
‘దేశం’లో ఉగ్రోష్ణం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు లభించిన ప్రాతినిధ్యం కొందరికి మోదాన్ని, కొందరికి ఖేదాన్ని మిగిల్చింది. ఆదివారం కొలువుదీరిన చంద్రబాబు మంత్రివర్గంలో జిల్లా నుం చి ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. తొలిసారి జిల్లాకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించినందుకు ఒకపక్క సంతోషిస్తూనే మరోపక్క అదే సామాజికవర్గం నుంచి నాలుగో సారి ఎమ్మెల్యే అయిన తోట త్రిమూర్తులుకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారంటూ ఆయన అనుచరవర్గం మండిపడుతోంది. ఇంకోపక్క బీసీలలో బలమైన శెట్టిబలిజ, ఎస్సీలలో బలమైన మాల సామాజి కవర్గాలకు అమాత్య పదవులు దక్కకపోవడంతో వారు బాబుపై నిప్పులు చెరుగుతున్నారు. డిప్యూటీ సీఎంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కేబినెట్ మంత్రిగా యనమల రామకృష్ణుడులకు అవకాశం లభించినందుకు సంతోషించాలో లేక రెండు సామాజికవర్గాలకు బెర్త్‌లు దక్కనందుకు నిరసన వ్యక్తం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నామని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు.
గొల్లపల్లికి నమ్మకద్రోహం..
జిల్లా నుంచి టీడీపీ తరఫున 13 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఎస్సీలకు రిజర్వైన రాజోలు, పి.గన్నవరం, అమలాపురం మూడు స్థానాల నుంచీ టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. వారిలో ఏ ఒక్కరికీ మంత్రి పదవి అవకాశం లభించకపోవడాన్ని ఆ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. వీరిలో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారనే కారణంతో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును పక్కన పెట్టినా సీనియర్లు అయిన పులపర్తి నారాయణమూర్తి, గొల్లపల్లి సూర్యారావు మంత్రి పదవికి అర్హులు కారా అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ‘గొల్లపల్లికి ఎంపీ సీటు ఇస్తామని నమ్మించి ద్రోహం చేశారు.
స్థానికంగా కాకున్నా ఎక్కడో రాజోలు సీటు ఇచ్చినా గెలుపొందిన గొల్లపల్లికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించా’రని ఆ పార్టీలోని ఎస్సీలు రగిలిపోతున్నారు. ఇదివరకు మంత్రిగా పనిచేసి, పార్టీ కోసం గత ఏడెనిమిదేళ్లుగా కష్టపడ్డ గొల్లపల్లికి ఇచ్చే గౌరవం ఇంతేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. కోనసీమలో బలమైన సామాజికవర్గాన్ని విస్మరించిన బాబు తీరును వారు గర్హిస్తున్నారు. బీసీలలో బలమైన శెట్టిబలిజ, మత్స్యకార సామాజికవర్గాలు కూడా బాబుపై మండిపడుతున్నాయి. కాకినాడ రూరల్, కాకినాడ సిటీల నుంచి ఎన్నికైన పిల్లి అనంతలక్ష్మి, వనమాడి వెంకటేశ్వరరావులు కేబినెట్‌లో బెర్త్‌లు లభిస్తాయని ఆశించారు. తీరా వారిద్దరిలో ఎవరికీ చోటు దక్కకపోవడంపై ఆ రెండు వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
మార్గమధ్యం నుంచే ‘తోట’ తిరుగుముఖం
మరోపక్క నమ్మించి మోసం చేశారని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న తనకు మంత్రి పదవి ఇస్తానని నమ్మించి టీడీపీలోకి తీసుకువచ్చి, ఇప్పుడు బెర్త్ లేకుండా చేశారని తోట, ఆయన అనుచరవర్గం నిప్పులు కక్కుతున్నారు. మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులందరినీ వెంటబెట్టుకుని బయలుదేరిన తోట విజయవాడ నుంచి వెనుతిరిగారు. తోట సహా అనుచరులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. సోమవారం రామచంద్రపురంలో సమావేశమై భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. మొత్తమ్మీద బాబు తీరు.. జిల్లా టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.