మెరుగైన వైద్యసేవలందించండి
కడప రూరల్, న్యూస్‌లైన్: సరైన వైద్యసేవలు అందిస్తేనే ప్ర భుత్వ ఆసుపత్రులకు రోగులు వస్తారని వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వైవీ అనురాధ అన్నారు. రాబోవు మూడేళ్లలో జిల్లాలో పునరుత్పత్తి, మాతాశిశు యువత ఆరోగ్య సంరక్షణకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గాను 30 శాతం అదనపు నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. సోమవారం స్థానిక హరిత హోటల్ కాన్ఫరెన్స్ హాల్‌లో పునరుత్పత్తి, యువత ఆరోగ్య సంరక్షణ, ప్రణాళిక రూపకల్పనపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇందుకు సంబంధించి దేశంలో 184 జిల్లాలు ఎంపిక కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఆరు జిల్లాలను ఎంపిక చేశారన్నారు. అందులో వైఎస్‌ఆర్ జిల్లా ఒకటని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో తల్లుల మరణాల శాతం 6.9 శాతం తగ్గిందన్నారు. ఆరోగ్య ప్రణాళికల రూపకల్పనలో భాగంగా మాతాశిశు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కుటుంబ నియంత్రణ పరిధిలోకి తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం, రక్షిత మంచినీటి సరఫరాలను కూడా అంశాలుగా చేర్చాలన్నారు. కార్మిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది సరైన వైద్యసేవలు అందిస్తేనే ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు వస్తారని పేర్కొన్నారు. ప్రధానంగా లేబర్ రూములో మరిన్ని వసతులు పెంచాలన్నారు. నిధులు సద్వినియోగమయ్యేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇంటింటికి వెళ్లి ఆశావర్కరు,్ల గ్రామ సమాఖ్య సంఘాలు చైతన్యపరచడం ద్వారా భ్రూణ హత్యల నిరోధానికి కృషి చేయాలన్నారు.
పేదవారి ఇళ్లల్లోనే చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు- కలెక్టర్
జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ పునరుత్పత్తి, మాతా శిశు, యువత ఆరోగ్య సంరక్షణ క్రింద జిల్లా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. పల్లె పిలుపు కార్యక్రమంలో మొదటి రెండు అంశాలుగా వైద్యం, ఆరోగ్యం అంగన్‌వాడిలను సమీక్షిస్తున్నామన్నారు. పేదవారి ఇళ్లల్లో మాత్ర మే పిల్లలు ఎందుకు చనిపోతున్నారో దృష్టి లో ఉంచుకొని డాక్టర్లు వైద్యసేవలు అందించాలన్నారు. మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో రిమ్స్ డెరైక్టర్ సిద్దప్ప గౌరవ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ ప్రభుదాస్, ఐసీడీఎస్ పీడీ లీలావతి, డీఆర్‌డీఏ పీడీ వెంకటసుబ్బయ్య, వైద్యాధికారులు పాల్గొన్నారు.
రిమ్స్ సందర్శన:
కడప అర్బన్ : రిమ్స్‌లో చిన్న పిల్లల వైద్య సేవలను మెరుగు పరచాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వైవీ అనురాధశర్మ రిమ్స్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలో పర్యటించిన ఆమె సాయంత్రం రిమ్స్‌ను సందర్శించారు. నవజాత శిశువుల కోసం ఏర్పాటు చేసిన ఎస్‌ఎన్ ఐసీయూ యూనిట్‌ను పరిశీలించారు. కాన్పుల విభాగంలో వైద్య సేవలు మరింత మెరుగుపడాలన్నారు.