తండ్రికి అనారోగ్యం కలగడంతో పంపనూరు గ్రామానికి చెందిన రామకృష్ణ బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేయించుకుని, తిరుగు ప్రయాణంలో అనంతపురం ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నాడు. దాహం తీర్చుకోడానికి అక్కడే ఉన్న కొళాయి వద్దకు వెళ్లగా అందులో నీళ్లు రాలేదు. చేసేది లేక ఎదురుగానే ఉన్న మినరల్ వాటర్ దుకాణంలో డబ్బు చెల్లించి దాహం తీర్చుకున్నాడు. బస్టాండుకు వచ్చే ప్రయాణికులందరి పరిస్థితీ ఇదే...
సాక్షి, అనంతపురం: వేలాది మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే అనంతపురం ఆర్టీసీ బస్టాండులో కనీస సౌకర్యాలతో పాటు రక్షణ కూడా కరువవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 14 ప్లాట్‌ఫాంలున్న ఈ బస్టాండులో చివరి ప్లాట్‌ఫాం వద్ద నాలుగు కొళాయిలు ఏర్పాటు చేశారు. తీవ్రమైన దాహంతో కొళాయి వద్దకు చేరుకున్న ప్రయాణికులు అక్కడి పారిశుద్ధ్య పరిస్థితి చూడగానే దాహాన్ని మరచిపోయి దూరంగా పోతున్నారు. కాదని ఎవరైనా దాహం తీర్చుకోవాలని ప్రయత్నిస్తే నాలుగింటిలో ఒక్క కొళాయిలో మాత్రమే సన్నని ధారగా నీరు వస్తూ కనిపిస్తుంది. అయినా సరే దాహం తీర్చుకుందామంటే బస్సు వెళ్లిపోతుందేమోనన్న ఆదుర్దా అడ్డుపడుతుంది. ఇవన్నీ కాదని సహనం విహ ంచినా, ఆ నీరు దుర్వాసన వేస్తూ గుటక పడనివ్వదు. దీంతో ఆ నీటిని తాగితే అనారోగ్యం ఖాయమని గుర్తించిన ప్రయాణికులు ఎదురుగానే ఉన్న మినరల్ వాటర్ దుకాణంలో నీళ్లు కొనుగోలు చేసి తాగుతున్నారు. ఎంతటి నిరుపేదకైనా ఈ పరిస్థితి తప్పనిసరి. ఇదే అదనుగా, బస్టాండులో ప్రస్తుతం నీరు విక్రయించేందుకు ఆరు దుకాణాలు వెలిశాయి. వీరు సైతం మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్ విక్రయిస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నారు.
సేదదీరే అవకాశమే లేదు
బస్సు లేకపోవడం వల్లో మరే కారణంతోనైనా బస్టాండులోనే నిలచిపోయిన ప్రయాణికులు తలదాచుకునేందుకు ఇక్కడ విశ్రాంతి గదులు సైతం లేవు. రాత్రి వేళల్లో బస్టాండుకు చేరుకునే ప్రయాణికులు బస్సు లేకపోతే, పడకలు అద్దెకు తీసుకునే శక్తి లేకపోతే బస్టాండు ఆవరణలోనే ప్లాట్‌ఫాంపై దోమలకాటుకు గురవుతూ, జాగరణ చేయాల్సిందే. మూత్ర శాలలు, మరుగుదొడ్లలో ఒక పద్ధతంటూ లేకుండా డబ్బు వసూలు చేస్తున్నా పరిశుభ్రత కానరావడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులకు అవసరమైనన్ని కుర్చీలు, బల్లలు కూడా తగినంత స్థాయిలో లేవు. అనంతపురం బస్టాండ్ మీదుగా వెళ్లే బస్సుల రాకపోకల వివరాలు తెలుసుకోవడానికి విచారణ కేంద్రానికి వెళితే తెలియదన్న సమాచారం మాత్రమే వినిపిస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బస్టాండులోని టీవీలు, ఫ్యాన్‌ల పని తీరు చెప్పాల్సిన అవసరమే లేదని అంటున్నారు.
టీవీలు పనిచేయడం లేదు
బస్సులు చార్జీలు పెంచి మాపై భారం మోపుతున్నారు కానీ, బస్టాండ్‌లో సౌకర్యాలు కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. బస్టాండులో ఏర్పాటు చేసిన టీవీలు ఎప్పుడూ పని చేసిన దాఖలాలే లేవు. దీంతో బస్సు వచ్చే వరకు గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాల్సి వస్తోంది. ఆర్టీసీ సార్లు చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
- రమేష్, ప్రయాణికుడు, సనప.
ఆర్టీసీ బస్టాండులో దొంగకు దేహశుద్ధి
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: ప్రయాణికురాలి హ్యాండ్‌బ్యాగ్‌ను లాక్కుని పారిపోతున్న దొంగను బాధితురాలి కుటుంబ సభ్యులు పట్టుకోగా, ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నుంచి రాయదుర్గం వెళ్లే బస్సులో కడప పట్టణానికి చెందిన సుజాత కుటుంబం ప్రయాణిస్తోంది. వారు వెళుతున్న బస్సు గురువారం మధ్యాహ్నం అనంతపురం ఆర్టీసీ బస్టాండుకు చేరుకుంది. బస్సు అక్కడే కొద్ది సేపు ఆగడంతో కొందరు ప్రయాణికులు బస్సు దిగిపోయారు. ఇంతలో ఓ యువకుడు సుజాత భుజానికి తగిలించుకున్న బ్యాగును కిటికీలోంచి లాక్కుని ఉడాయించాడు.
దీంతో ఆమె దొంగ..దొంగ అంటూ గట్టిగా కేకలు వేయడంతో, వాటర్ బాటిల్ కోసం బస్సు దిగిన ఆమె సోదరుడు దొంగను వెంబడించాడు. శ్రీనివాసనగర్ వైపు పరుగెత్తుతున్న అతనిని పట్టుకోగా, ప్రయాణికులు, కుటుంబ సభ్యులు అతనిని చితకబాదారు. హ్యాండ్ బ్యాగ్‌లోని మొత్తాన్ని లెక్కపెట్టగా, అందులో ఉండాల్సిన మొత్తం ఎక్కడికీ పోలేదని బాధితురాలు చెప్పడంతో, దుండగుని ఔట్‌పోస్టు పోలీసులకు అప్పగించారు. బాధితులే దొంగను వెంబడించి పట్టుకుని అప్పగించినా, ప్రయాణికులు పెద్ద ఎత్తున పోగైనా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు.. సరికదా... ఫిర్యాదు రాసి ఇచ్చి వెళ్లమంటూ బాధితులకు ఉచిత సలహా కూడా ఇచ్చారు.
ఆదమరిస్తే అంతే
నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస సౌకర్య్యాలతో పాటు రక్షణ కూడా కరువుతోంది. కాస్త ఆదమరిస్తే చాలు దొంగలు తమ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. బస్టాండులో టూ ప్లస్ టూ చొప్పున పోలీసు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, ఒక్కరు కూడా కనిపించడం లేదు. గురువారం బస్టాండ్‌లో ఉన్న ఒకే ఒక కానిస్టేబుల్ ఇతర ప్రాంతానికి చెందిన ఓ సీఐ సేవలో ఉండడం గమనించిన దొంగ తన చేతికి పని చెప్పాడు. అయితే, బాధితురాలి కుటుంబ సభ్యులు, ప్రయాణికులు కలసి దొంగను పట్టుకున్నారే తప్ప, పోలీసులు చేసింది శూన్యం. ఇలా రకరకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఆర్టీసీ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
బస్సుల నెలవు.. సమస్యల కొలువు
Published Fri, May 30 2014 1:57 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
Advertisement
Advertisement