నో ఛాన్స్
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారం రాత్రి ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైఎస్సార్ జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. తమకు మంత్రివర్గంలో స్థానం దక్కకపోతుందా అని ఆశగా ఎదురుచూసిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్‌రెడ్డిల ఆశలు అడియాసలే అయ్యాయి.
పదేళ్ల విరామం అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనే ఆనందం పార్టీ శ్రేణుల్లో ఓ వైపు ఉన్నా.. మరోవైపు జిల్లాకు మంత్రిపదవి కేటాయించలేదనే నిరుత్సాహం వారిలో లేకపోలేదు. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలుండగా కేవలం రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ కూడా కోట్లాది రూపాయలు వెదజల్లడంతోనే ఆ పార్టీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి ఎన్నికయ్యారనే అభిప్రాయం ఉంది. 2009లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న టీడీపీ తిరిగి 2014లోనూ ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జిల్లా నుంచి గె లుపొందిన ఏకైక శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి కావడంతో తనకు రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆయన ఆశిస్తూ వచ్చారు. కానీ, ఆయన ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు.
ఆశ.. నిరాశ..
తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించే ది లేదని చంద్రబాబు ప్రకటించడంతో మేడా ఆశలు సన్నగిల్లాయి. కనీసం ఎమ్మెల్సీ కోటాలోనైనా తనకు మంత్రివ ర్గంలో చోటు లభిస్తుందని ఎస్వీ సతీష్‌రెడ్డి ఆశలు పెంచుకున్నారు.
పలుమార్లు శాసనసభకు పోటీ చేసి ఓడిపోవడంతో ఈసారి తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ, చంద్రబాబు ఇవేవీ పరిగణలోకి తీసుకోలేదు. టీడీపీకి పట్టున్న జిల్లాలకు, ఒక సామాజిక వర్గానికే పాధాన్యత కల్పించారని ఆ పార్టీ శ్రేణులు బాహాటంగా విమర్శిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని వ్యక్తికి మంత్రి వర్గంలో చోటు కల్పించిన నూతన ముఖ్యమంత్రి వైఎస్సార్ జిల్లా పట్ల వివక్ష చూపడాన్ని టీడీపీ వర్గాలు తప్పుబడుతున్నాయి. కాగా,జిల్లా టీడీపీ నేతలకు మంత్రిస్థాయి సామర్థ్యం లేకపోవడంతోనే అవకాశం లభించలేదని ఆ పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
వర్గ విభేదాలే కారణమా?
జిల్లాకు మంత్రివర్గంలో అవకాశం లభించకపోవడానికి ఆ పార్టీలో తెరవెనుక రాజకీయాలే కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ సతీష్‌కు పదవి ఇవ్వరాదంటూ ఓ వర్గం శతవిధాలా ప్రయత్నించి సఫలీకృతులైనట్లు సమాచారం. ఎమ్మెల్యే మేడా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ద్వారా పైరవీ చేసినా ఫలితం దక్కలేదని తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యే కావడం ఎన్నికలకు ముందు పార్టీలోకి రావడమే ఆయనకు అడ్డంకిగా మారినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవికోసం చేపట్టిన పైరవీలు ఆ పార్టీలో తీవ్ర విభేదాలు సృష్టించినట్లు తెలుస్తోంది.