు అంశాలుగా వైద్యం, ఆరోగ్యం అంగన్వాడిలను సమీక్షిస్తున్నామన్నారు. పేదవారి ఇళ్లల్లో మాత్ర మే పిల్లలు ఎందుకు చనిపోతున్నారో దృష్టి లో ఉంచుకొని డాక్టర్లు వైద్యసేవలు అందించాలన్నారు. మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో రిమ్స్ డెరైక్టర్ సిద్దప్ప గౌరవ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ ప్రభుదాస్, ఐసీడీఎస్ పీడీ లీలావతి, డీఆర్డీఏ పీడీ వెంకటసుబ్బయ్య, వైద్యాధికారులు పాల్గొన్నారు. రిమ్స్ సందర్శన: కడప అర్బన్ : రిమ్స్‌లో చిన్న పిల్లల వైద్య సేవలను మెరుగు పరచాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వైవీ అనురాధశర్మ రిమ్స్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలో పర్యటించిన ఆమె సాయంత్రం రిమ్స్‌ను సందర్శించారు. నవజాత శిశువుల కోసం ఏర్పాటు చేసిన ఎస్ఎన్ ఐసీయూ యూనిట్‌ను పరిశీలించారు. కాన్పుల విభాగంలో వైద్య సేవలు మరింత మెరుగుపడాలన్నారు.